అమెరికా ముంగిట మరో మాంద్యం

ABN , First Publish Date - 2022-05-17T06:01:48+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతోంది. అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు గోల్డ్‌మన్‌ శాక్స్‌ సీనియర్‌ చైర్మన్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫీన్‌ హెచ్చరించారు.

అమెరికా ముంగిట మరో మాంద్యం

హెచ్చరించిన గోల్డ్‌మన్‌ శాక్స్‌

భారత్‌పై ప్రభావం తప్పకపోవచ్చు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతోంది. అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు గోల్డ్‌మన్‌ శాక్స్‌ సీనియర్‌ చైర్మన్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫీన్‌ హెచ్చరించారు. సీబీఎస్‌ టీవీ ఆదివారం నిర్వహించిన ‘ఫేస్‌ ది నేషన్‌’ కార్యక్రమంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. కంపెనీలు, వినియోగదారులు ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా బ్లాంక్‌ఫీన్‌ స్పష్టం చేశారు.    

ఎందుకంటే?: కొవిడ్‌కు ముందు నుంచే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటి నడక నడుస్తోంది. వడ్డీ రేట్లు దాదాపు జీరో స్థాయికి తగ్గించడం ద్వారా ఫెడ్‌ రిజర్వ్‌ ఆర్థిక వ్యవస్థను ఎలాగోలా నెట్టుకొచ్చింది. ఇందుకోసం చెల్లింపు సామర్ధ్యం పట్టించుకోకుండా కంపెనీల నుంచి దాదాపు 9 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.697.5 లక్షల కోట్లు) విలువైన రుణ పత్రాలను కొనుగోలు చేసింది. ప్రభుత్వమూ పన్నుల రేటు తగ్గించి ఆదుకుంది. అయినా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఒనగూరిందేమీ లేదు. 

ధరల సెగ: ఇప్పుడు అమెరికా కూడా ధరల సెగతో అల్లాడిపోతోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇందుకు మరిం త ఆజ్యం పోసింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. దీన్ని ఎదుర్కొనేందుకు ఫెడ్‌ రిజర్వ్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఒకేసారి కీలక వడ్డీ రేటు అర శాతం పెంచేసింది.ఈ ఏడాది చివరికి మరో ఒక శాతం వరకు పెంచే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీనికి తోడు పదేళ్ల ప్రభుత్వ రుణ పత్రాల కంటే ఏడాది, రెండు మూడేళ్ల రుణ పత్రాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక మాంద్యానికి ఇది ప్రధాన సంకేతమని ఆర్థిక నిపుణులు అంచనా. 

భారత్‌పై కూడా: అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారితే, ఆ ప్రభావం మన దేశంపైనా తప్పకపోవచ్చు. ఎందుకంటే మన విదేశీ వాణిజ్యంలో పెద్ద వాటా అమెరికాదే. ఐటీ ఎగుమతులకైతే  అమెరికానే పెద్ద దిక్కు. దీంతో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్న వార్త లు భారత ఐటీ రంగాన్నీ భయపెడుతోంది. 

Updated Date - 2022-05-17T06:01:48+05:30 IST