లెక్కలో కనికట్టు!

ABN , First Publish Date - 2020-02-23T09:14:25+05:30 IST

పేదలకు ఇంటిస్థ లం ఇవ్వాలన్న ఆశయం గొప్పదే. ఏమాత్రం ఆధారం లేని, సెంటు భూమి కూడా లేని వారిని గుర్తించి మేలు చేస్తే అం తా హర్షిస్తారు. అలా కాకుండా, వివిధ పథకాలు, స్కీముల కింద లబ్ధిపొందే ...

లెక్కలో కనికట్టు!

  • ఇదీ 25 లక్షలమంది ‘పేదల’ గుట్టు
  • వీరిలో 16 లక్షలమందికి ముందే లబ్ధి
  • 9 లక్షలమందికి ఇప్పటికే ఇంటిస్థలం
  • 2.74లక్షలమందికి టిడ్కో నివాసాలు
  • 8 లక్షల మందే నికరంగా అర్హులు?


అమరావతి,  ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పేదలకు ఇంటిస్థ లం ఇవ్వాలన్న ఆశయం గొప్పదే. ఏమాత్రం ఆధారం లేని, సెంటు భూమి కూడా లేని వారిని గుర్తించి మేలు చేస్తే అం తా హర్షిస్తారు. అలా కాకుండా, వివిధ పథకాలు, స్కీముల కింద లబ్ధిపొందే వారిని, సొంతంగా భూములు ఉన్న వారిని కూడా కొత్తగా మేలుచేసే జాబితాలోకి తీసుకొస్తే అది కొత్తరకం సందేహాలకు తావిస్తుంది. ప్రభుత్వ విశ్వసనీయతను సందేహంలో పడేస్తుంది. రెవెన్యూశాఖ ఇంటి స్థలాలపై గత ఆగస్టు నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లోని గణాంకాలు సందేహాలకు దారితీసేలా ఉన్నాయి.


లబ్ధిదారులు 25 లక్షల మంది ఉన్నారని గొప్పగా చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త లెక్కల సూత్రం అమలు చేస్తున్నారా అనే అ నుమానాలను బలపరిచేలా ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 14న ఇంటిస్థలాలపై సీఎం జగన్‌ వద్ద సమీక్ష జరిగింది. రెవెన్యూశాఖ ఓ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం లబ్ధిదారుల జాబితా 25 లక్షలు దాటనుందని అంచనా! భారీగా కొత్త దరఖాస్తులు వస్తున్నాయని. లబ్ధిదారులు పెరగొచ్చని నివేదించింది. దీని ప్రకారమే ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. 


ఇదీ కనికట్టు!

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిస్థలం, పట్టణప్రాంతాల్లో టిడ్కో కింద ప్లాట్‌ లేక గ్రూప్‌ హౌసింగ్‌ ఇవ్వాలనుకున్న లబ్ధిదారుల సంఖ్య 25 లక్షలపైనే ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఈ లెక్కలో ఓ కనికట్టు కనిపిస్తోంది. గృహనిర్మాణ శాఖ నివేదిక ప్రకారం, అప్పటికే సొంతంగా ఇంటిస్థలాలు కలిగి ఉన్న 9 లక్షల మందిని ఈ జాబితాలో చేర్చారు. పారిశ్రామిక కార్మికుల కు ఏపీఐఐసీ ఇళ్లు నిర్మించి ఇస్తుంది. ఈ కేటగిరీలో 2 లక్షల మందిని జాబితాలో ప్రతిపాదించారు. ఇలా మొత్తం 11 లక్షల మందిని ఈ పథకం కవరేజీ కింద చూపించారు. అప్పటికి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు కూడా వెలువడలేదు. తొలిదశలో ఇంటిస్థలాలు, ప్లాట్‌లు చూపించి, ఆ తర్వాత దశలో ని ధుల లభ్యతను బట్టి దశలవారీగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలన్నది సర్కారు వ్యూహం.


అయితే, రెవెన్యూశాఖ తొలిదశలోనే సొంత ఇంటిస్థలాలు ఉన్నవారిని కూడా ఈ జాబితాలోకి తీసుకురావడం సర్కారుకు కలిసి వచ్చింది. ఆ మేరకు పేదలకు అవకాశం లేకుండా పోయింది. ఇక  టార్గెట్‌లో మిగిలింది 14 లక్షలు. అయితే, అసలు విషయం తెలియని పేదలు భారీగా ఇంటిస్థలాలు కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని రెవెన్యూశాఖ అనేక నివేదికలతో సరిపోల్చి నాలుగు దశల్లో వడపోసింది.


నికరం 8 లక్షలే..

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న పేదలకు క్రమబద్ధీకరణను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. పేదలకు 100 గజాలలోపు క్రమబద్ధీకరిస్తామన్నారు. ఈ కేటగిరీలో ఇప్పటిదాకా 3.65 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. 2.62 లక్ష ల దరఖాస్తులను అర్హత కలిగినవిగా గుర్తించినట్లు సమాచా రం. ఇప్పుడు వీటిని ఈ జాబితాలో కలుపొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని రెవెన్యూ అధికారుల ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, తాము కాంపిటెంట్‌ కాదం టూ మాట్లాడేందుకు నిరాకరించారు. ఇదిలా ఉండగా, పట్టణప్రాంతాల్లో టిడ్కో కింద ఇళ్లు, ప్లాట్‌లు 2,74, 482 మందికి ఇవ్వబోతున్నామని ఓ లెక్క చెబుతున్నారు. దీన్ని కూడా ఇంటిస్థలాల పద్దులోనే కలిపేశారు.


నిజానికి జగన్‌ సర్కారు కొలు వు తీరకముందే టిడ్కో కింద పేదలకు ఇళ్లు, ప్లాట్లు కట్టి ఇస్తున్నారు. గతంలో లబ్ధిదారులుగా ఎంపికయినవారినీ ఈ జాబితాలోకి తీసుకొచ్చారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించేందుకు కూడా రెవెన్యూ అధికారులు నిరాకరించారు. వీటితో కలిపితే ముందుగా సిద్ధమయిన లబ్ధిదారుల సంఖ్య 16,36,482కు చేరుకుంటుంది. వీరందరినీ పక్కనపెడితే నికరంగా తేలేది ఈ గణాంకాల ప్రకారం 8,63,518. అయితే, దీనిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూశాఖ తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు 21,34,429 మందిని ఈ స్కీమ్‌ కింద కవరయ్యే లబ్ధిదారులుగా చూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 10,71,635, పట్టణప్రాంతాల్లో టిడ్కో, గ్రూప్‌ హౌ జింగ్‌ కింద కలిపి 10,62,794 మందిని లబ్ధిదారులుగా గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగానే, ‘స్పం దన’ కింద ఇళ్లు కోరుతూ లక్షలాది దరఖాస్తులు వస్త్తున్నాయి. 


ఉంటేనే ‘పక్కా’.. సర్కారీ గృహాలకు స్థలాలతో మెలిక

ఊరికి దూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పే దలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్న ప్రభు త్వం, పక్కా ఇళ్లను కూడా అక్కడే మంజూరు చేయనుం ది. స్థలం తీసుకుని తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అంటే కుదరదని, ఇంటి రాయితీ కావాలంటే కచ్చితంగా ఎక్కడ స్థలం ఇస్తే అక్కడే కట్టుకోవాలని షరతు విధించనుంది. కొత్తగా ఇచ్చే స్థలాల్లో రోడ్లు, విద్యుత్‌, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నా లేకున్నా అక్కడ కట్టుకుంటేనే రాయితీ వస్తుందని అధికారవర్గాలు అంటున్నాయి.  రానున్న నాలుగేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని గృహనిర్మాణశాఖ ద్వారా రాష్ట్ర ప్రభు త్వం ప్రణాళికలను రూపొందిస్తోంది.


తొలి ప్రాధాన్యత ఉగాది నుంచి ఇచ్చే స్థలాలు తీసుకొనే పేదలకే ఇవ్వనున్నారు. ఏడాదికి సుమారు 6 లక్షల మంది స్థలం పొంది న పేదలకు ఇళ్లు మంజూరుచేస్తారు. ఒక్కో ఇంటికి రూ. లక్షన్నర రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే పేదలకు ఇస్తున్న స్థలాలు గ్రామాలకు దూరంగా ఉన్నా యి. ఇప్పుడు స్థలాలు ఇచ్చినా మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం చాలా సమయం పడుతుంది. గృహనిర్మాణ శాఖ మాత్రం రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఇళ్లు అక్కడే మంజూరుచేయాలని కసరత్తు ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం పక్కా ఇళ్ల కార్యక్రమం అమలుచేయలేదు. రెండో సంవత్సరం నుంచి మంజూరు, నిర్మాణాలు ప్రారంభిస్తామని తొలి బడ్జెట్‌లో స్పష్టంచేసింది. దీంతో ఇప్పటికే ఏడాది వృథా అయిందన్న వాదన మొదలైంది. అందువల్ల కచ్చితంగా వచ్చే ఏడాది నుంచైనా ఇళ్లు మంజూరుచేయక తప్పని పరిస్థితి. మౌలిక సదుపాయాలతో తమ కు సంబంధం లేదని, ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట మంజూరుచేసి అక్కడ కట్టుకుంటే రాయితీలు ఇ వ్వడమే తమ బాధ్యత అని హౌసింగ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాలు చూస్తే ఇళ్ల నిర్మాణ పథకాలు ముందుకు సాగడం అంత సులువు కాదని గృహనిర్మాణశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 


ఇలా తేల్చారా...!

సొంత స్థలాలున్నవారు - తొమ్మిది లక్షలు 

ఏపీఐఐసీ ఇళ్లు కట్టించే కార్మికులు - రెండు లక్షలు

క్రమబద్ధీకరణకు అర్హత - 2.62 లక్షలమంది?

పట్టణాల్లో టిడ్కో కింద ఇళ్లు, ప్లాట్లు - 2,74,482 మంది

Updated Date - 2020-02-23T09:14:25+05:30 IST