ఎంత కష్టం.. ఎంత కష్టం..

ABN , First Publish Date - 2020-03-27T08:59:01+05:30 IST

బస్సు, రైలు, విమానం.. దూర ప్రయాణ సాధనాలన్నీ బంద్‌ అయిన కాలమిది! వెళ్లిన చోట కరోనా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ కారణంగా...

ఎంత కష్టం.. ఎంత కష్టం..

  • మహమ్మారి తరిమికొడుతుంటే
  • కాలినడకనే తిరుగుపయనం 
  • హోటళ్లు లేక ఆకలితో మలమల
  • దారంతా గండాలతో అడుగులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : బస్సు, రైలు, విమానం.. దూర ప్రయాణ సాధనాలన్నీ బంద్‌ అయిన కాలమిది! వెళ్లిన చోట కరోనా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ కారణంగా ఉండలేక, వ్యాపారులు సొంత కారుల్లో స్వగ్రామాలకు చేరుకొంటున్నారు. టెకీలు వందల కిలోమీటర్ల దూరాన్ని బైకులపై దాటి సొంతూళ్లకు వస్తున్నారు. మరి వాళ్లు వలస కూలీలు! రెక్కలు తప్ప మరే దిక్కు లేని ఈ బడుగుజీవులు చివరకు తమ కాళ్లనే నమ్ముకొన్నారు. పనుల కోసం విశాఖ నుంచి హైదరాబాద్‌, చెన్నైలకు వెళ్లిన వాళ్లే వీరంతా! చెన్నైలో బుధవారం బయలుదేరిన వలస కూలీలయితే.. ఏకంగా సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం నడిచి విశాఖకు చేరుకొనే ప్రయత్నంలో ఉన్నారు. దారిలో తినడానికి హోటళ్లు లేవు! ఎక్కడైనా ఆగుదామంటే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత! మార్గమధ్యంలో గుక్కెడు నీళ్లు తాగుదామంటే గ్రామాల్లోకే రానీయకుండా తరిమికొడుతున్నారు! ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అతి కష్టంగా అడుగులు వేస్తున్న వీరంతా విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిప, గొంప, బుచ్చెయ్యపేట మండలం పెదమదీనా, గున్నెంపూడి గ్రామాలకు చెందినవారు. ఈ గ్రామాల నుంచి సుమారు 400 మంది పనుల కోసం ఆరు నెలల కిందట చెన్నై వెళ్లారు. కానీ కరోనా భయంతో అక్కడ ఉండొద్దని, స్వస్థలాలకు వెళ్లిపోవాలని అధికారులు ఒత్తిడి చేయడంతో ఈ విషయం ఇక్కడ ఉంటున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేశారు. ఈ విషయాన్ని వారు చోడవరం నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేతలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో  వారంతా  కాలినడకనే స్వగ్రామాలకు బయలుదేరారు. 


వెళ్లినచోట ఉండలేక..

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన యువకులు హైదరాబాద్‌లో వలస పనులకు వెళ్లి అష్టకష్టాల పాలయ్యారు. తమ స్వగ్రామానికి కాలినడకన బయలుదేరి గురువారం తూర్పుగోదావరి జిల్లా తుని చేరుకున్నారు. కరోనా ప్రభావంతో కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ అధికారులు వీరిని కోదాడ వరకు లారీలో వదిలిపెట్టారు. అక్కడకు చేరిన తర్వాత కాలినడకన బయల్దేరారు. దారిలో తిండి లేదని, తాగడానికి నీళ్లు ఇచ్చేవారు లేరని వీరంతా వాపోతున్నారు. కాగా, విజయనగరం జిల్లా సాలూరు మండలానికి చెందిన మహిళా కూలీలు కూడా అనకాపల్లి నుంచి బుధవారం స్వస్థలాలకు కాలినడకనే బయలుదేశారు. 


ప్రిన్సిపాల్‌ ‘మహా’ మానవత్వం

ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దారి ప్రయాణంలో కొందరి మానవత్వం ఊరటనిస్తోంది! కాలినడకన విశాఖపట్నం నుంచి మహారాష్ట్ర బయలుదేరిన నలుగురు వలస కూలీలకు గూడెంకొత్తవీధి మండలం సీలేరులో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ భోజనం ఏర్పాటుచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్రకు చెందిన వీరు ఉపాధి కోసం విశాఖపట్నం వచ్చారు. కరోనాతో ఈ నెల 22 నుంచి పనులు నిలిచిపోవడంతో కాలినడకన స్వగ్రామాలకు పయనమయ్యారు. ఆదివారం కాలినడకన విశాఖపట్నం నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నానికి సీలేరు చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎక్కడా భోజన హోటళ్లు లేకపోవడంతో ఐదు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న వీరికి ప్రిన్సిపాల్‌ భోజనం పెట్టారు. 


Updated Date - 2020-03-27T08:59:01+05:30 IST