ల్యాప్‌టాప్‌లు లేవు.. అందరికీ 13వేలే! అమ్మఒడిపై మడమ తిప్పారు!

ABN , First Publish Date - 2022-06-23T14:47:32+05:30 IST

అమ్మఒడి వద్దనుకున్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఇచ్చిన హామీపై ప్రభుత్వం మడమ తిప్పింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి అడిగిన వారికి ల్యాప్‌టాప్‌ ఇస్తామని, లేదంటే ఎప్పటిలాగే అమ్మఒడి నగదు అందజేస్తామని సీఎం జగన్‌ స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేసింది. 9, 10, ఇంటర్‌ రెండు సంవత్సరాల విద్యార్థులకు...

ల్యాప్‌టాప్‌లు లేవు.. అందరికీ 13వేలే! అమ్మఒడిపై మడమ తిప్పారు!

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు లేవు

వీటి కోసం 5 లక్షల మంది ఆప్షన్లు

అందరికీ రూ.13 వేల నగదే జమ


అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): అమ్మఒడి(Amma Odi) వద్దనుకున్న వారికి ల్యాప్‌టాప్‌(Laptop)లు ఇస్తామని ఇచ్చిన హామీపై ప్రభుత్వం మడమ తిప్పింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి అడిగిన వారికి ల్యాప్‌టాప్‌ ఇస్తామని, లేదంటే ఎప్పటిలాగే అమ్మఒడి నగదు అందజేస్తామని సీఎం జగన్‌(cm jagan) స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేసింది. 9, 10, ఇంటర్‌ రెండు సంవత్సరాల విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం విద్యార్థుల నుంచి ఆప్షన్లు కోరగా సుమారు 5.43 లక్షల మంది అమ్మఒడికి బదులుగా ల్యాప్‌ట్యాప్‌లు కావాలని ఆప్షన్‌ ఇచ్చారు. ఇటీవల పలు సమీక్షల్లో కూడా సీఎం జగన్‌ ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని చెప్పుకొచ్చారు. తీరా బడులు తిరిగి ప్రారంభించే సమయం రాగానే అందరికీ అమ్మఒడితోనే సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి ల్యాప్‌ట్యాప్‌ల పంపిణీ లేదని తేల్చేసింది. 


కాగా, పాఠశాల విద్యాశాఖ సాంకేతిక కారణాల వల్లే ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వలేకపోతున్నట్టు ప్రకటించింది. కొవిడ్‌ నేపథ్యంలో ల్యాప్‌ట్యాప్‌ల ఉత్పత్తి తగ్గిందని, ఒకేసారి 5.43 లక్షల ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ చేసే సంస్థలు దొరకనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇదే విషయంపై బుధవారం ఇంటర్‌ ఫలితాల సమయంలో మంత్రి బొత్సను విలేకరులు ప్రశ్నించగా... ల్యాప్‌టాప్‌ల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, ధర ఎక్కువ ఉన్నందున ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని చెప్పారు. ఇదిలావుంటే, పాఠశాల విద్యశాఖ మాత్రం అందరికీ అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. 


అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకటించింది. అయితే, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరిట ఈ ఏడాది రూ.2 వేలు కోత పెట్టి రూ.13 వేలకు పరిమితం చేసింది. దీంతో ఈ ఏడాదికి ల్యాప్‌టా‌ప్‌లైనా తీసుకుందాంలే అనుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు షాక్‌ ఇచ్చినట్టు అయిందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2022-06-23T14:47:32+05:30 IST