ఆల్ఫాబెట్‌లో వేధింపులు!

ABN , First Publish Date - 2021-04-12T11:13:38+05:30 IST

టెక్‌ దిగ్గజం ఆల్ఫాబెట్‌లో వేధింపులు పెరిగిపోతున్నాయి! సంస్థలో వేధింపులు తారస్థాయికి చేరాయంటూ 500 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసి ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి బహిరంగ

ఆల్ఫాబెట్‌లో వేధింపులు!

వేధించేవారిపై చర్యలు తీసుకోండి: ఉద్యోగులు

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు లేఖ

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 11: టెక్‌ దిగ్గజం ఆల్ఫాబెట్‌లో వేధింపులు పెరిగిపోతున్నాయి! సంస్థలో వేధింపులు తారస్థాయికి చేరాయంటూ 500 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసి ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి బహిరంగ లేఖ రాశారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేధింపులకు గురిచేసే వారిని రక్షించడం ఆపాలని కోరారు. గూగుల్‌ మాజీ ఇంజనీర్‌ ఎమీ నీట్‌ఫీల్డ్‌ తనపై వేధింపులు జరిగితే సంస్థ ఎలా వ్యవహరించిందో తెలియజేస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌లో ఒక వ్యాసం రాసిన కొద్ది రోజులకే ఉద్యోగులు ఈ లేఖ రాయడం గమనార్హం. ‘గూగుల్‌లో పనిచేసిన తర్వాత నాకు ఎన్నడూ మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు’ శీర్షికన ఎమీ నీట్‌ఫీల్డ్‌ తన అనుభవాలను వెల్లడించారు. 


తనను వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పిన వ్యక్తితోనే బలవంతంగా ముఖాముఖి భేటీలు నిర్వహించారని, అతని పక్క సీటులోనే కూర్చోబెట్టారని వివరించారు. అతనితో ఇబ్బందిగా ఉందని చెప్పినా.. విచారణాధికారులు పట్టించుకోలేదని తెలిపారు. పైగా తనకే ‘కౌన్సెలింగ్‌ తీసుకోండి, ఇంటి నుంచి పనిచేయండి, లేదా సెలవుపై వెళ్లండి’ అని సలహా ఇచ్చారన్నారు. అయితే ఈ అనుభవం తనకు మాత్రమే కాదని, అంతకుముందు వేధింపులకు గురైన అనేక మంది విషయంలోనూ గూగుల్‌ ఇలాగే ప్రవర్తించినట్లు తెలిసిందని వివరించారు. గూగుల్‌లో ఎమీది తొలి కేసేమీ కాదని ఉద్యోగులు సుందర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ గతంలోనూ వేధించిన వారినే సమర్థించిందని ఆరోపించారు. 2018లో 20వేల మందికి పైగా ఉద్యోగులు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారని.. అయినా సంస్థ వ్యవహారశైలిలో మార్పు రాలేదని ఆరోపించారు. అయితే గూగుల్‌ సంస్థ మాత్రం ఉద్యోగుల ఆందోళనలపై విచారణ తీరును మెరుగుపర్చుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల సంరక్షణకు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంది.


Updated Date - 2021-04-12T11:13:38+05:30 IST