పాఠాలతో పాటు పోరాటమూ నేర్పారు

ABN , First Publish Date - 2022-08-18T07:04:16+05:30 IST

మిన్ను విరిగి మీదపడినా వెన్ను చూపని ధీశాలిగా, అపర ఝాన్సీ లక్ష్మీబాయిగా ఖ్యాతిపొందిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ పాల్గొనని జాతీయ ఉద్యమాలు లేవు.

పాఠాలతో పాటు పోరాటమూ నేర్పారు

మిన్ను విరిగి మీదపడినా వెన్ను చూపని ధీశాలిగా, అపర ఝాన్సీ లక్ష్మీబాయిగా ఖ్యాతిపొందిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ పాల్గొనని జాతీయ ఉద్యమాలు లేవు. ఆమె ప్రస్తావించని, ప్రబోధించని మహిళా సమస్యలు లేవు. ఎక్కడ ఏ సంస్కరణ అవసరమైనా, సాంఘిక మార్పు రావలసి ఉన్నా... దాని కోసం ఆమె ప్రమేయం తప్పనిసరిగా ఉండేది. సంగం లక్ష్మీబాయి, బసవరాజు రాజ్యలక్ష్మి లాంటి ఎందరినో వీరవనితలుగా ఆమె తయారు చేశారు. 


1882లో నడింపల్లి సీతారామయ్య, రామలక్ష్మమ్మల ముద్దు బిడ్డగా లక్ష్మీబాయి జన్మించారు. గుంటూరు జిల్లా అమీనాబాద్‌ ఆమె జన్మస్థలం. బారిస్టర్‌ అయిన ఉన్నవ లక్ష్మీనారాయణతో 1892లో ఆమె వివాహం జరిగింది. బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించిన ‘మాలపల్లి’ లాంటి గొప్ప నవల రాసిన లక్ష్మీనారాయణ జాతీయోద్యమ, సంఘ సంస్కరణ భావాలను గుండె నిండా నింపుకొన్న వ్యక్తి. ఆయన సహచర్యంలో లక్ష్మీబాయికి విజ్ఞాన కాంక్ష, సంఘ సంస్కరణపై ఆపేక్ష పెరిగాయి. 1902లో ఆ దంపతులు గుంటూరులో వితంతు శరణాలయం స్థాపించారు. పునర్వివాహాలు జరిపించారు. దీనికోసం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. మరోవైపు స్వరాజ్య సంపాదన గురించి, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం గురించీ పలువురు నాయకులతో సమావేశమై చర్చిస్తూ ఉండేవారు. జాతీయోద్యమంలో గాంధీజీ నాయకత్వం వచ్చిన తరువాత... కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో ఉన్నవ దంపతులు క్రియాశీలంగా పాల్గొన్నారు. 


ప్రభుత్వాన్ని ధిక్కరించి, పల్నాటి ప్రాంతంలో పన్ను చెల్లించకుండా ప్రజలు అడవిని వాడుకోసాగారు. ఆ ఉద్యమాన్ని రగిల్చారనే అనుమానంతో... ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడభూషి వేదాంత నరసింహాచార్యులను ప్రభుత్వం నిర్బంధించింది. అప్పటికి స్థానిక ప్రజలెవరూ స్వాతంత్య్ర ఉద్యమంలో జైలుకు వెళ్ళలేదు. గుంటూరు రైల్వే స్టేషన్‌కు వెళ్ళి, భర్తకు ధైర్యంగా వీడ్కోలు చెప్పిన లక్ష్మీబాయి... నాటినుంచి ఉద్యమ ప్రచారంలోకి దిగారు. తన ఉపన్యాసాలతో విద్యార్థులనూ, మహిళలనూ ఉత్తేజపరిచారు. విశాఖపట్టణం వైద్య కళాశాల విద్యార్థులు చాలామంది ఆమె ప్రబోధంతో... గాంధీ టోపీలతో కాలేజీకి వెళ్ళి, శిక్షలకు గురయ్యారు. ఆమె మాట ప్రభావం అంతటిది.


గుంటూరులో లక్ష్మీబాయి ప్రారంభించిన శారదా నికేతనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశభక్త కొండా వెంకటప్పయ్య ఇంట్లో చిన్న పాఠశాలగా 1918లో అది ఆరంభమయింది. అనంతరం దినదినాభివృద్ధి చెంది... రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ శాంతినికేతనాన్ని తలపించేది. అక్కడ తెలుగు, సంస్కృతం, సంగీతం, చిత్రలేఖనం, అల్లికలు, కుట్లు, ఊలు వడకడం లాంటివి నేర్పేవారు. జాతి, కుల, మత భేదం లేకుండా... ఆడపిల్లలందరికీ విద్యను, హాస్టల్‌ సదుపాయాన్నీ ఉచితంగా అందించేవారు. ఇవన్నీ నేర్చుకొని మహిళలు విజ్ఞానవంతులు కావాలనీ, తమ గౌరవాన్నీ కాపాడుకోవాలనీ, అవసరమైన పరిస్థితులలో కొంత డబ్బు సంపాదించుకోగలగాలనీ, మాతృదేశానికి సేవ చేయాలనీ ఉన్నవ దంపతులు ఆశించారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దారు. ఆంధ్ర రాష్ట్ర పర్యటనల్లో ఒకటి, రెండుసార్లు శారదా నికేతనాన్ని గాంధీజీ సందర్శించి, ప్రశంసించారు. 


ఒకవైపు మహిళాభ్యుదయానికి పాటుపడుతూనే... మరోవైపు జాతీయోద్యమంలోనూ లక్ష్మీబాయమ్మ చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ నిధిని పోగు చేయడానికి బర్మా వెళ్ళారు. తమ ఆస్తిపాస్తులన్నిటినీ దేశం కోసం అర్పించారు. విదేశీ వస్తువులను, వస్త్రాలనూ బహిష్కరించాలని నిరంతరం ఆమె చెప్పేవారు. ఆమెతో పాటు శారదా నికేతనంలోని బాలికలందరూ నూలు వడికేవారు, ఖాదీ దుస్తులు ధరించేవారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో మహిళలందరినీ కూడగట్టి ఆమె ప్రచారం సాగించారు. ఆ రోజుల్లో గుంటూరు కొత్తపేటలో శాంతి సైనికుల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన శిబిరం నిర్వహణ బాధ్యతలన్నీ లక్ష్మీబాయే చూశారు. ఒక రోజు పోలీసులు దాడి జరిపి, శిబిరాన్ని ధ్వంసం చేశారు. దొరికినవారిని దొరికినట్టు లాఠీలతో చితకబాదారు. 

లక్ష్మీబాయి వివిధ ప్రాంతాల్లో ప్రచారం సాగిస్తూ, ఉప్పు వండి శాసనధిక్కారం చేస్తూ ఉండేవారు. చివరకు దేవరంపాడులో 1930 జూన్‌లో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరు నెలల కఠిన శిక్ష విధించి, రాయవేలూరు జైలుకు పంపారు. 1932లో శాసనోల్లంఘనం రెండోసారి దేశాన్ని ఊపేసింది. ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్‌ సమావేశంపై పోలీసులు నిషేధం విధించారు. నిషేధాజ్ఞలను ధిక్కరించి, అనేకమంది జాతీయ నాయకులతో పాటు ఢిల్లీ వెళ్ళిన లక్ష్మీబాయమ్మను కూడా అరెస్ట్‌ చేశారు. అలాగే 1941లో ‘వ్యక్తి సత్యాగ్రహం’లో సైతం ఆమె పాల్గొని, మూడు నెలల జైలు శిక్ష అనుభవించారు. 


లక్ష్మీబాయి సంప్రదాయాలను నిక్కచ్చిగా పాటించేవారు. అయితే మహిళల అభ్యున్నతికి, ఆత్మగౌరవానికి విరుద్ధంగా ఉండేవాటిని సహించేవారు కాదు. సభలు, సమావేశాల్లో మహిళలకు తగిన గౌరవం లభించకపోతే.. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవారు. కాంగ్రెస్‌ తరఫున గుంటూరు పురపాలక సంఘ సభ్యురాలుగా కూడా ఆమె సేవలు అందించారు. 1952లో.. మరణించే వరకూ మహిళల విద్య, అభ్యున్నతే ధ్యేయంగా జీవించారు. ఆమె నేతృత్వంలోని శారదా నికేతనం జాతీయోద్యమానికి మణిపూసల్లాంటి ఎందరో మహిళలను అందించింది. 

Updated Date - 2022-08-18T07:04:16+05:30 IST