‘మద్యం’ దరఖాస్తులు 67,849

ABN , First Publish Date - 2021-11-20T08:16:08+05:30 IST

హైదరాబాద్‌, ఖమ్మం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం దుకాణాలకు మొత్తం 67,849 దరఖాస్తు లు వచ్చాయి. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు దరఖాస్తులకు అవకాశమివ్వగా..

‘మద్యం’ దరఖాస్తులు 67,849

సర్కారు ఆదాయం రూ.1,357 కోట్ల 

హైదరాబాద్‌, ఖమ్మం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం దుకాణాలకు మొత్తం 67,849 దరఖాస్తు లు వచ్చాయి. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు దరఖాస్తులకు అవకాశమివ్వగా.. గడువులోగా దాఖలైన దరఖాస్తుల రూపేణా ప్రభుత్వానికి రూ.1,357 కోట్ల ఆ దాయం వచ్చింది. 2015-17లో 35 వేల దరఖాస్తులు దాఖలుకాగా.. రూ.498 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలున్నాయి. సగటున ఒక్కో దుకాణానికి 26 మంది చొప్పున పోటీ పడుతున్నారు. 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో శనివారం లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం దుకాణాలపై విచారణ చేసిన తర్వాత లాటరీ తీయాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.


సరిహద్దు షాపులకు డిమాండ్‌

ఊహించిన విధంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏపీలోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు సరిహద్దు షాపుల కోసం భారీగా దరఖాస్తులు చేయడంతో గతంలోకంటే ఈసారి ఎక్సైజ్‌ శాఖ భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం జిల్లా 6,212 దరఖాస్తులతో ఒకటో స్థానంలో, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా(3,718 దరఖాస్తులు) రెండోస్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాకు సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెం దుకాణానికి 121, ఎర్రుపాలేనికి 100, ముదిగొండ మండలంలోని వల్లభికి 108 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, నేలకొండపల్లి, మధిర, వైరా, సరిహద్దుల్లోనూ అధికసంఖ్యలో దరఖాస్తులు అందాయి. పశ్చిమగోదావరి సరిహద్దున ఉన్న అశ్వారావుపేట ఎక్సైజ్‌ సర్కిల్‌లో 762 దరఖాస్తులు రాగా.. ఇక్కడ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులదే హవా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-11-20T08:16:08+05:30 IST