బీఎస్పీ గెలిస్తే నిరుపేదలకు ఎకరం భూమి

ABN , First Publish Date - 2022-06-27T09:11:53+05:30 IST

రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ అధికారంలోకి వస్తే కులాలకు అతీతంగా భూమి లేని నిరుపేదలకు ఎకరం భూమి పంపిణీ..

బీఎస్పీ గెలిస్తే నిరుపేదలకు ఎకరం భూమి

అసైన్డ్‌ భూములకు పట్టాలు

రెండేళ్లలో పేదలందరికీ ఇళ్లు 

పది లక్షల ఉద్యోగాల భర్తీ

ఒంటరిగానే పోటీ చేస్తాం

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌


హనుమకొండ రూరల్‌, జూన్‌ 26 : రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ అధికారంలోకి వస్తే కులాలకు అతీతంగా భూమి లేని నిరుపేదలకు ఎకరం భూమి పంపిణీ చేస్తామని, పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రగతి భవన్‌పై ఏనుగు గుర్తున్న నీలి రంగు జెండా ఎగరేస్తామని  ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రవీణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా, చక్రవర్తి సాహూ మహారాజ్‌ 148వ జయంతిని పురస్కరించుకొని సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడారు. బహుజనుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే వరకు తాను చేస్తున్న పాదయాత్ర ఆగదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను మూసివేస్తామని ప్రకటించారు. బహుజన యాత్రలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 750 గ్రామాలను సందర్శించామని, 1700 కి.మీ. పర్యటించామని వెల్లడించారు. యాత్రను అడ్డుకునేందుకు అనేక బెదిరింపులు వస్తున్నాయని చెప్పా రు. సభ నిర్వహణను అడ్డుకునేందుకు ప్రభుత్వం అడుగుడుగునా అనేక ఆటంకాలు కలిగించిందని తెలిపారు. 60 వేల పుస్తకాలు చదివానని చెబుతున్న కేసీఆర్‌.. పీకేను ఎందుకు తెచ్చుకున్నారని ప్రవీణ్‌ ప్రశ్నించారు. యువకుల సంక్షేమం, క్రీడల పట్ల కేసీఆర్‌కు అంతగా ఆసక్తి లేదని, పీకే ఇచ్చిన సలహాతోనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అగ్నిపథ్‌ ఆందోళనలో చనిపోయిన రాకేశ్‌ మృతిని టీఆర్‌ఎస్‌ చేసిన హత్యగా అభివర్ణించారు. బహుజన రాజ్యాధికారం రావాలంటే బడుగు, బలహీన వర్గాలవారు ఏకం కావాలని బహుజన నేత, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతం పిలపునిచ్చారు. పాలకులు పేద, బడుగు వర్గాలను పట్టించుకోవడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం వారిని వాడుకుంటున్నారని విమర్శించారు. సభలో బహుజన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త మంద ప్రభాకర్‌ తదితరులు మాట్లాడారు. 


సభకు భారీగా జనం హాజరు..

బీఎస్పీ చేపట్టిన మహాసభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. గ్రౌండ్‌ మొత్తం నిండిపోయింది. సాయంత్రం వరంగల్‌ చేరుకున్న ప్రవీణ్‌ కుమార్‌ కాకతీయ యూనివర్సిటీ నుంచి ర్యాలీగా బయలుదేరారు. హనుమకొండ సుబేదారిలోని తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. నక్కలగుట్ట నుంచి బాల సముద్రం మీదుగా సాగిన ర్యాలీ బాల సముద్రంలోని హయాగ్రీవచారి గ్రౌండ్‌కు చేరుకుంది. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో వేలాది మందితో ర్యాలీ సాగింది. సభకు ముందు కళాకారులు ఆటపాటలతో సభికులను ఉత్సాహపరిచారు. రాత్రి పొద్దుపోయే వరకు సభ సాగింది.

Updated Date - 2022-06-27T09:11:53+05:30 IST