ఆ మాతృమూర్తి పట్టుదలే మాకు ఆదర్శం

ABN , First Publish Date - 2020-06-07T09:39:05+05:30 IST

మలి వయసులో ఒంటరిగా పోరాడి కొడుకు ప్రాణం కాపాడుకున్న డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి తమకు ఆదర్శమంటూ అమరావతి పోరాట దళిత జేఏసీ నేతలు అన్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే

ఆ మాతృమూర్తి పట్టుదలే మాకు ఆదర్శం

  • 172వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): మలి వయసులో ఒంటరిగా పోరాడి కొడుకు ప్రాణం కాపాడుకున్న డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి తమకు ఆదర్శమంటూ అమరావతి పోరాట దళిత జేఏసీ నేతలు అన్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని రైతులు చేస్తోన్న ఆందోళనలు శనివారం 172వ రోజుకు చేరాయి. సుధాకర్‌ తల్లి కావేరిబాయి, తమ ప్రాంత మహిళా రైతులు చూపుతున్న తెగువే అదర్శంగా తీసుకొని పోరాడి అమరావతిని నిలుపుకొంటామంటూ కొవ్వొత్తులు వెలిగించి దళిత నేతలు, రైతులు ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం మోసం చేసిందని... న్యాయం చేస్తారనుకున్న దళిత సంఘాలు మౌనం పాటిస్తున్నాయని ఎవరు వచ్చినా రాకపోయినా నిరుత్సాహ పడకుండా.. అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం చేస్తామని జేఏసీ నేతలు, అసైన్డ్‌ రైతులు స్పష్టంచేశారు. రైతులను, కూలీలను వేరు చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని.. పాదయాత్రలో, అసెంబ్లీలోనూ సీఎం జగన్మోహనరెడ్డి తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని దళిత జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. కాగా.. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ 29 గ్రామాల్లో రైతులు, మహిళలు ఇంటింటా అమరావతి కార్యక్రమం కొనసాగించారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడకలో రైతులు ఆందోళనలు చేపట్టారు.

Updated Date - 2020-06-07T09:39:05+05:30 IST