సోము వీర్రాజుపై ఫిర్యాదుకు సిద్ధమైన బీజేపీ నేతలు..!

ABN , First Publish Date - 2020-09-15T18:02:32+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కాషాయ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెటుకున్న కమలం పార్టీ పెద్దలు ఆ దిశగా పావులు కదుపుతున్నారా? కొత్త రథ సారథి చెప్పిన వారికే రాష్ట్ర కమిటీలో

సోము వీర్రాజుపై ఫిర్యాదుకు సిద్ధమైన బీజేపీ నేతలు..!

ఆంధ్రప్రదేశ్‌లో కాషాయ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెటుకున్న కమలం పార్టీ పెద్దలు ఆ దిశగా పావులు కదుపుతున్నారా? కొత్త రథ సారథి చెప్పిన వారికే రాష్ట్ర కమిటీలో పెద్దపీట వేశారా? కార్యవర్గం కూర్పుపై సంఘ్ ముద్రతోపాటు ఢిల్లీలో కొందరు నేతలు చేసిన సిఫార్సులు పని చేశాయా? ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్లను కావాలనే విస్మరించారా? గత అధ్యక్షుడి అనుచర గణాన్ని పక్కనబెట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటి? అసలు కార్యవర్గ కూర్పులో హస్తినలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..


ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. ఇందుకోసం పార్టీలో మార్పులు చేస్తోంది. కొన్నిరోజుల క్రితం ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన జాతీయ నాయకత్వం.. తాజాగా రాష్ట్ర బీజేపీ కొత్త టీమ్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 40 మందితో ఏపీ బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటైంది. సోము వీర్రాజు కొత్త టీమ్‌లో 10 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. కార్యవర్గం కూర్పుపై అప్పుడే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న హార్డ్‌కోర్ నేతలను పక్కన బెట్టడంపై దుమారం రేగుతోంది.


పని చేసేవాళ్లు పది మంది అయినా చాలని..

ఈసారి జంబో కార్యవర్గం కాకుండా నలభై మందితో బీజేపీ కొత్త కార్యవర్గాన్ని నియమించింది. కార్యవర్గాన్ని కుదించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హైకమాండ్‌కు సూచించారు. పని చేసేవాళ్లు పది మంది అయినా చాలని ఆయన హైకమాండ్ పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు కార్యవర్గం కూర్పుపై సంఘ్ ముద్ర కనిపిస్తున్నప్పటికీ ఢిల్లీలో కొందరు నేతలు చేసిన సిఫార్సులు కూడా పని చేశాయని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినా పార్టీలోని సీనియర్ నేతలను విస్మరించారనే భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పదవులు ఉన్నవారికి పార్టీ పదవులు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రాంతాల వారీగా సమతుల్యం పాటించామని గొప్పలు చెబుతున్నారనీ.. ప్రకాశం జిల్లాకు రిక్తహస్తం చూపించారని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న పి.ఎన్.వి. మాధవ్‌కు, నెహ్రూ యువ కేంద్రం వైస్ ఛైర్మన్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులను కట్టబెట్టారు.


తన ముద్ర బలంగా ఉండాలనే..

బీజేపీ కొత్త కార్యవర్గంలో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కులాల వారీగా కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకు పెద్దపీట వేశారు. మరోవైపు పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తున్న కొంతమందిని విస్మరించారనే నిరసనలు అంతర్గతంగా సాగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులకు మొండిచేయి చూపడం పట్ల పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. అధికార పార్టీ నేతలకు ధీటుగా సమాధానం ఇచ్చేవారికి ప్రాధాన్యం ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి అనుచరుడు చందు సాంబశివరావుకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంపై సోము వీర్రాజు తన ముద్ర బలంగా ఉండాలని కోరుకున్నట్లు కార్యవర్గం కూర్పును పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 


విశాఖకు ప్రాతినిథ్యం కల్పించాలనే..

ఏపీ బీజేపీ కార్యవర్గం కూర్పులో ఉత్తరాంధ్ర నేతలకు పార్టీలో పెద్దపీట వేయడం చూస్తే.. విశాఖను ప్రభుత్వం పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర కార్యవర్గంలో సంఘ్ ప్రభావం ఉన్న చాలామంది నేతలకు చోటు దక్కింది. గతంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన నాగోతు రమేష్ నాయుడును రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. 2014 నుంచి 2019 వరకు శాసనసభా పక్షనేతగా పని చేసిన విష్ణుకుమార్ రాజును ఉపాధ్యక్షుడిని చేశారు.  ఇప్పటివరకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న విల్సన్‌కు కార్యవర్గంలో స్థానం కల్పించకపోవడాన్ని పార్టీలోని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇలా వైరుధ్యాలు కనిపిస్తున్నప్పటికీ కార్యవర్గ కూర్పులో ఢిల్లీలోని ఓ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర అధ్యక్షుడి ముద్రతో పాటు, సంఘ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. కార్యవర్గంలో చోటు దక్కని హార్డ్ కోర్, సంప్రదాయవాదులు మాత్రం ఈ వ్యవహారాలన్నీ సరైన సమయంలో హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ కూర్పును వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు అంతర్గతంగా పంపుతున్నట్లు సమాచారం. మరి అసంతృప్త నేతలను హైకమాండ్ పెద్దలు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

Updated Date - 2020-09-15T18:02:32+05:30 IST