పాఠశాల రుణం తీర్చుకుంటా

ABN , First Publish Date - 2022-03-07T09:37:09+05:30 IST

‘‘నాకు విద్యాబుద్ధులు నేర్పి.. ఉన్నత స్థితికి చేరేందుకు దోహదపడిన కోటగిరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల రుణం తీర్చుకుంటా. బడి అభివృద్ధికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రోత్సాహకాలు అందేలా కృషి చేస్తా’’ అని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌..

పాఠశాల రుణం తీర్చుకుంటా

  • విద్యాబుద్ధులు నేర్పి.. ఉన్నతికి కారణమైంది..
  • కోటగిరి జడ్పీహెచ్‌ఎస్‌ అభివృద్దికి కృషి చేస్తా
  •  స్టడీ రూం, డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేస్తా
  •  ప్రభుత్వ ప్రోత్సాహకాలు వచ్చేలా చూస్తా
  • జడ్పీహెచ్‌ఎస్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో
  • ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ


నిజామాబాద్‌/కోటగిరి,  మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు విద్యాబుద్ధులు నేర్పి.. ఉన్నత స్థితికి చేరేందుకు దోహదపడిన కోటగిరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల రుణం తీర్చుకుంటా. బడి అభివృద్ధికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రోత్సాహకాలు అందేలా కృషి చేస్తా’’ అని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ హామీ ఇచ్చారు. పాఠశాలలో డైనింగ్‌ హాల్‌, స్టడీ రూం ఏర్పాటుకు పాటుపడతానన్నారు. తనతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్వర్ణోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వేమూరి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. తాను చదువుకున్న సమయంలో ఉన్న ఉపాధ్యాయులు, స్నేహితులతో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మిత్రులు, గురువులను ఆప్యాయంగా పలకరించారు.




అప్పట్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలంటే ముందుగానే సన్నద్ధమై బడికి వచ్చేవారని.. ప్రస్తుతం టీచర్లు పాఠాలు చెబుతున్నామన్న భావనలో మాత్రమే ఉన్నారని అన్నారు. అప్పుడు ఉపాధ్యాయులకు యూనియన్లు ఉండేవి కావన్నారు. 10వ తరగతి వరకు ఇక్కడే విధ్యనభ్యసించానని రాధాకృష్ణ తెలిపారు. 50 ఏళ్ల తర్వాత, చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చిందని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పడిందని, అందులోని సభ్యులందరూ తమవంతుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని రాధాకృష్ణ సూచించారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ తాటి వీరేశం, ఉపాధ్యక్షులు పోల విఠల్‌, సాయిలు, జనరల్‌ సెక్రటరీ ప్రభాకర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాలప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాధాకృష్ణ.. ప్రధానోపాధ్యాయుడు గాలప్పతో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. 


గురువులకు సన్మానం

తనకు చదువు చెప్పిన గురువులను రాధాకృష్ణ ఘనంగా సన్మానించారు. తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తనకెంతో ఇష్టమైన మాస్టారు గోరెంట్ల సత్యనారాయణను పలకరించి, ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన్ను ఘనంగా సన్మానించడమేగాక ఆర్థిక సహాయం కూడా అందించారు. సత్యనారాయణతో పాటు మరికొందరు గురువులు.. రంగారావు, సురేంద్రనాథ్‌, భాస్కర్‌రావు, రాంరెడ్డి, వెంకటసుబ్బారావు, అనసూయాదేవి, తిరుపతిరెడ్డిలను కూడా రాధాకృష్ణ సన్మానించారు. 


రాధాకృష్ణకు ఘనస్వాగతం..

పాఠశాల స్వర్ణత్సోవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎదురెళ్లి రాధాకృష్ణను సాదరంగా తోడ్కొని వచ్చారు. 




చిన్ననాటి స్మృతులను నెమరవేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవన ప్రయాణంలో జరిగే సంఘటనలు, అనుభవాలే వారిని రాటుదేలేట్లు చేస్తాయని తాను నమ్ముతానన్నారు. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని చెప్పారు. కొందరు అత్యుత్తమ ఉపాధ్యాయులు ఉంటారని, అలాంటివారిలో తన గురువు సత్యనారాయణ మాస్టర్‌ ఒకరని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవలను కొనియాడారు. టీచర్లు విద్యార్థులకు పాఠాలు చెప్పి వెళ్లిపోవడమేగాక.. వారి మంచి చెడులు, సామాజిక పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. అప్పుడే విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దగలుగుతారని రాధాకృష్ణ చెప్పారు. తాము చదువుకున్న సమయంలో ఒక తరగతి గదిలో 40 మంది ఉంటే.. నలుగురే పాసయ్యేవారని, మిగతా వారంతా ఫెయిలయ్యేవారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం విద్యాప్రమాణాలు బాగా పెరిగాయని, నూటికి 90 శాతం వరకు ఉత్తీర్ణత ఉంటోందని చెప్పారు.

Updated Date - 2022-03-07T09:37:09+05:30 IST