రాష్ట్రంలోకి ఒక్క గ్రామూ రాలేదు!

ABN , First Publish Date - 2021-10-28T08:13:45+05:30 IST

రాష్ట్రంలోకి ఒక్క గ్రామూ రాలేదు!

రాష్ట్రంలోకి ఒక్క గ్రామూ రాలేదు!

హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదు

గంజాయిని మాత్రం ధ్వంసం చేస్తున్నాం: డీజీపీ


అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెరాయిన్‌ లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మరోమారు స్పష్టం చేశారు. హెరాయిన్‌ లాంటి డ్రగ్స్‌ విదేశాల నుంచి దిగుమతి అవుతుంటే గుజరాత్‌లో పట్టుబడిందని, మన రాష్ట్రంలోకి ఒక్క గ్రాము కూడా రాలేదని అన్నారు. స్మగ్లర్లు విజయవాడలో అడ్రస్‌ మాత్రమే వాడుకున్నారని, నరసాపురం నుంచి దుస్తుల్లో ఎగుమతి అయిన డ్రగ్స్‌కు కూడా ఏపీతో సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు పోలీసుశాఖ, ప్రభుత్వం, మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఉమ్మడిగా రూ.13 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నతాధికారులతో కలిసి డీజీపీ సవాంగ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో హెరాయిన్‌ లేదన్నారు. గంజాయి మాత్రం ఏపీ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా సాగవుతోందని చెప్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సెబ్‌, అటవీశాఖ, ప్రభుత్వ అధికారులు, ప్రజల సహకారంతో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నట్లు వివరించారు.  కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో సమాజాన్ని కాపాడేందుకు రోడ్డెక్కి రాత్రింబవళ్లు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించిన పోలీసులు త్యాగమూర్తులని డీజీపీ కొనియాడారు. రాష్ట్రంలో కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు బుధవారం రూ.13 లక్షల చొప్పున జిల్లాల వారీగా అందజేశారు. కరోనా సమయంలో పోలీసు సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారని, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఐపీఎస్‌ అధికారులు పాలరాజు, క్రాంతి రాణా టాటా, జిల్లా ఎస్పీలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబానికి ప్రభుత్వం, పోలీసుశాఖ అందిస్తున్న సాయంతోపాటు ఒక్కో బాధిత కుటుంబానికి రూ.3లక్షలు అందించిన మ్యాన్‌కైండ్‌ సీఈవో రాజీవ్‌ను డీజీపీ అభినందించారు.

Updated Date - 2021-10-28T08:13:45+05:30 IST