అప్పుల కోసం ఆస్తుల తాకట్టు.. ఇదేనా జగన్ పాలన..

ABN , First Publish Date - 2021-06-11T17:36:57+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సంలో రికార్డు స్థాయిలో అప్పులు చేసింది.. ఇంకా..

అప్పుల కోసం ఆస్తుల తాకట్టు.. ఇదేనా జగన్ పాలన..

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సంలో రికార్డు స్థాయిలో అప్పులు చేసింది.. ఇంకా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి అయితే జరగడం లేదుగానీ, అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. ఏపీలో కొత్తగా ఎన్ని రోడ్లు వేశారని అడగొద్దు.. ఎక్కడైనా కొత్తగా భవనాలు కట్టారేమో వెతకొద్దు.. ఇవేవీ లేకున్నా.. రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఆస్తులను తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇదంతా అప్పులు తెచ్చేందుకే..


రోడ్లు భవనాల శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో చాలా విలువైన భవనాలు, అతిధిగృహాలు, క్వార్టర్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటన్నింటి విలువ దాదాపు రూ. 5వేల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది. ఆ ఆస్తులు చూపించి త్వరలో అప్పుల కోసం బ్యాంకులను సంప్రదించేందుకు కసరత్తు ప్రారంభించింది.


ఈ అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే పొరపాటే.. కొత్తగా తేబోయే అప్పు.. అచ్చంగా పాత అప్పుల వడ్డీ తీర్చడం కోసమే ఇదంతా. గత ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వం వడ్డీల రూపంలో రూ. 35వేల కోట్లు చెల్లించింది. అంటే నెలకు రూ. 2916 కోట్లు. ఇప్పుడు ఆర్ అండ్ బి ఆస్తులు తాకట్టు పెట్టినా మూడు నెలల అప్పు వడ్డీ కూడా కట్టలేరు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ రాష్ట్ర ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించకపోగా ప్రభుత్వ శాఖల ఆస్తులు తనఖ పెట్టడానికే ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది.

Updated Date - 2021-06-11T17:36:57+05:30 IST