ప్రజాపోరాటాలతోనే బీజేపీ వ్యతిరేక కూటమి!

ABN , First Publish Date - 2022-10-08T10:11:52+05:30 IST

ప్రజా పోరాటాల ద్వారానే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ సాధ్యమని సీపీఐ మాజీ జాతీ య ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.

ప్రజాపోరాటాలతోనే బీజేపీ వ్యతిరేక కూటమి!

అందులో వామపక్షాలదే ప్రధాన పాత్ర: సురవరం..

 మనపై నిర్బంధాన్ని మనమే ఆమోదిస్తున్నాం: కె.శ్రీనివాస్‌

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా పోరాటాల ద్వారానే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ సాధ్యమని సీపీఐ మాజీ జాతీ య ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ ప్రక్రియలో వామపక్షాలు ప్రధాన పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ విధానాలతో పాటు కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై అనుసరిస్తున్న వైఖరులు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలపైకి రాజ్యాంగ వ్యవస్థలను ఉసిగొల్పుతూ, వాటిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. మోదీ సర్కారు ఫాసిస్టు ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. సీపీ ఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ‘దేశంలో పరిణామాలు.. మేధావుల విశ్లేషణ’ అనే అంశంపైమగ్దూంభవన్‌లో శుక్రవారం సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సభాధ్యక్షత వహించగా సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.  ఏం తినాలో, ఏం ఆలోచించాలో కూడా డిజైన్‌ చేయడానికి ఫాసిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు’ అన్నట్లుగా మారిన పరిస్థితిని చక్కదిద్దేందుకు చివరి అవకాశం ఉందని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. 


‘‘దేన్నయితే కోల్పోతున్నామో, సమాజం ఏ దశ వరకు మునిగిపోతోందో దాన్ని ఆపి కొంత వెనక్కి తీసుకురావడమే ఈ చివరి అవకాశం. ఫాసిజం దుర్మార్గం ఎక్కడ ఉంటుందంటే.. మనపై ఉండే నిర్బంధాన్ని మనమే ఆమోదిస్తున్నాం. మన మంచికోసమే మనల్ని కొడుతున్నారని అనుకుంటాం. డబ్బున్న వాళ్లను దెబ్బతీయడానికే నోట్లు రద్దు చేశారని బ్యాంకు ముందు క్యూలో నిల్చున్న వ్యక్తిఅనుకుంటాడు. దేశభక్తి లేకపోతే ఎలా!? అంటే.. మనపై జరిగే దాడిని, మన జేబుకు పడే చిల్లును కూడా సమర్థించుకుంటాం’’ అని చెప్పారు. వ్యవస్థ పట్ల పూర్తి సమ్మతి ఉన్న మనుషులుగా ఫాసిజం తయారు చేస్తోందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు వ్యతిరేకంగా ప్రధాన పత్రికలు, టీవీల్లో ఒక వార్త కూడా రాదని ప్రజాపక్షం ఎడిటర్‌ కె.శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఇటీవల బొడ్రాయి పండుగ, బతుకమ్మ పండుగల పేర్లతో ఆధిపత్య మతభావజాలాన్ని ఊరూరా తీసుకెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయని ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్‌ సి.కాశీం అన్నారు.  మార్క్సిజాన్ని మించిన సత్య సిద్ధాంతం మరొకటి లేదని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న స్పష్టం చేశారు. సంస్కృతి పేరుతో ఏమీ చేయని బీజేపీ.. ప్రజలను దోపిడీ చేసే సంస్కృతిని తీసుకొచ్చి, అధికారంలోకి వచ్చిందని ప్రజా గాయకుడు గద్దర్‌ విమర్శించారు.  

Updated Date - 2022-10-08T10:11:52+05:30 IST