అంతర్యామి అంటే?

ABN , First Publish Date - 2020-11-18T09:57:34+05:30 IST

ప్రాచీనకాలంలో విదేహరాజు జనకుడి కొలువులో ఉద్దాలకుడు.. యాజ్ఞవల్క్యుని ఇలా ప్రశ్నించాడు. ‘‘ఓ యాజ్ఞవల్క్యా! మేము కొందరు

అంతర్యామి అంటే?

ప్రాచీనకాలంలో విదేహరాజు జనకుడి కొలువులో ఉద్దాలకుడు.. యాజ్ఞవల్క్యుని ఇలా ప్రశ్నించాడు. ‘‘ఓ యాజ్ఞవల్క్యా! మేము కొందరు మిత్రులం యజ్ఞశాస్త్రాన్ని అభ్యసించడానికి మద్ర దేశంలోని పతంజలి ఇంట్లో కొంతకాలము నివసించాం. ఒకరోజు ఆ ఇంటికి వచ్చిన కబంధుడు అనే గంధర్వుడు పతంజలుని, మమ్ములను ఇహ పరలోకాలు, సర్వభూతాలు సూత్రమందు మణులవలె దేనియందు కూర్చున్నవి? ఈ లోకంలో, పరలోకంలో సర్వభూతాలను లోపల నుంచి నడిపిస్తున్న అంతర్యామిని గూర్చి మీకేమైనా తెలుసా? అని ప్రశ్నించారు. మేము తెలియదనగా.. కబంధుడు అంతర్యామిని గురించి కొంతసేపు చర్చించి.. మాకు విశదపరిచాడు. అదంతా నాకు తెలుసు. నీకు తెలిసినచో చెప్పుము’’ అని వ్యాఖ్యానించాడు.

యాజ్ఞవల్క్యుడు మాట్లాడుతూ.. ‘‘ఆ సూత్రమును అంతర్యామిని గురించి నాకు తెలుసు. బ్రహ్మాండమున వాయువు.. పిండమున ప్రాణము అనునవే నీ వడిగిన సూత్రము. దానియందే ఇహపరలోకాలు అన్ని భూతాలు దారమునందు పూసలవలె కూర్చబడి ఉన్నాయి. ప్రాణ వాయువు అనే సూత్రమందే జీవించియున్నవాని అంగములన్నీ కూర్చబడి ఉన్నాయి’’ అని వివరించాడు.


దానికి ఉద్దాలకుడు మాట్లాడుతూ.. ‘‘సరిగానే ఉన్నది. ఇక అంతర్యామి గురించి చెప్పు’’ అని కోరగా.. యాజ్ఞవల్క్యుడు ఇలా చెప్పాడు. ‘‘ఎవడు భూమియందు నిలిచియుండీ.. భూమి కంటే వేరై భూమిచే తెలియబడక భూమి తనకు శరీరముగా గలిగి భూమిలోపల నుండి నడిపించుచున్నాడో వాడే నీవడిగిన అంతర్యామి ఆత్మ. నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్న అంతర్యామి మరణం లేని వాడు. ఇదే విధంగా ఎవడు నీరు, అగ్ని, అంతరిక్షము, గాలి, దివము, సూర్యడు, దిక్కులు, చంద్రుడు, చుక్కలు, నింగి, చీకటి వెలుగు, ప్రాణులు, ప్రాణము, కన్నులు, వాక్కు, చెవులు, మనసు, చర్మము, జ్ఞానము, రేతస్సు వీటి అన్నింటియందు నిలిచియుండి వీటి అన్నింటికంటే వేరె ౖ.. వాటిచే తెలియబడక వాటిని తనకు శరీరముగా గలిగి వాటి లోపలనుండి నడిపించుచున్నాడో వాడే నీవడిగిన అంతర్యామి ఆత్మ. ఎవడు సర్వమునందు నిలిచియుండి సర్వముకంటే వేరై సర్వముచే తెలియబడక సర్వము తన దేహము కాగా సర్వము లోపల నుండి నడిపించుచున్నాడో వాడే నీవడిగిన అంతర్యామి ఆత్మ’’ అని చెప్పాడు.


ఆ అంతర్యామిని కనులు చూడలేవు. చెవులు వినలేవు. మనసు అతడిని తెలియజాలదు. తెలివిచేత తెలియబడడు. కాని ఆ అంతర్యామి విశ్వ ద్రష్ట, శ్రోత, మత, విజ్ఞాత. అతడే అంతర్యామి బ్రహ్మము. మిగిలినదంతా నశించేదే. అని యాజ్ఞవల్క్యుడు తెలుపగా ఉద్దాలకుడు సమ్మతించి మౌనము వహించెను.


జక్కని వేంకటరాజం

Updated Date - 2020-11-18T09:57:34+05:30 IST