మేమే దండం పెట్టి పొమ్మన్నాం!

ABN , First Publish Date - 2021-08-04T08:34:34+05:30 IST

‘‘ఔను! అమరరాజా ఫ్యాక్టరీని మేమే పంపిస్తున్నాం. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదు... ప్రభుత్వమే దండం పెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటోంది’’ అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల

మేమే దండం పెట్టి పొమ్మన్నాం!

అమరరాజా ఉండటానికి వీల్లేదు

కాలుష్యంతో ప్రజారోగ్యానికి నష్టం

పర్యావరణహిత పరిశ్రమలే కావాలి: సజ్జల

ఒక్క నిమిషమూ ఉండొద్దు

సమయమిచ్చినా లోపాలను సరిచేసుకోలేదు

అటవీశాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ 

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై సర్కారు స్పందన


అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఔను! అమరరాజా ఫ్యాక్టరీని మేమే పంపిస్తున్నాం. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదు... ప్రభుత్వమే దండం పెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటోంది’’ అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ‘అమరరాజా సంస్థకు చెందిన తిరుపతి ఫ్యాక్టరీ ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు’ అని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌ కుమార్‌ తేల్చి చెప్పారు. అమర రాజా సంస్థ తన విస్తరణ ప్రణాళికలను తమిళనాడులో చేపట్టనుందని, సర్కారు వేధింపులు ఆగకపోతే మొత్తం ప్లాంట్లనూ తరలించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘మీకో దండం... ఇక్కడ ఉండం’ శీర్షికన ప్రచురించిన ఈ కథనంపై సజ్జల, విజయ్‌కుమార్‌ వేర్వేరుగా స్పందించారు.


ఈ విషయాన్ని బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’కి సమాచారం అందించకుండా, తమకు నచ్చిన, ప్రశ్నించని మీడియా ప్రతినిధులను మాత్రమే పిలిపించుకుని మాట్లాడారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మాట్లాడుతూ... ‘‘అమరరాజా బ్యాటరీస్‌ అర్జంట్‌గా వెళ్లిపోతుందని.. మీకో దండమని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనం ప్రచురించింది. ఆ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తూ .. ప్రాణాలకూ హాని కలిగించే రీతిలో విష పదార్థాలు అక్కడి నీళ్లలో ఉన్నాయని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు తేల్చింది. హైకోర్టు కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో వాళ్లు పోవడం కాదు.. ప్రభుత్వమే పొమ్మంటోంది.  మీరు కంట్రోల్‌ చేయలేనిదేమైనా ఉంటే ఇక్కడ ఉండొద్దని దండం పెట్టి చెబుతోంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ఇందులో రాజకీయం, ప్రభుత్వ జోక్యం ఏదీ లేదన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), హైకోర్టు చెప్పినందునే చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని పరిశ్రమలను మాత్రమే తాము ఆహ్వానిస్తామని... ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ జగన్‌ ఇదే కోరుకున్నారని తెలిపారు. ‘‘సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి.. చివరికి ఆ ఫ్యాక్టరీ సజ్జల రామకృష్ణా రెడ్డిదైనా జగన్‌ ఇదే నిర్ణయం తీసుకునేవారు. ప్రభుత్వం ప్రభుత్వంలాగే పనిచేస్తుంది. ఇంకా చాలామందిపై కేసులు ఉంటాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చట్టప్రకారం చేస్తుంటే లాగడం ఎందుకు?’’ అని సజ్జల ప్రశ్నించారు.


మేం అలా  కోరుకోవడంలేదు కానీ... లాభం ఉన్నచోటే వ్యాపారం: బొత్స

తిరుపతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అమరరాజా సంస్థ మరో రాష్ట్రానికి వెళ్లిపోవాలని తాము కోరుకోవడంలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘వ్యాపారులు ఎక్కడ లాభం ఉంటే అక్కడకు వెళతారు. వ్యాపారం చేసుకునేవాడికి ఏ రాష్ట్రమైతే ఏంటి? వెళ్లిపోవాలని మేము కోరుకోవడంలేదు’ అని తెలిపారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అమరరాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని, తప్పుచేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తోందన్నారు.


మూసేయమన్నాం: విజయ్‌కుమార్‌

పర్యావరణ నిబంధనలు పాటించని అమరరాజా బ్యాటరీ్‌సను మూసివేయాలని తాము ఉత్తర్వులు  ఇచ్చామని అటవీశాఖ  కార్యదర్శి విజయ్‌కుమార్‌ వెల్లడించారు. ‘‘తిరుపతి ప్లాంటు ఉన్న చోట సరిచేయలేనటువంటి పర్యావరణ నష్టం జరిగింది. లోపాలను సరిచేసుకోవడానికి సమయం ఇచ్చిన తర్వాత ఉత్పత్తి నిలుపుదల ఉత్తర్వులు జారీ చేశాం. లోపాలను సరిదిద్దుకోనందువల్లే మూసివేత ఉత్తర్వులు ఇచ్చాం. విద్యుత్‌ సరఫరా నిలిపివేత వంటి చర్యలు తీసుకున్నాం’’ అని తెలిపారు. తప్పులు చేస్తున్న అన్ని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నామని, అందులో అమరరాజా ఒకటని చెప్పారు. ‘‘మూసివేత నోటీసుపై అమరరాజా సంస్థ హైకోర్టుకు వెళ్లి నాలుగు వారాల స్టే తెచ్చుకుంది. హైకోర్టు ఆదేశాలతో తనిఖీలు చేసేందుకు  వెళ్లగా గేటువేసి అడ్డుకున్నారు. దీనిపై పోలీసు కేసు పెట్టాం. తిరుపతి సమీపంలోని ప్లాంటును అక్కడ కొనసాగించవద్దు.


ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ ఫ్యాక్టరీని మరోచోటకు తరలించాలని హైకోర్టుకు నివేదించాం’’ అని విజయ్‌కుమార్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా భయంకరమైన పర్యావరణ కాలుష్యం వెదజల్లుతుంటే ఇన్నేళ్లు ఏం చేశారని మీడియా ప్రశ్నించగా... ‘‘గతంలో తనిఖీలు చేపట్టని వాటిని మేం పరిశీలించాం. వారు ప్రతి ఆరు నెలలకోసారి కాలుష్య నియంత్రణపై నివేదిక ఫైలు చేయాలి. కానీ... గత కొన్నేళ్లుగా వారు ఆ నివేదికలు ఇవ్వడం లేదు’’ అని తెలిపారు. పరిశ్రమలు రావాలి... పర్యావరణం కూడా బాగుండాలని అన్నారు.


‘ఆంధ్రజ్యోతి’ అంటే అంత భయమా?

అమరరాజా రాష్ట్రం నుంచి వెళ్లిపోయే ప్రమాదముందన్న కథనం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్మిక, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టించింది. సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన చర్యలను సమర్థించుకునేందుకు సర్కారు నానాపాట్లు పడింది. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. 16వేల మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ తరలిపోయే అవకాశముందని ప్రచురించిన కథనానికి... ‘సామాజికవర్గం - బంధుత్వం’ అంటగట్టి పసలేని కబుర్లు  చెప్పారు.  ‘దండం పెట్టి మేమే పొమ్మంటున్నాం’ అని చెప్పేశారు. అటవీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ కూడా అదే ధోరణిలో మాట్లాడారు. అయితే, ఆ ఇద్దరూ తమకు అనుకూలమైన మీడియాను మాత్రమే పిలిపించుకొని మాట్లాడటం గమనార్హం. గతంలో మన్యంలో మైనింగ్‌ విషయంలో గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు ఆయన చెప్పిన ఏకపక్ష సమాధానాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు అప్పటికప్పుడే ప్రశ్నలు సంధించారు. వాటికి ద్వివేదీ సరైన సమాధానం చెప్పలేకపోయారు.


ప్రెస్‌మీట్‌కు ‘ఆంధ్రజ్యోతి’ వస్తే ఎక్కడ ప్రశ్నలు అడుగుతారో, ఎక్కడ అడ్డంగా దొరికిపోతామో అన్న భయంతో అటు సజ్జల, ఇటు విజయ్‌కుమార్‌ తమకు అనుకూలంగా ఉండేవారిని మాత్రమే పిలిపించుకొని, తాము చెప్పదలుచుకుంది చెప్పి వెళ్లిపోయారు. నిజానికి వీరిద్దరూ అధికారిక హోదా ఉన్నవారే. తాము చెప్పేది వాస్తవమైతే, సందేహాలకు సాధికార సమాధానం చెప్పగలుగుతామనే నమ్మకం ఉంటే... మీడియా మొత్తాన్నీ పిలవాలి. కానీ... ప్రశ్నించే వారికి సమాచారం ఇవ్వకుండా, సొంత వారితో తూతూ మంత్రం ప్రెస్‌మీట్లు పెడుతుండటం గమనార్హం.

Updated Date - 2021-08-04T08:34:34+05:30 IST