అన్ని యోగాల లక్ష్యం ఒక్కటే!

ABN , First Publish Date - 2020-03-03T07:47:22+05:30 IST

కర్మయోగమైనా, భక్తియోగమైనా, రాజయోగమైనా, జ్ఞానయోగమైనా.. అన్నీ కూడా మనస్సును శుద్ధం చేసి హృదయంనందు నిలపడం కోసమే అని దీని అర్థం. భగవాన్‌ రమణులు రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’ గ్రంథంలోని...

అన్ని యోగాల లక్ష్యం ఒక్కటే!

  • హృత్‌ స్థలే మనః స్వస్థతా క్రియా
  • భక్తి యోగ బోధాశ్చనిశ్చితం


కర్మయోగమైనా, భక్తియోగమైనా, రాజయోగమైనా, జ్ఞానయోగమైనా.. అన్నీ కూడా మనస్సును శుద్ధం చేసి హృదయంనందు నిలపడం కోసమే అని దీని అర్థం. భగవాన్‌ రమణులు రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’ గ్రంథంలోని పదో శ్లోకమిది. ఆధ్యాత్మిక సాధనలన్నీ ఎందుకోసం నిర్దేశించబడ్డాయో మహర్షి ఇందులో స్పష్టంగా వివరించారు. మనస్సు హృదయంలో చేరి స్వస్థత పొందడమే కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగ మార్గాలన్నింటి లక్ష్యం అని తెలియజేస్తున్నారు. ఇక్కడ హృదయం అంటే ప్రత్యగాత్మయే. అంటే జీవుని యొక్క నిజస్వరూపమే. జీవుని నిజస్వరూపమైన ప్రత్యగాత్మ.. పరమాత్మే. అక్కడ మనస్సు స్వస్థత చెందడమే లక్ష్యం. స్వస్థత అనే పదాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. మనస్సు అనే ఒక కిరణం ఆత్మ నుండి వచ్చింది. అది ప్రపంచంలో విహరిస్తుంది. కష్టాలు, సుఖాలు అనుభవిస్తుంది. ఎంతకాలమైనా అంతే. ఎప్పుడైతే తను పుట్టిన చోటును, జన్మస్థలాన్ని తెలుసుకుని అటువైపునకు తిరిగి ప్రయాణించి ఆ చోటు (ఆత్మను) చేరి అందులో కలిసిపోతుందో ఇక దాని కష్టాలు, బాధలు అన్నీ అంతం అయిపోతాయి. పరమశాంతి కలుగుతుంది.

అన్ని నదుల పరిస్థితి కూడా ఇంతే. నదుల జన్మస్థానం సము ద్రం, సముద్ర జలం ఆవిరై మేఘాలుగా మారి చల్లబడి వర్షాన్ని స్తే.. ఆ జలం వాగులుగా, వంకలుగా మారి, నదులను చేరి ఎన్నో వంపులు తిరుగుతూ ప్రయాణించి చివరకు సముద్రాన్ని చేరుతుంది. ఇదే కోవలో ఆత్మ సముద్రమైతే మనసు నది. మనసు ఆత్మను చేరితే ప్రశాంతి. ఆనందం. అంటే.. మనస్సు అంతర్ముఖం అయితే ఆనందం. బహిర్ముఖమైతే దుఃఖం. ఇలా మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపివేయడానికే అన్ని సాధనలు, అన్ని మార్గాలు, అన్ని యోగాలు. మరి అన్నిటి లక్ష్యమూ ఒకటే అయినప్పుడు ఇన్ని యోగాలు ఎందుకు? అంటే.. ఒక పల్లెటూరిలో ఉండేవాడు ముంబై వెళ్లాలంటే.. ముందు ఎద్దుల బండిలో ఇంటి దగ్గర్నుంచి మెయిన్‌రోడ్డుకు చేరాలి. అక్కడి నుంచి ఆటోలో బస్టాండుకు చేరాలి. అక్కడ బస్సెక్కి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లాలి. ఆ పట్టణం నుంచి రైల్లో ముంబైకి వెళ్లాలి. ఇందులో ప్రతి ప్రయాణమూ ముంబై చేరడానికే కదా! మనస్సు ఆత్మను చేరే క్రమంలో యోగాలూ అలాగే సందర్భావసరాలను బట్టి ప్రయాణసాధనాలుగా ఉపకరిస్తాయి. ఉదాహరణకు.. మనస్సు తమోగుణంలో ఉంటే కర్మలు చేస్తూ కర్మయోగాన్ని ఆచరించాలి. రజోగుణంలో ఉంటే భక్తి యోగాన్ని అనుసరిస్తూ మనస్సులోని అలజడులను తగ్గించుకుని శాంతిపరచాలి. రాజయోగం- అష్టాంగ యోగం ద్వారా చిత్తశుద్ధి పొందాలి.   ఏ స్థితిలో ఉన్నవారికి ఆ యోగం అన్నమాట. అన్నీ ప్రయాణసాధనాలే. అవి మనస్సును మోసుకుని వెళ్లి హృదయంలో పడేస్తాయి. ఇదే అన్ని ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం. - దేవిశెట్టి చలపతిరావు, ఛ్చిట్ఛఃటటజీఛిజ్చిజ్చూఞ్చ్టజిజీట్చౌ.ఛిౌఝ


Updated Date - 2020-03-03T07:47:22+05:30 IST