కొలువులన్నీ భర్తీ చేయాలి!

ABN , First Publish Date - 2021-07-23T09:34:49+05:30 IST

భారత రాజ్యాంగంలోని 371-డి లోని(1) (2) క్లాజుల కింద ఉన్న అధికారాలననుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ అమెండ్‌మెంట్‌ ఆర్డర్‌– 2021కు...

కొలువులన్నీ భర్తీ చేయాలి!

భారత రాజ్యాంగంలోని 371-డి లోని(1) (2) క్లాజుల కింద ఉన్న అధికారాలననుసరించి రాష్ట్రపతి  తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) అమెండ్‌మెంట్‌ ఆర్డర్‌– 2021కు ఏప్రిల్‌ 19న ఆమోదముద్ర వేయడంతో కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా 128 జీవో జారీ చేయడంతో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్‌లతో కూడిన నూతన జోనల్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటయింది. 


జోన్ల సమస్యతో రాష్ట్రంలో ఏడేళ్లుగా వేల సంఖ్యలో నిలిచిపోయిన ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.  కొన్నాళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై, ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు, నిరుద్యోగుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నియమించిన మొదటి పి.ఆర్‌.సి తన నివేదికలో రాష్ట్రంలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్యను తేటతెల్లం చేయడంతో వివిధ రకాల అభిప్రాయాలకు, వాదనలకు తెరదించినట్లయింది. తెలంగాణలో మొత్తం మంజూరైన పోస్టులు 4,91,304 ఉండగా అందులో కేవలం 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, రాష్ట్రంలో మొత్తం ఉద్యోగ ఖాళీలు 1,91,126 ఉన్నాయని పే రివిజన కమిషన బహిర్గతం చేసింది. బిస్వాల్‌ కమిటీ రిపోర్టు ప్రకారం పాఠశాల విద్యాశాఖలో మొత్తం 1,37,851 పోస్టులు మంజూరు కాగా 1,13,853 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, పోలీస్‌ శాఖలో 98,394 పోస్టులకు గాను 61,212 మంది, వైద్య ఆరోగ్య శాఖలో 52,906 పోస్టులకు గాను 22,336 మంది, రెవెన్యూ శాఖలో 27,786 పోస్టులుండగా 19,825 మంది, పంచాయతీరాజ్‌ విభాగంలో 26,201 పోస్టులకుగాను 13,573 మంది ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన పోస్టులలో 39 శాతం మేర ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేసి పారదర్శకంగా నియామకాలు జరిపినప్పుడే స్వరాష్ట్ర సాకార పోరాటానికి సార్థకత చేకూరుతుంది.

బి. కార్తీక్‌ రెడ్డి, మహబూబాబాద్

Updated Date - 2021-07-23T09:34:49+05:30 IST