అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ‘అన్నపూర్ణ’ భోజన పథకం

ABN , First Publish Date - 2020-04-03T20:32:31+05:30 IST

నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా సందర్శకులు, పర్యాటకులు, విద్యార్ధులు, చిరువ్యాపారులు, చిరుద్యోగులకు మధ్యాహ్నం పూట నాణ్యమైన సమతుల ఆహారాన్నివేడివేడిగా అందించడమే అన్నపూర్ణ భోజన పథకం ప్రధాన ఉద్దేశం.

అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ‘అన్నపూర్ణ’ భోజన పథకం

హైదరాబాద్‌: నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా సందర్శకులు, పర్యాటకులు, విద్యార్ధులు, చిరువ్యాపారులు, చిరుద్యోగులకు మధ్యాహ్నం పూట నాణ్యమైన సమతుల ఆహారాన్నివేడివేడిగా అందించడమే అన్నపూర్ణ భోజన పథకం ప్రధాన ఉద్దేశం. ఆరు సంవత్సరాల క్రితం జీహెచ్‌ఎంసి ద్వారా 8 కేంద్రాలతో ప్రారంభమైన అన్నపూర్ణ భోజన పథకం ప్రస్తుతం 150 కేంద్రాలకు విస్తరించింది. ప్రధానమైన ఆసుపత్రులు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, కూలీల అడ్డాలు, విద్యాసంస్థలు, కోచింగ్‌సెంటర్లుఉన్న ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. ప్రతి భోజనంతో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబార్‌, పచ్చడి తప్పని సరిగా ఉండే విదంగా మెనూను అమలుచేస్తున్నారు. జీహెచ్‌ఎంసి అమలుచేస్తున్న ఈపథకం అన్నివర్గాల ఆదరణ చూరగొంటోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేం్ద, రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రవాణా వ్యవస్ద నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్తక, వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు మూసివేయడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.


ప్రస్తుత పరిస్థితిలో భోజనానికి ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు, నిరాశ్రయులు, వసతి గృహాలలో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాంటి  వారందరి ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకు పెడుతున్న అన్నపూర్ణ భోజనాన్న పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. నగరంలోని 150 కేంద్రాల ద్వారా అందిస్తున్న అన్నపూర్ణ ఉచిత భోజనంతో మధ్యాహ్నం పూట 38వేల మంది ఆకలి తీరుస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపద్యంలో వసతి గృహాలు, షెల్టర్‌హోమ్స్‌, అక్కడక్కడ హోటల్స్‌, రెస్టారెంట్‌లలో చిక్కుకు పోయిన వారికి అన్నపూర్ణ భోజనాన్నిఅందిస్తున్నారు. దీంతో మధ్యాహ్న పూటనే అన్నపూర్ణ భోజనం చేస్తున్న వారి సంఖ్య 45వేలకు చేరింది. జీహెచ్‌ఎంసి అమలుచేస్తున్న అన్నపూర్ణ భోజన పధకాన్ని రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు స్పూర్తిగా తీసుకున్నాయి. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, సిరిసిల్ల,కరీంనగర్‌ మున్సిపాలిటీలతో పాటు ఖమ్మం జిల్లాలో మూడు, సూర్యాపేటలో రెండు, సిద్దిపేట జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో అన్నపూర్ణ భోజనాన్నిఅందిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T20:32:31+05:30 IST