అమిత్‌ షా మిషన్‌ తెలంగాణ!

ABN , First Publish Date - 2022-08-06T07:48:18+05:30 IST

ఏడాది వ్యవధిలోనే మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా చక్రం తిప్పుతున్నారా..

అమిత్‌ షా మిషన్‌ తెలంగాణ!

  • ఏడాది వ్యవధిలో మూడు సార్లు రాష్ట్రానికి..
  • టీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా చక్రం
  • వేరే పార్టీల్లో రాజీనామాలు.. 
  • బీజేపీలో చేరికలు అన్నీ ఆయన డైరెక్షన్‌లోనే? 
  • నల్లగొండ, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఏడాది వ్యవధిలోనే మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా చక్రం తిప్పుతున్నారా.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి చేరికల పరంపర జోరందుకోనుందా.. అంటే అవుననే తెలుస్తోంది. అమిత్‌ షా మార్గదర్శనంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారబోతున్నాయని జాతీయ స్థాయి బీజేపీ  నేత ఒకరు చెప్పారు. ‘సందేహం అక్కర్లేదు. పెనుమార్పులు ఉంటాయి’ అన్నారు. ‘ప్రతి జిల్లాలో ఒక బలమైన నేత పార్టీకి అండగా ఉండేలా తక్షణం రంగంలోకి దిగండి’ అని అమిత్‌ షా నెల రోజుల కిత్రం రాష్ట్ర పార్టీ ముఖ్యులకు ఆదేశాలిచ్చారు. 


మరోవైపు, రాష్ట్రంలో పరిస్థితులపై ఇప్పటికే అమిత్‌ షాకు సర్వే బృందాలు అత్యంత గోప్యంగా తమ నివేదికలను పంపుతున్నట్లు.. నివేదికలను బట్టి అమిత్‌ షా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి సూచనలు చేస్తున్నట్లు సమాచారం. ‘రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మండలాల్లో మా పార్టీకి కేడర్‌ ఉన్నా సరైన నాయకత్వం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు ఎన్నికల సమయంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, ప్రతీ నియోజకవర్గంలో ఒక ఇంచార్జి/సమన్వయకర్తకు బాధ్యతలు అప్పగించాలని మా అగ్రనాయకత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం. మా విజ్ఞప్తికి అనుగుణంగా అధినాయకత్వం పావులు కదుపుతోంది’ అని బీజేపీ చేరికల కమిటీ సీనియర్‌ నేత ఒకరు వివరించారు.

 

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలపై ప్రత్యేక దృష్టి

ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలపై జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మరో సీనియర్‌ నేత చెప్పారు. ‘నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో సీనియర్ల చేరికలు పెద్ద ఎత్తున ఉండేలా చూడాలన్న ఆదేశాలున్నాయి. ఈ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా పైనా పడుతుందని భావిస్తున్నాం’ అని వివరించారు.  కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తమకు కలిసి వస్తున్నాయన్నారు. 


21న భారీ చేరికలు

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మునుగోడు నియోజకవర్గంలోనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. రాజగోపాల్‌రెడ్డితో పాటు, దాసోజు శ్రవణ్‌, టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసిన ప్రవీణ్‌రావు, ఉద్యమనేత రాజయ్య యాదవ్‌, నర్సాపూర్‌ మునిసిపాలిటీ టీఆర్‌ఎస్‌ నేత మురళీయాదవ్‌తో పాటు మరికొందరు రిటైర్డు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని పార్టీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ తెలిపారు. ‘బీజేపీలో చేరికలు ఇప్పుడొక సాధారణ ప్రక్రియగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-08-06T07:48:18+05:30 IST