ఫోన్‌ మాట్లాడుతూ.. 2 డోసులూ వేసేసింది!

ABN , First Publish Date - 2021-06-20T08:30:05+05:30 IST

ఏఎన్‌ఎం ఫోన్‌ మాట్లాడుతూ ఓ యువతికి వెంట వెంటనే రెండు కొవాగ్జిన్‌ టీకా డోసులను వేసేసింది! యువతికి తీవ్ర జ్వరం రావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఫోన్‌ మాట్లాడుతూ.. 2 డోసులూ వేసేసింది!

  • ఏఎన్‌ఎం నిర్లక్ష్యం.. యువతికి తీవ్ర జ్వరం
  • ఏరియా ఆస్పత్రిలో రెండ్రోజుల అబ్జర్వేషన్‌
  • పెద్దఅంబర్‌పేట్‌లో ఆలస్యంగా వెలుగులోకి


అబ్దుల్లాపూర్‌మెట్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఏఎన్‌ఎం ఫోన్‌ మాట్లాడుతూ ఓ యువతికి వెంట వెంటనే రెండు కొవాగ్జిన్‌ టీకా డోసులను వేసేసింది! యువతికి తీవ్ర జ్వరం రావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. పెద్దఅంబర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూరు


రాజీవ్‌ గృహకల్పకు చెందిన లక్ష్మీప్రసన్న (21) గురువారం పెద్దఅంబర్‌పేట్‌లోని కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలో టీకా తీసుకునేందుకు వెళ్లింది. ఏఎన్‌ఎం పద్మ.. లక్ష్మీప్రసన్నకు టీకా వేసింది. ఆమె కుర్చీలో కూర్చుని ఉండగానే ఏఎన్‌ఎంకు ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్‌ మాట్లాడుతూ లక్ష్మీప్రసన్నకు మరోసారి కొవాగ్జిన్‌ డోసును వేసేసింది. క్యూలో ఉన్న వారు చూసి రెండుసార్లు టీకా వేశారని ఏఎన్‌ఎంకు తెలిపారు. యువతి ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. వెంటనే ఆమెకు తీవ్ర జ్వరం వచ్చి చెమటలు పట్టాయి. వైద్య సిబ్బంది ఆమెకు సెలైన్‌ పెట్టి అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. రెండు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో శనివారం ఇంటికి పంపించారు. ‘‘లక్ష్మీప్రసన్నకుడబుల్‌ డోసు వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. వ్యాక్సిన్‌ వేస్తున్న సమయంలో ఆ యువతి భయంతో కదిలింది. సూది భుజానికి తగలడంతో సరిచేసి టీకా ఇచ్చాం. టీకా తీసుకున్న తర్వాత యువతికి చెమటలు పడుతున్నాయని చెప్పడంతో టెస్టులు చేసి ప్రాథమిక చికిత్స చేశాం. అనంతరం అబ్జర్వేషన్‌ కోసం ఏరియా ఆస్పత్రికి తరలించాం. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇంటికి పంపించాం’’ అని అబ్దుల్లాపూర్‌మెట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్వేత తెలిపారు.

Updated Date - 2021-06-20T08:30:05+05:30 IST