‘ఆలమట్టి’ ఎత్తు పెంపునకు కర్ణాటక యత్నం

ABN , First Publish Date - 2020-07-04T08:22:56+05:30 IST

రెండు తెలుగురాష్ట్రాలకు ఇది చేదు వార్త. ఆలమట్టి డ్యాం ఎత్తును పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలను

‘ఆలమట్టి’ ఎత్తు పెంపునకు కర్ణాటక యత్నం

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : రెండు తెలుగురాష్ట్రాలకు ఇది చేదు వార్త. ఆలమట్టి డ్యాం ఎత్తును పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం  ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అవి ఫలిస్తే... దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కృష్ణా నీటి ప్రయోజనాలు భారీగా దెబ్బతిననున్నాయి. ఇప్పటికే అరకొర నీటితో రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర జల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి రావాల్సిన నీరు కూడా రాకపోతే సమస్య మరింత తీవ్రరూపు దాల్చనుంది. ఆలమట్టి డ్యాం ఎత్తును పెంచుకోవడానికి వీలుగా నోటిఫికేషన్‌ను జారీ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు కర్ణాటక ఇరిగేషన్‌ శాఖ మంత్రి రమేశ్‌ జార్కిహోలి ప్రకటించారు.


దీనిపై నోటిఫికేషన్‌ జారీ కాగానే డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతామని స్పష్టంచేశారు. ఒకవేళ ఇదే జరిగితే దిగువకు రావాల్సిన సుమారు 130 టీఎంసీల నీటిని మళ్లించేందుకు కర్ణాటకకు మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా జూరాల, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, హంద్రీ-నీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడనుంది. 

Updated Date - 2020-07-04T08:22:56+05:30 IST