అమాత్యా.. ఇది తగునా!

ABN , First Publish Date - 2022-09-03T09:06:05+05:30 IST

అమాత్యా.. ఇది తగునా!

అమాత్యా.. ఇది తగునా!

అనధికార ఖర్చులతో అధికారులకు చుక్కలు

మంత్రిగా అధికారిక ఖర్చులు సరేసరి

వ్యక్తిగత ఖర్చులూ రోజుకు 50 వేలు

గెస్ట్‌హౌ్‌సలు వదిలి పెద్ద హోటళ్లలో బస

బిల్లులు చూసి అధికారులకు వణుకు


(నెల్లూరు, ఆంధ్రజ్యోతి) 

ఆయనొక కీలక శాఖకు మంత్రి. ఆయనంటే సొంత శాఖ అధికారులే హడలిపోతున్నారు. శాఖ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్షిస్తారనో, మంత్రి ప్రశ్నలు వేస్తే ఇబ్బంది పడతామనో కాదు. అధికారిక ఖర్చుల కన్నా అమాత్యుని వ్యక్తిగత ఖర్చులు భరించలేనిస్థాయికి చేరి, ఆ భారమంతా తాము మోయాల్సి రావడమే వారి భయానికి కారణం. ప్రత్యేకించి ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తే రోజుకు రూ.50 వేలు తగ్గకుండా ఖర్చు చేయాల్సి వస్తోందని కొందరు అధికారులు వాపోతున్నారు. మంత్రి హోదాలో ఆయనకు ప్రొటోకాల్‌ కింద కొంత బడ్జెట్‌ ఉంటుంది. సాధారణంగా మంత్రుల పర్యటనలకు ఆ నిధులు సరిపోతాయి. ఇంకా.. అదనం అంటే సొంత జేబులోంచి ఖర్చుపెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా వ్యక్తిగత అవసరాలకు, విలాసాలకు ప్రొటోకాల్‌ నిధులు ఖర్చు చేసేందుకు వీలుండదు. ఇవి అనధికారిక ఖర్చులన్నమాట. ఈ ఖర్చులను సైతం సదరు మంత్రి సొంత శాఖ అధికారులపైనే వేస్తున్నట్టు అధికారవర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


లోటు జరిగితే వేటే!

నాలుగు నెలల నుంచి అమాత్యుడు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. కనీసం నెలలో ఒకటీరెండుసార్లు వస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, పినాకినీ వంటి అతిథి గృహాలు, సొంత శాఖ దాదాపు రూ.35 లక్షలతో ఆధునికీకరించిన అతిథి గృహం ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అయినా.. ఆయనకు పెద్ద హోటల్‌లో  బస కావాలి. ఆయన వ్యక్తిగత సిబ్బందికి కూడా అదే హోటల్‌లో బస ఏర్పాటు చేయాల్సిందే. కాదు.. కూడదు.. అంత పెట్టుకోలేం.. ఇలా చిన్న మాట వినిపించినా వేటు తప్పదని, ఎక్కడా లోటు కనిపించకూడదని సదరు మంత్రి పేషీ నుంచి సొంత శాఖ అధికారులకు హెచ్చరికలు అందినట్లు సమాచారం. వచ్చినప్పుడల్లా ఇంతింత ఖర్చులు భరించలేని సదరు శాఖ అధికారులు.. ఇదే జిల్లాకు చెందిన ఓ కీలక నేత వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. సదరు నేత సూచన, సలహా మేరకు ఆ మంత్రి తన బసను ప్రస్తుతానికి ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి మార్చుకున్నారు. అయినా ఆయన జిల్లాలో ఉన్నంతసేపూ వ్యక్తిగత అవసరాలకు చేసే ఖర్చులు మాత్రం షరామాములుగా శాఖ అధికారులకు తప్పడం లేదు. వాస్తవానికి సదరు శాఖలో పనులు ఆశించినస్థాయిలో జరగడం లేదు. ఒకవేళ పనులు జరిగి సకాలంలో బిల్లులు వస్తే కాంట్రాక్టర్లతో ఖర్చు పెట్టించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని కొందరు అధికారులు వాపోతున్నారు. కోర్టు కేసులకే రూ.లక్షల్లో సొంత డబ్బులు ఖర్చువుతున్నాయి. వీటికి మంత్రి ఖర్చులు తోడవడం వారిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తోంది.

Updated Date - 2022-09-03T09:06:05+05:30 IST