పోలవరం కొత్త డీపీఆర్‌ ఏదీ?

ABN , First Publish Date - 2021-08-06T09:03:07+05:30 IST

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాలకు సంబంధించి సవరణలు అందజేస్తే చాలదని.. తాజాగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సమర్పించాలని కేంద్రం కోరుతోంది. మరోవైపు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్సులు..

పోలవరం కొత్త డీపీఆర్‌ ఏదీ?

నివేదిక ఇస్తేనే అంచనాల సవరణ!

55,656 కోట్లకు ఆమోదించిన టీఏసీ 

కేంద్ర ఆర్థిక కమిటీ 47,725 కోట్లకు ఓకే

ఈ అంచనాలపై ఎటూ తేల్చని కేంద్రం

పీపీఏ వద్దే ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్సు ఫైలు

కొత్త ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టాలని పీపీఏకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

రోజుకో మలుపు తిరుగుతున్న ప్రాజెక్టు ‘కథ’


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాలకు సంబంధించి సవరణలు అందజేస్తే చాలదని.. తాజాగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సమర్పించాలని కేంద్రం కోరుతోంది. మరోవైపు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్సులు రూ.47,725.61 కోట్లకు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైలు గడచిన ఏడు నెలలుగా పెండింగ్‌లోనే ఉంది. అదేవిధంగా.. కేంద్రం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల బకాయి ఇప్పటికీ రాలేదు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా సమాచారం వస్తే వెనువెంటనే తమకు చేరవేయకుండా, పెండింగ్‌లో ఉంచాలంటూ పీపీఏకు కేంద్రం సూచించిందని నీటి పారుదల రంగ  నిపుణులు చర్చించుకుంటున్నారు. 2018 మే 21న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని సాంకేతిక సలహా మండలి(టీఏసీ) 2017-18 అంచనాల మేరకు పోలవరం వ్యయం రూ.55,656.87 కోట్లుగా ఆమోదించింది. ఆ తర్వాత.. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని కమిటీ ఈ అంచనాలను సవరించి రూ.47,725.47 కోట్లుగా పేర్కొంది. ఇప్పటి దాకా.. ఈ రెండు అంచనాలపైనే కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులు జరుపుతోంది.


ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లకు రాసిన లేఖల్లోనూ సాంకేతిక సలహా మండలి ఆమోదించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను పరిగణనలోకి తీసుకుని నిధులు ఇవ్వాలని.. లేదంటే సవరించిన అంచనా వ్యయం రూ.47,725.47 కోట్లను లెక్కలోకి తీసుకుని నిధులు ఇవ్వాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కూ వివరించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు.. కేంద్ర మంత్రులు షెకావత్‌, నిర్మలా సీతారామన్‌లను వ్యక్తిగతంగా కలిసి.. టీఏసీ ఆమోదించిన సవరణ అంచనాలను ఆమోదించాలని కోరారు. దీనిపై.. త్వరలోనే కేబినెట్‌ ఆమోదం పొందుతామని షెకావత్‌ హామీ ఇచ్చినట్లు ఎంపీల బృందం వెల్లడించింది. కానీ.. ఇప్పటివరకు టీఏసీ ఆమోదించిన అంచనాల ఫైలు షెకావత్‌ పేషీ నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు వెళ్లలేదు. ఇదిలావుంటే, ఇటీవల రాజ్యసభలో షెకావత్‌ సమాధానం ఇస్తూ.. పోలవరం డీపీఆర్‌ రాలేదని, ఇలాంటి ఫైలు పెండింగులో కూడా లేదని తేల్చి చెప్పారు. పైగా.. పోలవరం అంచనా వ్యయం కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన మేరకు రూ.20,398.87 కోట్లు మాత్రమే చెల్లిస్తామని.. భూసేకరణ, సహాయ పునరావాసాలకు అయ్యే వ్యయాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వెల్లడించారు. దీంతో 2017-18 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం పొందే వీలుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. డీపీఆర్‌ లేకుండా.. పాత అంచనాలను సవరించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చేయడం గమనార్హం.


నిర్వాసితుల ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకోం: రామకృష్ణ

న్యూఢిల్లీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘‘పోలవరం ముంపు ప్రాంతంలో అధిక సంఖ్యలో గిరిజనులే ఉన్నారు. నిర్వాసితుల ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదు. ప్రాజెక్టు పూర్తి కాకముందే నిర్వాసితులకు పరిహారం, సహాయ పునరావాస ప్యాకేజీలు అమలు చేయాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఏపీ భవన్‌లో పోలవరం నిర్వాసితులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-06T09:03:07+05:30 IST