మానవాళికి ‘ఎండ్‌ గేమ్‌’?

ABN , First Publish Date - 2022-08-06T06:08:29+05:30 IST

ఇప్పుడు మన ముందున్న దీర్ఘకాలిక లక్ష్యాలన్నింటినీ పూర్తిగా సాధించగలిగితే భూతాపం పెరుగుదలను 1.7 నుంచి 2.6 డిగ్రీ సెంటీగ్రేడుల మధ్యకు అరికట్టవచ్చు...

మానవాళికి ‘ఎండ్‌ గేమ్‌’?

ఇప్పుడు మన ముందున్న దీర్ఘకాలిక లక్ష్యాలన్నింటినీ పూర్తిగా సాధించగలిగితే భూతాపం పెరుగుదలను 1.7 నుంచి 2.6 డిగ్రీ సెంటీగ్రేడుల మధ్యకు అరికట్టవచ్చు. నిజానికి ఈ మాత్రం పెరుగుదల కూడా భూమ్మీది అనేక వ్యవస్థలను అస్తవ్యస్తం చేయగలదు. మన భూమి స్వభావం మనకు అర్థమవుతున్న కొద్దీ మనం ఆందోళన చెందాల్సిన అంశాలు పెరుగుతున్నాయి. మన భూమి ఒక సున్నితమైన వ్యవస్థ. దాని సంయమనాన్నిభగ్నం చేసే విపత్తులపై ఒక అంచనా రావడం ద్వారానే ఆ విపత్తులను దాటగలం. 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాజిక వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చగలిగే, మొత్తం మానవాళినే ప్రమాదం అంచుకు నెట్టగలిగే పరిస్థితిపై ఎవ్వరూ శ్రద్ధ పెట్టడం లేదు. అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పరిస్థితి గురించి హెచ్చరిస్తూ ఇటీవల ఒక పరిశోధనను ప్రచురించింది. ఈ ప్రమాదాన్ని ఆ శాస్త్ర పరిశోధకులు ‘క్లైమేట్ ఎండ్‍గేమ్’ అంటున్నారు. భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉండబోతుందన్న విషయంపై ఎవరిలోనూ స్పష్టత లేదు. ఈ కారణంగా ఎలాంటి ఘోర విపత్తులనూ కొట్టిపడేయలేం అని ఆ పరిశోధకులు చెబుతున్నారు: ‘వాతావరణ మార్పులు అంతకంతకూ వేగవంతమవుతున్నాయి. అవి చివరకు దేనికి దారితీస్తాయన్నదానిపై ఒక అంచనా లేకుండా దాన్ని ఎదుర్కోవటం అమాయకత్వం. అది సరైన రిస్క్ మేనేజ్మెంటు అనిపించుకోదు, పైగా భారీ ప్రాణనష్టానికి దారితీయగలదు. పెరుగుతున్న భూతాపం మహాప్రళయం స్థాయి విపత్తుకు దారితీయగలదని అనటానికి తగిన కారణాలున్నాయి’ అని వారు వివరిస్తున్నారు. వారి వాదన ప్రకారం, మనమంతా ‘క్లైమేట్ ఎండ్‌గేమ్’కు సంసిద్ధులం కావాలి. ఈ తీవ్ర పరిస్థితులకు కారణమయ్యే అంశాలను పరిశోధించి, విశ్లేషించటం ద్వారానే మనం తగిన చర్యలకు పూనుకోగలం, తట్టుకునే శక్తిని పెంచుకోగలం, అవసరమైన విధానాలను రూపొందించుకోగలం.

న్యూక్లియర్ యుద్ధం అనంతరం సంభవించే ‘న్యూక్లియర్ శీతాకాలం’ గురించి 1980ల్లో ముమ్మరంగా పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనల వల్ల సమాజం అప్రమత్తమైంది. తత్ఫలితంగానే నిరాయుధీకరణకు ప్రయత్నాలు జరిగాయి. అదే విధంగా ‘క్లైమాటిక్ ఎండ్‌గేమ్’ గురించి కూడా తగినన్ని పరిశోధనలు జరగాలి. అలాంటి పరిస్థితికి దారితీసే నాలుగు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ నాలుగు అంశాలను ‘ఫోర్ హార్స్‌మన్’ అన్న పేరుతో వ్యవహరిస్తున్నారు (క్రైస్తవ మత గ్రంథాల ప్రకారం, నలుగురు గుర్రపు రౌతులు సృష్టి అంతాన్ని అమలు జరుపుతారు). ఈ నాలుగు అంశాలూ ఏమిటంటే– కరువు, తీవ్ర వాతావరణ పరిస్థితులు, యుద్ధం, రోగం.

‘ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీసీ) కూడా ఈ అంశంపై ఒక నివేదికను వెలువరించాలని ఈ పరిశోధకులు పిలుపునిచ్చారు. భూతాపం 1.5 సెంటీగ్రేడ్ పెరగటం వల్ల కలిగే ప్రభావంపై ఐపీసీసీ వెల్లడించిన ఒక నివేదికపై చాలా చర్చ జరిగింది. ‘భూతాపంలో స్వల్ప మార్పులకే పెద్ద పెద్ద పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందని’ ఈ పరిశోధకుల బృందానికి సారథ్యం వహించిన, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ‘సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ రిస్క్’ విభాగానికి చెందిన డా. ల్యూక్ కెంప్ చెబుతున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం: ‘భూమ్మీద భారీ స్థాయిలో జరిగిన ప్రతీ జాతుల వినాశనం వెనుకా వాతావరణ మార్పుల పాత్రే ప్రధానం’.


ఈ పరిశోధకులు ప్రచురించిన పరిశోధన ప్రధానంగా ఏమని వాదిస్తున్నదంటే– భూతాపం 3డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే పెరిగితే కలిగే పర్యవసానాలపై ఎక్కడా సరైన పరిశీలన జరగలేదు. అంటే మానవాళి మనుగడకు అతిపెద్ద సవాలు విసిరే ఈ అంశంపైన మనకు తెలిసింది అతితక్కువ. అరుదుగానే అయినప్పటికీ, ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపించే ప్రమాదాలపై ముందస్తు జాగరూకత ఎంత అవసరమో కోవిడ్ సృష్టించిన వినాశనం మనకు మరింతగా గుర్తు చేసింది. ముఖ్యంగా మనం పట్టించుకోవాల్సింది ‘టిప్పింగ్ పాయింట్’లను. స్వల్ప పరిణామంలో మారినా భారీ ప్రభావాన్ని చూపించే వాటిని ‘టిప్పింగ్ పాయింట్’ అని వ్యవహరిస్తున్నారు. భూమి ఉష్ణోగ్రతలో స్వల్ప పెరుగుదల కూడా వాతావరణం సమూలంగా మారిపోవటానికి కారణం కావచ్చు. అమెజాన్ రెయిన్ ఫారెస్టులలో పెరుగుతున్న దావానలాల వల్ల వెలువడుతున్న కర్బన ఉద్గారాలను దీనికి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ ‘టిప్పింగ్ పాయింట్లు’ ఒకదాన్నొకటి ప్రేరేపించుకుంటూ క్రమంగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ దావానలాల వల్ల స్ట్రాటోకుమ్యులస్ మేఘాల శాతం తగ్గిపోతుంది. అది భూతాపాన్ని మరో 8 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచే అవకాశం ఉంది. భూతాపాల పెరుగుదల కేవలం వాతావరణ మార్పులకేగాక, దేశాల మధ్య యుద్ధాలకు, మహమ్మారులై చెలరేగే వ్యాధులకు దారితీయగలదు. అంతేకాదు, ఇప్పటికే ఉన్న పేదరికం, పంట నష్టం, నీటి ఎద్దడి వంటి సమస్యలను తీవ్రతరం చేయగలదు. భవిష్యత్తులో అగ్రదేశాల మధ్య కర్బన ఉద్గార హక్కుల గురించి, భూతాపాన్ని తగ్గించేందుకు సూర్యరశ్మిని తిరిగి స్పేస్‌లోకి మళ్లించగల జియో ఇంజనీరింగ్ ప్లాన్ల గురించి పోట్లాటలు పెరిగే అవకాశం ఉందని ఈ పరిశోధకులు ఊహిస్తున్నారు. ప్రస్తుతం ఎంతో సున్నితంగా ఉన్న వాతావరణ పరిస్థితి తీవ్రరూపం దాల్చటానికి ఎక్కువ సమయం పట్టదని వారి వాదన.


భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న ప్రమాదాలకు గతం నుంచి ఎన్నో ఉదాహరణలున్నాయి. చరిత్ర ఎన్నో హెచ్చరికలు చేస్తూ వచ్చింది. ప్రాచీన సమాజాలు అంతరించిపోవటంలోనూ, లేదా సమూలంగా మార్చివేయబడటంలోనూ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎంతో ఉంది. భూమి మీది జీవరాశులు తుడిచిపెట్టుకుపోయిన ఐదు అతిపెద్ద సంఘటనలలోనూ వాతావరణం కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఉన్న కర్బన ఉద్గారాల శాతం ఇలాగే కొనసాగితే, ఏడాదికి సగటు ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెంటీగ్రేడు దాటగలవని, అది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లమంది జనాభాపై తీవ్ర ప్రభావం చూపగలవని అంచనా. ఈ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావాన్ని ఇప్పటికే సహారాలోను, గల్ఫ్ తీర ప్రాంతంలోనూ మూడు కోట్లమంది జనాభా చవి చూస్తున్నారు. 2070 నాటికి ఈ ఉష్ణోగ్రతల ప్రభావం, వాటి ఫలితమైన సామాజిక రాజకీయ పరిణామాల ప్రభావం, రెండు న్యూక్లియర్ శక్తులపైన, ప్రమాదకర పాథోజెన్లకు నిలయమైన ఏడు మాగ్జిమమ్ కంటెయిన్మెంటు లాబోరేటరీలపైనా ఉంటుంది. ఒకవేళ ప్రభావం అక్కడిదాకా చేరితే ఇక అక్కడితో ఆగదు.


గ్రీన్‌ హౌస్ గ్యాస్ ఉద్గారాలు ఇప్పటి మాదిరే కొనసాగుతూ పోతే 2100 నాటికి భూతాపం పెరుగుదల 2.1 నుంచి 3.9డిగ్రీ సెంటీగ్రేడు మధ్యకు చేరుతుంది. భూతాపం అరికట్టడానికి మనం ప్రతిజ్ఞ పట్టిన చర్యలన్నీ చేయగలిగితే భూతాపం పెరుగుదలను 1.9 నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడు మధ్య అదుపు చేయవచ్చు. ఇప్పుడు మన ముందున్న దీర్ఘకాలిక లక్ష్యాలన్నింటినీ పూర్తిగా సాధించగలిగితే భూతాపం పెరుగుదలను 1.7 నుంచి 2.6 డిగ్రీ సెంటీగ్రేడు మధ్యకు అరికట్టవచ్చు. ఇవన్నీ నిజానికి ఎంతో ఆశావాదంతో అంచనా వేస్తున్న గణాంకాలు. నిజానికి ఈ మాత్రం పెరుగుదల కూడా భూమ్మీది అనేక వ్యవస్థలను అస్తవ్యస్తం చేయగలవు. మన భూమి స్వభావం మనకు అర్థమవుతున్న కొద్దీ మనం ఆందోళన చెందాల్సిన అంశాలు పెరుగుతున్నాయి. మన భూమి ఒక సున్నితమైన వ్యవస్థ.  దాని సంయమనాన్ని భగ్నం చేసే విపత్తులపై ఒక అంచనా రావడం ద్వారానే ఆ విపత్తులను దాటగలం.

డేమియన్ కారింగ్టన్

పర్యావరణ అంశాల సంపాదకుడు (‘ది గార్డియన్’ సౌజన్యం)

Updated Date - 2022-08-06T06:08:29+05:30 IST