ఐటీ, స్టార్టప్‌ హబ్‌గా ఏపీ

ABN , First Publish Date - 2021-07-01T09:24:00+05:30 IST

ఐటీ, విద్యా నైపుణ్యం, స్టార్టప్‌ హబ్‌గా రాష్ట్రం అభివృద్ది చెందుతోందని మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని చెప్పారు

ఐటీ, స్టార్టప్‌ హబ్‌గా ఏపీ

దేశంలోనే ఎవరూ చేయని విధంగా ‘జాబ్‌ క్యాలెండర్‌’

విశాఖలో ‘గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌, స్టార్టప్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌పో’ 

బ్రోచర్‌ విడుదల చేసిన మంత్రులు సురేశ్‌, గౌతమ్‌ రెడ్డి  


అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఐటీ, విద్యా నైపుణ్యం, స్టార్టప్‌ హబ్‌గా రాష్ట్రం అభివృద్ది చెందుతోందని మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బుధవారం ‘గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌, స్టార్టప్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌పో’ బ్రోచర్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ- విద్యా శాఖలు సంయుక్తంగా టెక్‌మార్క్‌ ఇండియా సౌజన్యంతో నవంబరు 18, 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో సదస్సు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుందనే ఆర్భాటపు ప్రచారాలు చేసినవారిని చూశామన్నారు. మేనిఫెస్టో, యువతకు ఇచ్చిన అనేక హామీలు, నిరుద్యోగ భృతి వంటి మాటలు నీటిమూటలయ్యాయని విమర్శించారు. కానీ, సీఎం జగన్‌ నాయకత్వంలో హామీలకు మించి చేస్తున్నామని చెప్పారు. కొవిడ్‌ విపత్తు వచ్చినా .. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా లక్షలాది ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. దేశంలోనే ఇప్పటి దాకా ఎవరూ చేయనివిధంగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశామన్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్ల కాలంలోనే విద్య నుంచి ఉపాధి వరకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. సాంకేతికతతోనే చిన్నారులకు, యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యకు టెక్నాలజీ, నైపుణ్యం జోడించినప్పుడే మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.  

Updated Date - 2021-07-01T09:24:00+05:30 IST