జగన్ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై గౌరవం లేదు: మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు

ABN , First Publish Date - 2022-06-04T23:43:13+05:30 IST

రాజధాని అమరావతి పోరాటం 900 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్నారైలు భాను మాగులూరి అధ్యక్షతన రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు.

జగన్ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై గౌరవం లేదు:  మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు

ఎన్నారై డెస్క్: రాజధాని అమరావతి పోరాటం 900 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్నారైలు భాను మాగులూరి అధ్యక్షతన రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు.  మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం.. ప్రవాసీ భారతీయులు రాజధాని రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 


ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘రాజకీయ అవసరాల కోసం కాకుండా ప్రజావసరాల కోసం ప్రభుత్వం పని చేయాలని హైకోర్టు  హితవు పలికింది. వైసీపీ ప్రభుత్వానికి రాజధానిని మార్చే హక్కు లేదు. రైతులు తమ హక్కుల కోసం ఉద్యమించి, న్యాయస్థానం సాక్షిగా తమ పోరాటాన్ని సాగించినా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదంతా బూటకం. న్యాయస్థానాల తీర్పును ప్రభుత్వం గౌరవించాలి. ప్రభుత్వం మొండివైఖరి వీడి, తక్షణమే రాజధాని నిర్మాణం  చేపట్టాలి’’ అని అన్నారు. 


రైతులకు ఇచ్చిన వాగ్దానం  ప్రకారం వారికి కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఆదేశాలు ఇచ్చినప్పటి నుండి మూడు నెలల్లో అప్పగించాలని న్యాయస్థానం తెలిపిందన్నారు. న్యాయస్థానం ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించటం శోచనీయమన్నారు. రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా ఒకే రాజధాని ఏర్పాటుకు అవకాశం ఉందన్న విషయాన్ని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టంగా తెలిపిందన్నారు. 900 రోజులుగా రైతుల ఘోష ప్రభుత్వం చెవిన పడినా మౌనం వీడకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కోర్టు ఆదేశాల మేరకు అభివ‌ృద్ధి దిశగా రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ లాం, రామ్ ఉప్పుటూరి, త్రిలోక్, అనీల్, చక్రవర్తి, సత్యనారాయణ రాజు, వీర్రాజు, సతీష్, రవి, కార్తిక్ కోమటి, రామకృష్ణ, సిద్దూ, లిఖిత్, నాగ శంకర్, వినీల్ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-06-04T23:43:13+05:30 IST