అమరావతి భూములు అన్యాక్రాంతం

ABN , First Publish Date - 2022-08-20T09:58:02+05:30 IST

రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి భూములిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి నిర్మాణాన్ని అటకెక్కిచ్చింది.

అమరావతి భూములు అన్యాక్రాంతం

  • బయటి వ్యక్తులు వెయ్యి ఎకరాలు ఆక్రమణ 
  • ఇందులో రైతుల ప్లాట్లు, సీఆర్డీయే భూములు
  • హద్దులు చెరిపి, రాళ్లు పీకేసి పంటల సాగు
  • కొన్నిచోట్ల మట్టి తవ్వుకుపోతున్న వైనం 
  • పట్టించుకోని సీఆర్డీయే అధికారులు

గుంటూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి భూములిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి నిర్మాణాన్ని అటకెక్కిచ్చింది. రైతుల కల సాకారం కాకపోగా.. ప్రభుత్వంవారికిచ్చిన ప్లాట్లు అన్యాక్రాంతమైపోతున్నాయి. రాజధాని ప్రాంతంతో సంబంధం లేని బయటి వ్యక్తులు రైతుల ప్లాట్లను, సీఆర్డీయే భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత పొలాల్లోకి, తమకు కేటాయించిన ప్లాట్లలోకి తాము వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అమరావతి ప్రాంతంలో వాణిజ్య, నివాసప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని మార్చిలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రైతుల భూములు, ప్లాట్లు చిట్టడవుల్లా తయారయ్యాయి. ఇదే అదనుగా బయటి వ్యక్తులు ఈ భూములను ఆక్రమించుకుంటున్నారు. అనధికారికంగా సాగు చేస్తున్నారు. ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, మందడం, వెంకటపాలెం, తుళ్లూరు, దొండపాడు గ్రామాల్లోని జరీబు భూములను దున్ని పంటలు వేసుకుంటున్నారు.


 ఐనవోలు పరిసర గ్రామాల్లో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లను కూడా ఆక్రమించి సాగు చేస్తున్నారు. చిల్ల చెట్లు, ముళ్ల కంపల మధ్య ఉన్న భూమిని చదును చేసుకుని పంటలు పండించుకుంటున్నారు. రాజధాని పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని రైతులు అంచనా వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆక్రమణలను నివారించడానికి కనీస చర్యలు చేపట్టడం వంటి వాటిని సీఆర్డీఏ అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్లాట్లను ఆక్రమించి ప్లాట్ల హద్దురాళ్లను పీకేసి, హద్దులు చెరిపేయడం వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు వాపోతున్నారు. జియో ట్యాగింగ్‌ చేసిన భూములను గుర్తించడం కూడా కష్టమవుతుందని ఆవేదన చెందుతున్నారు. 


ప్లాట్లను తవ్వి మట్టి తరలింపు

ఇదివరకే రాజధాని ప్రాంతంలోని రోడ్లను తవ్వుకుని పోయిన అక్రమార్కులు ఇప్పుడు మరింత చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం, సీఆర్డీయే అధికారుల ఉదాసీన వైఖరి వల్ల బరితెగించిపోతున్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పరిసరాల్లో ఉన్న రైతుల ప్లాట్లలో మట్టిని కొల్లగొట్టుకుపోతున్నారు. ఒక రైతు ప్లాటులో 50 టిప్పర్ల మట్టిని తోలుకుపోయారని రైతులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల ప్లాట్లు అఘాధాలుగా మారిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ప్లాట్లను అభివృద్ధి చేసి తమకు అప్పగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-08-20T09:58:02+05:30 IST