Abn logo
Oct 20 2020 @ 03:30AM

అన్నపూర్ణే సదా పూర్ణే..

Kaakateeya

భారతీయ జీవన విధానాన్ని చైతన్యవంతం చేసే పర్వదినాలలో ఆశ్వయుజమాసంలోని శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. వీటిలో వైయక్తిక, సామూహిక పూజలన్నింటికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి ఆలయాల్లో తొమ్మిది రోజులలో తొమ్మిది అవతారాలలో అమ్మవారిని పూజించడం భక్తులకు వాడుక, వేడుక. ఈ క్రమంలో ఉత్తర భారత దేశంలో నవదుర్గావతారాల అలంకారాలలోఆయా శక్తి మూర్తులను అలంకరిస్తారు. మైసూర్‌లో చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో అలంకారాలు ఒక విధంగా ఉంటాయి. విజయవాడలోని కనకదుర్గమ్మవారి ఆలయంలో ఒక క్రమంలో ఉంటాయి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయక్రమంలో ఈ రోజున అమ్మవారి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి. కాశీలో పరమశివునికి కూడా భిక్షను వేసి ఆ జగజ్జనకుని ఆకలిని తీర్చిన జగజ్జనని రూపం.. అన్నపూర్ణాదేవి అలంకారం. మధురస భరితమైన మాణిక్య పాత్రను ఎడమ చేతిలో ధరించి, కుడిచేత దివ్యాన్నముతో కూడిన బంగారు గరిటను ధరించినదై పద్మాసనస్థగా దర్శనమిచ్చే తల్లి అన్నపూర్ణాదేవి.

 

ఈ అనంతకోటి బ్రహ్మాండాలకు మూలభూతమైన పరబ్రహ్మమునకు అదితి అని పేరు. కారణం ప్రళయకాలంలో మృత్యువై ఆ బ్రహ్మమే ఈ విశ్వమంతటినీ కబళించి బీజరూపంలో తన గర్భంలో దాచుకోవడం వల్ల ఆ బ్రహ్మమే అదితి అని పిలువబడుచున్నది. ఈ విషయం వేదాల్లోని అదితి సూక్తంలో, బృహదారణ్యక ఉపనిషత్తులో, తదితర గ్రంథాల్లో చెప్పబడింది. అక్కడ అదితి శబ్దాన్ని.. ‘అదనాత్‌ అదితిః (అనగా విశ్వాన్ని అన్నంగా తింటుంది కనుక అదితి)’ అని వివరించారు. ‘‘అదితిర్‌ ద్యౌః అదితిరంతరిక్షమదితిర్మాతా అదితిః పితా’’అన్న మంత్ర వాక్యాలను బట్టి అదితి ఊర్థ్వ లోక సముదాయం. అదితి అంతరిక్షం. సర్వ జీవులకూ తల్లి. అదితియే అందరికీ తండ్రి.. అనే వైదిక మంత్రాల నుండి ‘అదితి అంటే సర్వ విశ్వమును అన్నంగా భుజించేమృత్యు రూప పరబ్రహ్మమే’ అని గ్రహించాలి. ఈ అదితి కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి కాదు. ఇలా చిన్న జీవ రాశుల నుంచి మృత్యువు వరకూ, ఆ మృత్యువును కూడా నిలువరించిన శివ మహాదేవుని వరకూ.. అందరికీ ఆకలిని తీర్చే దయామయి నిఖిల శక్తి స్వరూపిణి అన్నపూర్ణాదేవి.


ఈ రోజున అన్నపూర్ణాదేవిని అర్చించే సమయంలో షోడశోపచార పూజను చేసి పూజ పూర్తి అయ్యాకా ప్రసాదాన్ని గ్రహించి అన్నదానం చేయటం సముచితమైన విషయం.   ‘‘అన్నదస్య మనుష్యస్య బలమోజో ధనాని చ, కీర్తిశ్చ వర్ధతే శశ్వత్‌ త్రిషు లోకేషు పాండవ’’ అని అగ్నిపురాణం చెప్పింది. అంటే.. అన్నదానం చేసినవారికి బలం ఓజస్సు, ధనం, ముల్లోకాలలో శాశ్వత కీర్తి లభిస్తాయని అర్థం. అంతే కాక అన్నపూర్ణార్చన చేసిన వారి అన్నమయకోశం శుద్ధమై సాధనామార్గంలో పురోగతిని సాధిస్తారట. పూజావసానంలో.. 


అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి

అని స్తుతి చేయాలి. మనకు జ్ఞానవైరాగ్యములను ఆహారముగా అనుగ్రహించాలని ఆ తల్లిని కోరుతూ చేసే ప్రార్థన ఇది.

ఆచార్య రాణి సదాశివ మూర్తి

Advertisement
Advertisement