Grateful Mom: పిల్లల కోసం డ్రైవర్‌గా మారిన తల్లి.. అదృష్టం వరించడంతో..

ABN , First Publish Date - 2021-07-26T19:08:37+05:30 IST

పిల్లలను పోషించుకోవడం కోసం ఉబర్ ఈట్స్ డెలివరీ డ్రైవర్‌గా మారిన మహిళను అదృష్టం వరించింది. లక్కీ లాటరీలో ఆమె భారీ మొత్తంలో డబ్బును గెలుచుకుంది. మేరీల్యాండ్‌కు చెందిన ‘గ్రేట్‌ఫుల్ మామ్’ గురిం

Grateful Mom: పిల్లల కోసం డ్రైవర్‌గా మారిన తల్లి.. అదృష్టం వరించడంతో..

వాషింగ్టన్: పిల్లలను పోషించుకోవడం కోసం ఉబర్ ఈట్స్ డెలివరీ డ్రైవర్‌గా మారిన మహిళను అదృష్టం వరించింది. లక్కీ లాటరీలో ఆమె భారీ మొత్తంలో డబ్బును గెలుచుకుంది. మేరీల్యాండ్‌కు చెందిన ‘గ్రేట్‌ఫుల్ మామ్’ గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మేరీ‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె భర్త ఎవరు.. ఏం చేస్తాడు.. ఏమై పోయాడు అన్న వివరాలు లేనప్పటికీ కొన్ని కారణాల వల్ల తన ఐదుగరు పిల్లలను పోషించే బాధ్యత ఆమెపై పడింది. దీంతో బతుకుదెరువు కోసం ఉబర్ ఈట్స్ డెలివరీ డ్రైవర్‌గా మారింది. ఉద్యోగం చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లల కడుపు నింపుతోంది. ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లిన ఆ మహిళ.. ఓసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే కొంత మొత్తంతో మేరీల్యాండ్‌లోని ఓ మార్టులో లాటరీ టికెట్టును కొనుగోలు చేసింది. 



అనంతరం ఎప్పటిలాగే ఆమె మళ్లీ తన పనిలో పడిపోయింది. కారులో కూర్చుని తదుపరి డెలివరీ కోసం వేచి చూస్తుండగా ఆమెకు ఓ సందేశం వచ్చింది. మేరీల్యాండ్ లక్కీ లాటరీలో తాను కొనుగోలు చేసిన టికెట్‌కు 2.5లక్షల డాలర్ల జాక్‌పాట్ తగిలిందనే మెసేజ్ సారాంశాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బైపోయింది. వెంటనే ఈ విషయాన్ని తన సహోద్యోగులకు తెలియజేయడంతోపాటు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కాగా.. పిల్లల పోషణ కోసం డ్రైవర్‌గా మారిన ఆ మహిళకు మేరీల్యాండ్ లాటరీ నిర్వాహకులు ‘గ్రేట్‌ఫుల్ మామ్’ పేరుతో 2.5లక్షల డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ.1.86కోట్లు) చెక్కును అందించారు. ఇదిలా ఉంటే.. లాటరీలో గెలుపొందిన డబ్బుతో అప్పులు కట్టడంతో పాటు పిల్లల భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాకుండా డ్రైవర్ ఉద్యోగం కాకుండా మరో ఉద్యోగాన్ని వెతుక్కుంటానని తెలిపారు. 


Updated Date - 2021-07-26T19:08:37+05:30 IST