ముఖేష్ అంబానీ ... వారసులపై అందరి దృష్టి

ABN , First Publish Date - 2022-06-30T22:03:34+05:30 IST

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో తన వారసుల పాత్రల విషయమై బిలియనీర్ ముఖేష్ అంబానీ గత సంవత్సరం తన అంతరంగాన్ని సూచనప్రాయంగా వెలిబుచ్చిన విషయం తెలిసిందే.

ముఖేష్ అంబానీ ... వారసులపై అందరి దృష్టి

ముంబై : రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో తన వారసుల పాత్రల విషయమై బిలియనీర్ ముఖేష్ అంబానీ గత సంవత్సరం తన అంతరంగాన్ని సూచనప్రాయంగా వెలిబుచ్చిన విషయం తెలిసిందే. అంబానీ గ్రూపు విలువ దాదాపుగా $200 బిలియన్ల పైనే ఉంటుంది. దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారులలో ఒకరైన భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ...  ఎనర్జీ-టు-రిటైల్ సమ్మేళనం ‘రిలయన్స్‌’లో... టెలికాం యూనిట్ ఛైర్మన్‌గా తన కుమారునికి బాధ్యతలు అప్పగించడం ద్వారా కొంతకాలంగా వ్యాపారవర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నాయకత్వ మార్పిడి ప్రక్రియను ప్రారంభించారు. అంబానీ వారసుల వివరాలివీ... 


ఆకాష్ అంబానీ(30)... అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ 2014లో బ్రౌన్ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే గ్రూప్ టెలికాం యూనిట్ రిలయన్స్ జియోలో లీడర్‌షిప్ టీమ్‌లో చేరాడు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన... 400 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో జియో ఇండియాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు టెలికాం యూనిట్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని రిలయన్స్ రెండు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక... ఐపీఎల్‌లో రిలయన్స్ యాజమాన్యంలోని ‘ముంబై ఇండియన్స్’  నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడేళ్ళ క్రితం... అంటే 2019 లో...  వజ్రాల వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరిగింది. 


ఇషా అంబానీ(30)... ఆకాష్‌కు ఈమో కవల సోదరి. ఇప్పటికే కంపెనీ రిటైల్, ఇ-కామర్స్, లగ్జరీ ప్లాన్‌లను నడిపించే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కంపెనీ యొక్క అజియో ఇ-కామర్స్ యాప్‌తో పాటు అగ్ర అంతర్జాతీయ బ్రాండ్‌లతో రిలయన్స్ భాగస్వామ్యాల ద్వారా ఫ్యాషన్‌లో రిలయన్స్ ఉనికిని విస్తరించడంలో ఆమె తనదైన పాత్రను పోషించారు. ఇషా స్టాన్‌ఫోర్డ్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చదివారు. కాగా... రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాల్లో ఉన్న బిలియనీర్ పారిశ్రామికవేత్త కుమారుడు ఆనంద్ పిరమల్‌ను 2018లో, ఇషా వివాహం చేసుకున్నారు. 


అనంత్ అంబానీ(27)... ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు. ఇంధన వ్యాపారాన్ని చూస్తున్నాడు. గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంపొందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం నేపథ్యంలో... రిలయన్స్‌ను  అగ్రగామిగా నిలిపేందుకు జరుగుతున్న కృషిలో అనంత్ తనదైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక... సౌర/గ్రీన్ హైడ్రోజన్‌ సహా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలోకి విస్తరించేందుకు ప్రధాన విస్తరణ ప్రణాళికలను రూపొందిస్తోన్న క్రమంలో... అనంత్ కూడా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సోదరుడు అనంత్‌,  సోదరి ఇషాలతో కలిసి కంపెనీ ఈవెంట్లలో పలుమార్లు  ప్రసంగించారు. ఈయన 2017లో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 

Updated Date - 2022-06-30T22:03:34+05:30 IST