చరిత్రపై చెరగని సంతకం

ABN , First Publish Date - 2021-04-14T07:31:52+05:30 IST

అతను విద్యార్థి అయితే, నేల మీద కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది. బడిలో బెంచ్ మీద కూర్చోనివ్వలేదు. నల్లబల్లనీ తాకనివ్వలేదు...

చరిత్రపై చెరగని సంతకం

అతను విద్యార్థి అయితే, నేల మీద కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది. బడిలో బెంచ్ మీద కూర్చోనివ్వలేదు. నల్లబల్లనీ తాకనివ్వలేదు. ట్యూషన్లు చెప్పుకుని బతికాడు. స్టాక్స్‌, షేర్ల వ్యాపారులు లాభసాటి సలహాలు తీసుకున్నవారే, అతని సాంఘిక నేపథ్యం తెలియగానే సలహాలకు రావడం మానేశారు! న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశాడు. అతను మాష్టారై అధ్యాపక ఉపన్యాసాలు చేస్తే, ఆసక్తిగా విన్న విద్యార్థులూ, సహోద్యోగులే అంటుముట్టు పాటించి అవహేళనలు చేశారు. అతను మహద్‌ చెరువులో తాగునీటికోసం ఉద్యమిస్తే, వెయ్యి బిందెల నీళ్ళతో చెరువును శుద్ధి చేసుకున్నారు! అతను ఆలయ ప్రవేశ అంశం అధికారులతో చర్చించబోతే, ఆలయాన్ని శుద్ధి చేసుకున్నారు! అతను అధికారియై విధులు నిర్వహించబోతే, బంట్రోతులు ఫైళ్ళు చేతికి అందించకుండా బల్లమీదే విసిరేసి అవమానించారు! అతను సత్రంలో బసచేస్తే సత్రం యజమాని బయటకు గెంటేశాడు. నిద్రాహారాలూ లేక చెట్టు కింద కూర్చొని రాత్రంతా ఏడ్చాడు! అతను భవిష్యత్‌ భారత రాజ్యాంగ నిర్మాత! అతను దేశం మెచ్చిన భవిష్యత్‌ భారతరత్న! వర్ణ, కుల వివక్షల నిర్మూలనా విప్లవ నేత! అణగారిన వర్గాల రాజకీయ విముక్తికి మార్గదాత! సామాజిక సమానత్వ ఉద్యమ నేత! ప్రజలు ప్రేమగా పిలుచుకునే బాబాసాహెబ్‌! ఆయనే డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌!


భారతదేశ రాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పాత్ర మహోన్నతమైనది. ఆయన ప్రపంచ స్థాయి ఆర్థిక శాస్త్రవేత్త, విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త, గొప్ప పరిశోధకుడు. అంతర్జాతీయ న్యాయకోవిదుడు. బహుభాషా నిపుణుడు. బహు గ్రంథకర్త. భారతీయ సమాజంలో లోతుగా వేళ్లూనుకొని ఉన్న సామాజిక వివక్షల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన యోధుడు. సామాన్యునిగా ప్రారంభమైన అంబేడ్కర్‌ జీవితం, అణగారిన సామాజిక వర్గాల ప్రపంచ నాయకుని స్థాయికి చేరుకుంది. 


1920లోనే డాక్టర్‌ అంబేడ్కర్‌ బొంబాయి శాసనమండలి సభ్యునిగా నామినేట్‌ అయి, మూడేళ్లు ఆ పదవిలో కొనసాగారు. బహుజనుల హక్కుల కోసం అంబేడ్కర్‌ పలు సంస్థలను స్థాపించారు. 1924 జూలై 20న బహిష్కృత హితకారిణి సభ, 1927 సెప్టెంబర్‌ 4న సమతా సమాజ సంగ, 1936 ఆగస్టు 6న ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీ, 1942 జూలై 19న షెడ్యూల్డు క్యాస్ట్‌ ఫెడరేషన్‌లను స్థాపించారు. 1937 ఫిబ్రవరి 17న జరిగిన బొంబాయి రాష్ట్రం ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ అనుకున్న వాటికన్నా ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. పదిహేను స్థానాల బలంతో రాష్ట్ర అసెంబ్లీలో అంబేడ్కర్‌ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. వెట్టి చాకిరీ రద్దు, హరిజన పదం రద్దు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, దళితులు, అణగారిన సామాజికవర్గాల వారి హక్కుల కోసం అసెంబ్లీ లోపలా, వెలుపలా డాక్టర్‌ అంబేడ్కర్‌ నిరంతరం ఉద్యమిస్తూ వచ్చారు.


1935లో రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపనలో డాక్టర్‌ అంబేడ్కర్‌ కీలక పాత్ర నిర్వహించారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీనోట్ల సమస్యలపై అధ్యయనం చెయ్యడానికి బ్రిటీష్‌ ప్రభుత్వం నియమించిన రాయల్‌ కమిషన్‌గా ప్రసిద్ధి చెందిన హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌కు సమర్పించిన విజ్ఞప్తుల్లోని మార్గదర్శకాలే తదుపరి కాలంలో రిజర్వు బ్యాంకు స్థాపన, దాని దార్శనిక దృక్పథంగా మారింది. దీనికంతటికీ ఆధారం 1922లో డాక్టర్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌లో డాక్టరేట్‌ పట్టా కోసం రాసిన పరిశోధనా గ్రంథం ‘రూపాయి సమస్య – పుట్టుక, పరిష్కారం’ అని చెప్పుకోవాలి. నిజానికి ఈ సేవకుగాను భారతీయ కరెన్సీ నోట్లపై డాక్టర్‌ అంబేడ్కర్‌ బొమ్మ ముద్రించి ఉండినట్లయితే, భారత ప్రభుత్వ వ్యవస్థ మహనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌కు కొంతైనా గౌరవాన్ని అందించి తనని తాను గౌరవించుకొని ఉండేది. 


డాక్టర్‌ అంబేడ్కర్‌ వైస్రాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా రెండు పదవుల్లో పని చేశారు. ఒకటి–వైస్రాయి లేబర్‌ కౌన్సిల్‌ సభ్యునిగా, రెండు, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ మెంబర్‌గా 1942 నుంచి 1946 దాకా పని చేశారు. ఈ కాలంలో భారతదేశంలో అనేక కార్మిక సంస్కరణలకు డాక్టర్‌ అంబేడ్కర్‌ పూనుకున్నారు. ఢిల్లీలో 1942 నవంబర్‌లో జరిగిన ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ ఏడవ సెషన్‌లో భారతదేశంలో 12 గంటల పనిదినాన్ని ఎనిమిది గంటల పనిదినంగా డాక్టర్‌ అంబేడ్కర్‌ మార్చారు. అంతేగాదు, కార్మికుల సంక్షేమం కోసం కరువు భత్యం, సెలవు లాభం, ఉద్యోగ భీమా, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు, ఇఎస్‌ఐ నిర్ణీత కాల వ్యవధిలో వేతనాల సవరణ మొదలగు జీవన సదుపాయాలు, భద్రతలు, ప్రమాణాలను భారతదేశ కార్మికవర్గం, ఉద్యోగవర్గాల కోసం డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రవేశపెట్టారు. ఇంకా దేశమంతటా ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛే్ంజీలను స్థాపించడానికి, కార్మిక సంఘాలను పటిష్ఠం చెయ్యడానికి, డాక్టర్‌ అంబేడ్కర్‌ చేసిన కృషి అపూర్వమైనది. ఈ మేళ్ళకుగాను, భారతదేశ కార్మిక, ఉద్యోగ వర్గాలు అంబేడ్కర్‌ నుంచి నిత్యస్ఫూర్తిని పొందవలసిన అవసరం ఉంది. సవర్ణ కమ్యూనిస్టు పార్టీలుగానీ, వాటి అనుబంధ ట్రేడ్‌ యూనియన్లుగానీ కార్మికుల హక్కుల కోసం ఎనలేని సేవలు చేసిన డాక్టర్‌ అంబేడ్కర్‌ని విస్మరించడం గర్హనీయం.


స్వతంత్ర భారతదేశంలో బహుళార్థ సాధక నదీలోయ ప్రాజెక్టులకు అంబేడ్కర్‌ మార్గదర్శకత్వం వహించారు. దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టు, సోన్‌ నదీలోయ ప్రాజెక్టు, భాక్రానంగల్‌ డ్యాం ప్రాజెక్టు, హీరాకుడ్‌ డ్యాం ప్రాజెక్టు మొదలైనవి. అలాగే కేంద్ర, రాష్ట్రాల్లో సాగునీటి పారుదల అభివృద్ధి కోసం కేంద్ర జలసంఘాన్ని స్థాపించారు. శక్తిమంతమైన జల, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను స్థాపించి, భారత విద్యుత్‌ రంగంలో సెంట్రల్‌ టెక్నికల్‌ పవర్‌బోర్డ్‌ను, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థను స్థాపించడం వెనక డాక్టర్‌ అంబేడ్కర్‌ కృషి ఎంతో అమూల్యమైనది. సుశిక్షిత విద్యుత్‌ ఇంజనీర్ల అవసరాన్ని పవర్‌గ్రిడ్‌ వ్యవస్థల అవసరాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆనాడే ఉద్ఘాటించారు. ఇండియాలోని రైతు సంఘాలుగానీ, పారిశ్రామిక యాజమాన్యాలు గానీ అంబేడ్కర్‌ని తలుచుకున్నట్టు ఎక్కడా కనిపించదు, వినిపించదు మనకు. ఇదొక పెద్ద విషాదం.


భారతీయ మహిళా లోకానికి కొన్ని ముఖ్యమైన హక్కులను కల్పించిన హిందూకోడ్‌ బిల్లు పార్లమెంటులో పాస్‌కావడానికి డాక్టర్‌ అంబేడ్కర్‌ ఏళ్ళ తరబడి సవర్ణ పితృస్వామ్య రాజకీయాలతో పోరాడారు. ఈ బిల్లు ముఖ్యంగా రెండు ప్రయోజనాలకు ఉద్దేశించింది. ఒకటి హిందూ మహిళలలు కోల్పోయిన హక్కులను పునరుద్ధరించి వారికి సాంఘిక హోదా కల్పించడం. రెండు: సాంఘిక వ్యత్యాసాలను, కుల అసమానతలను అధికారికంగా రద్దు చెయ్యడం. ఈ బిల్లులోని కొన్ని ముక్యాంశాలు: కుటుంబ ఆస్తులకు మహిళలలు వారసత్వ హక్కుదార్లవుతారు. వితంతువులకు, విడాకులు పొందిన వారికి పునర్వివాహ హక్కు వస్తుంది. తిరస్కరించడానికి వీలులేని విధంగా, పురుషులతో సమానంగా ఈ బిల్లు మహిళలకు విడాకుల హక్కు కల్పిస్తుంది. ఆడపిల్లలు దత్తతకు అనుమతించబడతారు. బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుంది. కులాంతర వివాహాలు, ఏ కులం పిల్లలనైనా దత్తత తీసుకోవడం అనుమతించబడతాయి. నాటి ప్రధానమంత్రి నెహ్రూ, కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం మద్దతు ఇవ్వకపోవడంతో పార్లమెంటులో హిందూకోడ్‌ బిల్లు వీగిపోయింది. దీంతో మహిళా హక్కులకు పెద్దదిక్కైన డాక్టర్‌ అంబేడ్కర్‌ కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి 1951 సెప్టెంబర్‌ 27న రాజీనామా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ మహిళలు ఎంతగా అభివృద్ధి సాధించారు అన్న స్థాయిని బట్టే ఆ కమ్యూనిటీ అభివృద్ధిని నేను లెక్కిస్తాను అని అన్నారు. కాగా మహిళల హక్కుల కోసం నిబద్ధతతో పోరాడి కేంద్ర న్యాయశాఖామంత్రి పదవిని త్యజించిన డాక్టర్‌ అంబేడ్కర్‌ని ఆధిపత్యకులాల రాజకీయ పార్టీల మహిళా సంఘాలు, స్త్రీవాదులు, ఎన్జీవోలు ఏనాడూ డాక్టర్‌ అంబేడ్కర్‌ సేవలను స్మరించుకోకపోవడం చాలా దుఃఖదాయకం. 


1956 డిసెంబర్‌ ఆరున, అరవై ఐదవ ఏట డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మహానిర్యాణం చెందారు. ఆయన బతికున్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తృణీకారంతోనే చూసింది. కాగా, 1990 మార్చి 31న విపిసింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అంబేడ్కర్‌ మహానిర్యాణం అనంతరం 34 ఏళ్ళకు ఆయనకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది. భారతదేశ సాంఘిక సంస్కరణల కార్యరంగంలో, రాజకీయాల్లో, ప్రభుత్వాధికార వ్యవస్థల్లో ఎన్నో కొత్త చట్టాలనూ, ప్రజాస్వామిక విలువలనూ, నూతన భావాలనూ డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రపై చెరగని సంతకంగా నిలిచారు.

కృపాకర్‌ పొనుగోటి

(నేడు అంబేడ్కర్‌ 130వ జయంతి)

Updated Date - 2021-04-14T07:31:52+05:30 IST