కాశీలో బిక్కుబిక్కు

ABN , First Publish Date - 2020-03-27T07:48:08+05:30 IST

తీర్థ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 51 మంది కాశీలో చిక్కుకుపోయారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ఊరుకాని ఊరిలో...

కాశీలో బిక్కుబిక్కు

  • తీర్థయాత్రకెళ్లి చిక్కుకుపోయిన ఆంధ్రులు
  • రెండు సార్లు రైలు రిజర్వేషన్లు రద్దు
  • తీసుకెళ్లిన నగదు మొత్తం ఖాళీ

పటమట(విజయవాడ), తెనాలి అర్బన్‌, మార్చి 26: తీర్థ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 51 మంది కాశీలో చిక్కుకుపోయారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ఊరుకాని ఊరిలో నానా కష్టాలు పడుతున్నారు. విజయవాడ పటమట హైస్కూల్‌ రోడ్డులోని రామాయణపువారి వీధికి చెందిన 10 మహిళలు ఈ నెల 10వ తేదీన రైల్లో కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణానికి ఈనెల 23న రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈనెల 22న జనతా కర్ఫ్యూ విధించిన కేంద్రం ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో వీరంతా రైలు టికెట్లు రద్దు చేసుకుని, తిరిగి ఏప్రిల్‌ 1వ తేదీకి టికెట్లు బుక్‌ చేసుకున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్రం ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు  ప్రకటించడంతో వీరంతా నానా కష్టాలు పడుతున్నారు. నగదు మొత్తం అయిపోవడంతో కాశీలోని తెలుగువారి సత్రంలో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. తమను స్వస్థలానికి చేర్చాలంటూ ఫోన్‌ ద్వారా స్థానిక నేతలు, అధికారులు, మంత్రులను వేడుకుంటున్నారు. దీంతో స్థానిక టీడీపీ నేత ముమ్మనేని ప్రసాద్‌ ఈ విషయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు, ఆయన కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే గుంటూరుజిల్లా తెనాలికి చెందిన 39 మంది, మరో ఇద్దరు కూడా ఈ నెల 10న కాశీ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయారు. తమను ఆదుకోవాలని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌కు ఫోన్‌లో కోరారు.


ఒడిశాలో చిక్కుకుపోయిన 175 మంది మత్స్యకారులు

చేపల వేటతోపాటు ఉపాధి కోసం ఒడిశాలోని పరదీప్‌ హార్బర్‌కు వెళ్లిన 175 మంది మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారు. వేట ఆగిపోవడంతో పనిలేక, తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. స్వస్థలానికి వద్దామంటే హార్బర్‌ నుంచి అక్కడి అధికారులు కదలనీయడంలేదని మత్స్యకారులు ఓలేటి నీలాద్రి, మల్లాడి వీర్రాజు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో వివరించారు. అక్కడి అధికారులను వేడుకుంటే ఏపీ సరిహద్దు ఇచ్చాపురం వరకు తరలిస్తామన్నారని, దీనికి ఏపీ అధికారులు అంగీకరించడం లేదని వాపోయారు.



Updated Date - 2020-03-27T07:48:08+05:30 IST