‘మాస్క్‌తో పాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి’

ABN , First Publish Date - 2020-06-07T03:44:15+05:30 IST

దేశ వ్యాప్తంగా కాకుండా రాష్ట్రంలోను నమోదవుతున్న కరోనా కేసుల్లో 70శాతం వరకూ కేసులు పట్టణ

‘మాస్క్‌తో పాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి’

అమరావతి : దేశ వ్యాప్తంగా కాకుండా రాష్ట్రంలోను నమోదవుతున్న కరోనా కేసుల్లో 70శాతం వరకూ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆమె జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఇతర వైద్యాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. పట్టణాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని అధికారులను సాహ్ని ఆదేశించారు.


ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రుల్లో పనిచేసేవారు ఆరోగ్య సేతు యాప్‌ను తప్పకుండా వాడాలని సూచించారు. పట్టణాల్లో కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో అర్బన్ హెల్త్ సెంటర్ల సంఖ్య రెట్టింపు చేస్తామని సీఎస్‌ తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లోని ప్రైమరీ, సెకండరీ సర్వెలెన్స్ అండ్ మానిటరింగ్ బృందాలు సమర్ధవంతంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ప్రతి వార్డు సచివాలయాన్ని ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఒక వేళ చిన్న మున్సిపాలిటీలై ఒకటికంటే ఎక్కువ పట్టణ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకుంటే దగ్గర లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంతో అవార్డు సచివాలయాన్ని అనుసంధానించాలని సీఎస్ స్పష్టం చేశారు.


Updated Date - 2020-06-07T03:44:15+05:30 IST