మతాలన్నీ పరబ్రహ్మోపాసనలే

ABN , First Publish Date - 2022-02-25T05:30:00+05:30 IST

హిందూ ధర్మంలో... ఆరాధించే వివిధ ప్రధాన దేవతల ఆధారంగా వివిధ శాఖలు లేదా మతాలు ఏర్పడ్డాయి. విష్ణు పారమ్యాన్ని ప్రవచించే వైష్ణవ మతానుయాయులు హిందూధర్మంలో అధికంగా ఉన్నట్టు కనిపిస్తారు. భగవద్రామానుజులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు..

మతాలన్నీ  పరబ్రహ్మోపాసనలే

హిందూ ధర్మంలో... ఆరాధించే వివిధ ప్రధాన దేవతల ఆధారంగా వివిధ శాఖలు లేదా మతాలు ఏర్పడ్డాయి. విష్ణు పారమ్యాన్ని ప్రవచించే వైష్ణవ మతానుయాయులు హిందూధర్మంలో అధికంగా ఉన్నట్టు కనిపిస్తారు. భగవద్రామానుజులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు తదితరులు వైష్ణవ ధర్మానికి చెందినవారు. షణ్మత స్థాపనాచార్యుడైన శంకర భగవత్పాదులు కూడా కృష్ణ భక్తులని ప్రతీతీ. ఇంతకూ ఏమిటీ వైష్ణవ మతం? ఇతర మతాలకు, దీనికి భేధం ఏమిటి?


‘విష్ణువు’ అంటే సర్వంలోనూ అంతర్యామిగా ప్రవేశించి, అంతటా వ్యాపించిన తత్త్వం. అది పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఒక వ్యక్తిగానో, వస్తువుగానో నిర్వచించడం కానీ, పరిమితం చేయడం కానీ సాధ్యపడదు. ఎందుకంటే, ఆ హద్దు దగ్గర, హద్దుకు లోపలా, వెలుపలా కూడా వ్యాపిస్తున్నది అదే కనుక. విష్ణువు అంటే ఖరీదైన వస్త్రాభరణాలు ధరించే ఒకానొక దేవతామూర్తి పేరు అనుకోవడం అపరిపక్వమైన ఆలోచన. మరి విష్ణువుకు ప్రత్యేకమైన రూపం, వేషం, చిహ్నాలు, వాహనం, పత్ని, పరివారం, నివాసం ఉన్నాయి కదా! వాటి పేర్లు కూడా చెప్పారు కదా! అలాంటప్పుడు ‘విష్ణువును ఒక దేవత అనుకోకుండా ఉండడం ఎలా?’ అనే సందేహం కలగవచ్చు. నిజానికి అవన్నీ శబ్ద, అర్థ, దృశ్య ప్రతీకలు. కొన్ని ప్రతీకలు సృష్టిలో సహజంగా ఉన్నవి కాగా, మరికొన్ని ఉపాసనా సౌలభ్యం కోసం ఋషులు కల్పించినవి. ఈ ప్రతీకలలోని అసలు అర్థాన్ని తెలుసుకోకపోతే... మూలతత్త్వంపై సరైన అవగాహన కలగదు. ఋషుల వాఙ్మయంలో వినియోగించే పేర్లు... మనం మానవులకూ, ప్రదేశాలకూ, వస్తువులకూ పెట్టుకొనే సంజ్ఞానామంలా... కేవలం ధ్వని సంకేతాలుగా ఉండవు. ఉదాహరణకు‘హిమాలయం’ అంటే ‘మంచుకు నివాస స్థలం’ అని అర్థం. దాన్ని మనం ఒక పర్వత శ్రేణికి స్థిరమైన పేరుగా... 


రూఢి చేసి పెట్టినా... మంచుకు నిలయమైన ఏ ప్రదేశానికైనా, వస్తువుకైనా దాన్ని ఉపయోగించవచ్చు. అలా ఉపయోగించినప్పుడు దాన్ని ‘గౌణార్థం’ అంటారు. ఆర్ష వాఙ్మయంలోని ప్రయోగాలన్నిటినీ నిజానికి గౌణార్థంతోనే చూడాలి. విష్ణువు నల్లని మేఘం లాంటి రంగు కలవాడు అంటే... ‘వర్షించబోయే మేఘంలా సకల ప్రాణులకూ ప్రీతిని, పోషణను ఇచ్చే తత్త్వం’ అని ఒక సూచన. జగత్తు మొత్తం సత్త్వ, రజో, తమో అనే మూడు గుణాల కలయిక. జగత్తులోని సర్వం జ్ఞానం, క్రియ, పదార్థాల (ద్రవ్యం) సమాహారం. విష్ణువు దేహ వర్ణమైన నలుపు నిజానికి ఏ వర్ణమూ కాదు.


అది త్రిగుణాతీతమైన తత్త్వమని తెలిపేందుకే అవర్ణమైన ఆ నల్ల రంగును ప్రతీకగా చెప్పారు. ఇక బంగారు రంగులో ఉండే పీతాంబరం నామరూపాత్మకమైన జగత్తు కల్పించే సమ్మోహనత్వానికి ప్రతీక. గుణాతీతతత్త్వం గుణాలతో కప్పి ఉంటుంది. అలాంటి గుణాతీతతత్త్వాన్ని సగుణమైన వాక్కులను ఉపయోగించి, మనస్సు ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే... ఊహలు, అపోహలూ కూడా కలిగి ‘ప్రమ’ (జ్ఞానం)తో పాటు ‘భ్రమ’ కూడా కలుగుతుంది. కానీ విష్ణుతత్త్వం నాలుగు చేతులతో... నాలుగు విధాలుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ... ఆ విభ్రమ నుంచి రక్షణ కూడా కల్పిస్తుంది. పద్మ హస్తంతో పతనం కానీయకుండా, గదా హస్తంతో ప్రాపంచిక సుఖాలపై ఆసక్తిని చూర్ణం చేస్తూ, శంఖ హస్తంతో సమస్త ఇంద్రియాలకు ఉపశాంతిని ఇస్తూ, సుదర్శనంతో సత్యాన్ని దర్శింపజేస్తూ రక్షిస్తుంది. ఈ నాలుగూ ‘వైఖరి (పలుకు), మధ్యమ (ఆలోచన), పశ్యంతి (భావం), పరా (అవ్యక్తం)’ అనే నాలుగు వాక్‌ స్వరూపాలకు ప్రతీకలు. అంతేకాకుండా, ఈ హస్తాలు సంసారులకు చతుర్విధ పురుషార్ధాలను... అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలను అనుగ్రహించేవి కూడా. జ్ఞానం, కర్మ అనే రెండు పక్షాలను చక్కగా సమన్వయపరిచే వేదమే పక్షిరూపుడైన గరుత్మంతుడు. అది విష్ణువు వాహనం. అంటే వేదమే ఆ సర్వవ్యాపకతత్త్వానికి వాహకం. ఇలా ప్రతి అంశాన్నీ, నామాన్నీ గౌణార్థంతో, ప్రతీకతో సమన్వయం చేసుకుంటే కానీ సరైన అవగాహన కలగదు, ఉపాసన సాగదు. ఏనాడు ఉపాసన ఫలించి... వాక్కుకూ, మనసుకూ కూడా అందని ఆ సర్వ వ్యాపకమైన తత్త్వం చక్కగా అనుభవైకవేద్యం అవుతుందో... ఆనాడు ఆ అనుభవాన్ని పొందిన మానవుడు మొక్కవోని... అంటే కుంఠితం కాని జ్ఞాన స్థితికి చేరుకుంటాడు. కుంఠితం కాని స్థితి కనుక అది వికుంఠము.


దాని సంబంధమైనది వైకుంఠం. ఆ స్థితిలో జ్ఞానపూర్ణమైన అవలోకనం మాత్రమే ఉంటుంది కనుక దాన్ని ‘లోకం’ అనడంలో తప్పు లేదు. అంతేకానీ, అది మరో ప్రపంచం అని అనుకోకూడదు. ఈ విధానం మొత్తం ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మోపాసనే. మాటలకు అందని, మనసుకు గోచరించని పరబ్రహ్మ తత్త్వాన్ని చేరుకోవడానికి సవిస్తరమైన విష్ణుస్వరూపమంతా ఒక ఉపాస్య వస్తువు. 


ఈ ఉపాసనాక్రమంలో భాగంగానే సమస్త ఇతర దేవతా తత్త్వాలను కూడా తెలుసుకోవాలి. తాను ఉపాసించే తత్త్వాన్ని తప్ప... మరే ఇతర విషయాల మీదా మనసు పోనివ్వకుండా, ఏకాగ్రతతో ఉండడమే అనన్య భక్తి. ఆ అనన్య భక్తిని కలిగించడం కోసమే... ఇష్ట దేవతను స్వీకరించి, పరబ్రహ్మ భావనతో ఉపాసన చేయాలని శాస్త్రం బోధిస్తుంది. సమన్వయ లోపం ఉన్నప్పుడు మాత్రమే... వేరు వేరు దేవతలు, వారి మధ్య హెచ్చుతగ్గులు లాంటి భ్రాంతులకు లోనవడం జరుగుతుంది. 


ఇదే విధంగా శైవాది ఇతర మతాల్లో కూడా ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మోపాసనే నిరూపితం అయింది. శివ, శక్తి లాంటి పరబ్రహ్మ స్వరూపాలను, చిహ్నాలను, ఆయా ఉపాసనా మార్గాల్లో అంగాలుగా ప్రతిపాదితమైన దేవతలను కూడా జ్ఞానార్థంతో చక్కగా సమన్వయం చేసుకొని ఉపాసించాలి.  ఆ దేవతల నామాలను, లక్షణాలను, చిహ్నాలను, ఇతర సమస్త అంశాలను గౌణార్థంతో గ్రహించి, ఉపనిషద్వాక్యాలతో సమన్వయం చేసుకోవాలి. అంతేకాని ఈ లక్షణాలను జాతి లక్షణంగానో, వేషంగానో, అలంకారంగానో లేదా మరో ఆయుధ విశేషంగానో చూస్తే... ప్రయోజనం లేకపోగా... ఒక విధమైన సామాజిక ప్రమాదం కూడా. నిజమైన అనన్య భక్తుడు అన్యదేవతలను తక్కువ చెయ్యలేడు... ఆ అన్యదేవత తన దేవత తాలూకు మరొక విభూతే కనుక. అలాగే ఇతరులు తన దైవాన్ని తక్కువ చేసినా చలించడు... తన దైవంకన్నా భిన్నమైనదేదీ అతనికి లేదు కనుక. ఈ అనన్యభక్తి కొరవడినప్పుడు, సక్రమమైన ఉపాసన, అవగాహన, సమన్వయం లేనినాడు మాత్రమే... అపరిపక్వ భక్తుల మధ్య దేవుళ్ళ విషయంలో వైషమ్యాలు ఏర్పడతాయి.


శైవాది ఇతర మతాల్లో కూడా ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మోపాసనే నిరూపితం అయింది. శివ, శక్తి లాంటి పరబ్రహ్మ స్వరూపాలను, చిహ్నాలను, ఆయా ఉపాసనా మార్గాల్లో అంగాలుగా ప్రతిపాదితమైన దేవతలను కూడా జ్ఞానార్థంతో చక్కగా సమన్వయం చేసుకొని ఉపాసించాలి.


అప్పాజీ పంచాంగం

appaji.panchangam@gmail.com

Updated Date - 2022-02-25T05:30:00+05:30 IST