కొంతలో కొంత ఊరట!

ABN , First Publish Date - 2022-04-04T08:25:52+05:30 IST

కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటులో జగన్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో స్వల్పమార్పులు చేసింది.

కొంతలో కొంత ఊరట!

  • మార్పు చేర్పులతో కొత్త జిల్లాల ప్రకటన
  • జిల్లాలు, డివిజన్లు, మండలాల కూర్పుపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు
  • దీంతో వైసీపీ నేతలు,ప్రజాప్రతినిధుల నుంచీ ఒత్తిళ్లు
  • కందుకూరు డివిజన్‌ కొనసాగింపు
  • సొంత డివిజన్లలోకి వచ్చిన కొన్ని మండలాలు
  • ద్వారకాతిరుమల ఏలూరు జిల్లాలోకి పెందుర్తి, మహారాణిపేట విశాఖపట్నం డివిజన్‌లోనే
  • ధర్మవరం డివిజన్‌లో తిరిగి రామగిరి
  • కాకినాడ జిల్లాలోకి తాళ్లరేవు, కాజులూరు
  • మదనపల్లె, మార్కాపురం జిల్లాల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం
  • అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటకూ నో


(అమరావతి-ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటులో జగన్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో స్వల్పమార్పులు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల విన్నపాలు, ఒత్తిళ్లతో కొన్ని మండలాలను తిరిగి వారు కోరిన జిల్లా, డివిజన్ల పరిధిలోకి తెచ్చింది. కందుకూరు రెవెన్యూ డివిజన్‌ను కొనసాగిస్తున్నా.. దానిని నెల్లూరు జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖమైన నాయుడుపేట డివిజన్‌ను తిరుపతి జిల్లాలోకి తీసుకెళ్లినా ముందు ప్రతిపాదించిన నాయుడుపేట డివిజన్‌ను చివరలో మార్చేశారు. సూళ్లూరుపేట కేంద్రంగానే ఆ డివిజన్‌ ఉంటుందని తుది నోటిఫికేషన్‌లో స్పష్టత ఇచ్చారు. డివిజన్‌ భౌగోళిక స్వరూపంలో మార్పు ఉండదని, కానీ హెడ్‌క్వార్టర్‌గా సూళ్లూరుపేట ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రజలకు దూరాభారమయ్యే మండలాల విషయంలోనూ కొన్ని మార్పులు చేసింది. ఆయా అంశాలను గత కొద్దిరోజులుగా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. విశాఖ జిల్లా పెందుర్తి మొదలు నెల్లూరు జిల్లా రాపూరు మండలం వరకు ఆయా ప్రాంతాల పరిధిలో ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక ఇబ్బందులను వివరించింది. ఆయా మండలాల ప్రజలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు సైతం సర్కారుపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దరిమిలా ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకుంది. మొదటి నోటి ఫికేషన్‌లో చేసిన ప్రతిపాదనలను సవరించింది. దీనివల్ల కొంతలో కొంతయినా ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. అయితే రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా.. మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటు డిమాండ్లు, ఇంకా రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నమయ్య జిల్లాకు రాయచోటి స్థానంలో రాజంపేట, పశ్చిమగోదావరికి భీమవరం స్థానంలో నరసాపురం, శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి స్థానంలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ప్రజల విన్నపాలకు, వారి సెంటిమెంట్లకు పాతరేసింది. అక్కడక్కడా కొన్ని స్వల్పమార్పులు చేసినా అంతిమంగా సర్కారు సొంత ఎజెండాతోనే ముందుకుసాగినట్లు తుది నోటిఫికేషన్లు నిరూపిస్తున్నాయి. 


చేసిన మార్పులివీ..

కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరిగి నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చాయి. తొలి నోటిఫికేషన్‌లో వీటిని తిరుపతి జిల్లా కింద ప్రతిపాదించారు. ప్రజల నుంచి విమర్శలు రావడంతో మళ్లీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కలువాయిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లో, రాపూరు, సైదాపురం మండలాలను నె ల్లూరు డివిజన్‌లోకి తీసుకొచ్చారు. 


రాజమండ్రి డివిజన్‌లో ప్రతిపాదించిన పెదపూడి మండలాన్ని తిరిగి కాకినాడ జిల్లా, డివిజన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.


గోకవరం మండలాన్ని తొలుత కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్‌లో ప్రతిపాదించారు. తీవ్ర విమర్శలు రావడంతో తిరిగి తూర్పుగోదావరి జిల్లాలోకి తీసుకొచ్చి రాజమండ్రి డివిజన్‌లో క లిపారు.

తాళ్లరేవు, కాజులూరు మండలాలను కోనసీమ జిల్లాలో చూపించి ఇప్పుడు కాకినాడ జిల్లాలోకి తీసుకొచ్చారు.


సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్‌లో తొలుత ప్రతిపాదించారు. దీనిపై ఆ ప్రాంత ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో తిరిగి ఆ మండలాలను కడప జిల్లాలోకి తీసుకొచ్చారు. 


పార్వతీపురం డివిజన్‌లో ప్రతిపాదించిన గుమ్మలక్ష్మీపురం, కురుపాంను పాలకొండ డివిజన్‌లో, పాలకొండ డివిజన్‌లో ఉన్న గరుగుమిల్లిని పార్వతీపురం డివిజన్‌లో కలిపారు.


ఏలూరు డివిజన్‌లో తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలను కలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లో ప్రతిపాదించిన ద్వారకాతిరుమలను తిరిగి ఏలూరు జిల్లాలోకి తీసుకొచ్చి జంగారెడ్డి గూడెం డివిజన్‌లో భాగం చేశారు.


విశాఖ డివిజన్‌లోని సీతమ్మధార, మహారాణిపేటలను తొలుత భీమిలి డివిజన్‌లో ప్రతిపాదించారు. అయితే విశాఖ కలెక్టరేట్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు మహారాణిపేటలోనే ఉండడంతో దానిని తిరిగి విశాఖ డివిజన్‌లోకి తీసుకొచ్చారు.


తొలి నోటిఫికేషన్‌లో పెందుర్తి మండలాన్ని అనకాపల్లి జిల్లాలో కలపాలని తొలుత ప్రతిపాదించారు. విమర్శలు రావడంతో తిరిగి విశాఖ డివిజన్‌లోనే కొనసాగించారు.


అనకాపల్లి డివిజన్‌లో ఉండేలా ప్రతిపాదించిన మాడుగుల, చీటికాడలను తిరిగి నర్సీసట్నం రెవెన్యూ డివిజన్‌కు తీసుకొచ్చారు.


నూజివీడు డివిజన్‌లో ప్రతిపాదించిన కామవరపుకోట, టి.నరసాపురం మండలాను తిరిగి జంగారెడ్డి గూడెం డివిజన్‌కు తెచ్చారు.


అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలాన్ని తొలుత కల్యాణదుర్గం డివిజన్‌లో కలిపారు. ఇప్పుడు ఈ మండలాన్ని ధర్మవరం డివిజన్‌లోకి తీసుకొచ్చారు. కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలను తిరిగి ధర్మవరంలోకి తీసుకొచ్చారు. 


ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి మైలవరం, జి.కొండూరు మండలాలను తిరువూరు డివిజన్‌లో తొలుత ప్రతిపాదించారు. విమర్శలు, అభ్యంతరాలు రావడంతో వాటిని విజయవాడ డివిజన్‌లోకి తీసుకొచ్చారు. 


కందుకూరు డివిజన్‌ ప్రకాశం జిల్లాలో ఉండేది. ఇందులో కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు మండలాలు ఉన్నాయి. మొదటి నోటిఫికేషన్‌లో కందుకూరు డివిజన్‌ను రద్దుచేశారు. తీవ్ర విమర్శలు రావడంతో అవే మండలాలతో డివిజన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. అయితే దానిని నెల్లూరు జిల్లాలో చేర్చారు.


ఏ జిల్లాలో ఎన్ని డివిజన్లు, మండలాలు..

శ్రీకాకుళంలో మూడు డివిజన్లు, 30 మండలాలు.. విజయనగరం: 3-27.. పార్వతీపురం మన్యం: 2-15.. విశాఖపట్నం: 2-11.. అనకాపల్లి: 2-24.. అల్లూరి సీతారామరాజు జిల్లా: 2-22.. కాకినాడ: 2-21.. కోనసీమ: 3-22.. తూర్పుగోదావరి: 2-19.. ఏలూరు: 3-28.. పశ్చిమ గోదావరి: 2-19.. కృష్ణా జిల్లా: 3-25.. ఎన్టీఆర్‌ జిల్లా: 3-20.. గుంటూరు: 2-18.. పల్నాడు: 3-28.. బాపట్ల: 2-25.. ప్రకాశం: 3-38; శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: 4-38.. కర్నూలు: 3-26.. నంద్యాల: 3-29.. అనంతపురం: 3-31.. శ్రీ సత్యసాయి: 4-32.. వైఎ్‌సఆర్‌: 3-36.. అన్నమయ్య: 3-30.. తిరుపతి: 4-34.. చిత్తూరు జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు, 31 మండలాలు ఉన్నాయి.


అత్యధిక మండలాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనే

26 జిల్లాల రాష్ట్రంలో 1,62,967 చదరపు కిలోమీటర్ల పరిధిలో 73 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. కొత్తగా మండలాల పునర్వ్యవస్థీకరణ చేపట్టకపోవడంతో వాటి సంఖ్యలో ఎలాంటి మార్పులేదు. 4.96 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 38 మండలాల చొప్పున ఉన్నాయి. అయితే నెల్లూరులో 4 రెవెన్యూ డివిజన్లు ఉండగా.. ప్రకాశంలో 3 ఉన్నాయి. 36 మండలాలతో వైఎ్‌సఆర్‌ జిల్లా రెండో స్థానంలో నిలుస్తోంది. 11 మండలాలతో విశాఖ జిల్లా అతిచిన్నదిగా ఉండగా.. ఆ తర్వాత 2 డివిజన్లు, 15 మండలాలతో పార్వతీపురం మన్యం నిలిచింది.


ఆర్డర్‌ టూ సర్వ్‌ కింద..జిల్లాలకు 13,823 మంది ఉద్యోగులు!

అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వివిధ జిల్లాలకు, జోన్లకు 13,823 మంది ఉద్యోగులను ఆర్డర్‌ టూ సర్వ్‌ కింద ప్రభుత్వం తాత్కాలికంగా పంపించనుంది. ఈ ఆర్డర్‌ టూ సర్వ్‌ ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు విధిగా వారికి కేటాయించిన చోటకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల వరకు ఈ ఉత్తర్వులు గెజిట్‌లో వెలువడలేదు. అధికారులు ఆ కసరత్తులోనే నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2022-04-04T08:25:52+05:30 IST