Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

‘అలయ్ బలయ్’ సమాజంలో అగ్గి వద్దు!

twitter-iconwatsapp-iconfb-icon
అలయ్ బలయ్ సమాజంలో అగ్గి వద్దు!

ఇంగ్లీషులో గూఢచర్యం కథలూ నవలలూ చదివేవారికీ, స్పై సినిమాలు చూసేవారికీ బాగా తెలిసినమాటే -‘ప్లాజిబుల్ డినయబులిటీ’. అంటే నిరాకరణ సంభావ్యత. పక్కదేశంలోకి ఒక గూఢచారిని ప్రత్యేకమైన పనిమీద పంపినప్పుడు, ఒకవేళ అతను పట్టుబడిపోయినా, చనిపోయినా, అతని స్వదేశం అతన్ని పట్టించుకోదు, అతనెవరో మాకు తెలియదన్నట్టుగా మూతిబిగించుకుని కూర్చుంటుంది. రాజకీయ పార్టీలకు కూడా కొన్ని అవసరాలుంటాయి. బాహాటంగా చేయడానికి అదేమంత గౌరవప్రదమైన పని కానప్పుడు, అయినా రాజకీయంగా అవసరం అయినప్పుడు, ఏమంత పెద్ద స్థాయి లేని దూకుడు మనిషికి ఆ పని అప్పజెబుతారు. పని జరిగిపోయాక, గగ్గోలు మొదలవుతుంది కదా, అప్పుడు అతను మా మనిషి కాదనో, మా మనిషే కానీ మా క్రమశిక్షణ ఉల్లంఘించాడనో, అతను మాకు అక్కరలేదు సస్పెండ్ చేస్తున్నాము అనో ఆ పార్టీ చెబుతుంది. ఇట్లా పనులు జరిపించుకుని, ఆ తరువాత వదిలించుకోవడానికి వీలుగా కొందరిని పార్టీలు తమ శ్రేణుల్లో నియమించుకుంటాయి. అవసరాలు ఏర్పడినప్పుడల్లా, ఈ శ్రేణులు నోరుజారడమో, చేయి చేసుకోవడమో చేసేస్తాయి, తరువాత క్రమశిక్షణ చర్యలను స్వీకరిస్తాయి.


ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే కూడా ఈ శ్రేణులే. ఈ మాట ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది. ఆ మాటకు అర్థం, ఒక సంస్థలో కానీ, వ్యవస్థలో కానీ చిన్నా చితకా అలగా జనం అన్న మాట. బ్యాక్ బెంచర్స్. అంటే ఆ సంస్థలో, వ్యవస్థలో వారికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. కాని, ముఖ్యమైన, నాయకత్వ స్థానంలో ఉన్నవారి కంటె తీవ్రమైన భావాలను వ్యక్తం చేస్తుంటారు. నూపుర్ శర్మ వివాదం సందర్భంగా ఆమెను కూడా ఫ్రింజ్ ఎలిమెంట్ అనే వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల నుంచి నిరసనలు వచ్చేసరికి, జాతీయ అధికార పార్టీ అధికార ప్రతినిధి కాస్తా, అప్రధాన వ్యక్తి అయిపోయింది, మా అధికార వైఖరికి ఆమె మాటలకి సంబంధమే లేదని, ఆమె ఒక అల్లాటప్పా కార్యకర్త మాత్రమేనని చేతులు దులుపుకున్నారు. 


రాజాసింగ్ చేసిన పని ఆయన పనిచేస్తున్న పార్టీకి అధికారికంగా నచ్చలేదు. అందుకని సస్పెండ్ చేసింది. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరించినందుకు ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని శాసించింది. కానీ, ఆయన సస్పెండ్ అయ్యేదాకా కూడా ఏదో సాదాసీదా కార్యకర్త కాదు, ఫ్రింజ్ ఎలిమెంట్ అసలు కాదు. భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాసనసభా పక్ష నాయకుడు! రాజాసింగ్‌కు గట్టి విశ్వాసాలు ఉన్నాయి. పార్టీ కంటె ధర్మం గొప్పది అని ఆయన నమ్మకం. రాజ్యాంగం కంటె మనుస్మృతి గొప్పది అని, గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడు వంటి నమ్మకాలు కలిగిన బిజెపి ఫ్రింజ్ ఎలిమెంట్స్ గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరు ఇటువంటి విభిన్నమైన ప్రకటనలతో సంచలనం సృష్టిస్తుంటారు. రాజాసింగ్ తాను చేయదలచుకున్నదాని గురించి బాహాటంగా చెబుతూనే ఉంటారు. మునావర్ ఫరూఖీ కార్యక్రమం కోసం వేదికను ఇస్తే దాన్ని తగలబెడతానని, ఆ స్టాండప్ కమెడియన్‌ను కొడతానని ఆయన మీడియా ఎదుటే చెప్పాడు. ఆయన దృష్టిలో ఆయన అనుకున్న ధర్మమే అన్నిటికంటె ముఖ్యమైనది కాబట్టి, చట్టం గురించి ఆయనకు పెద్దగా ఖాతరు ఉండదు. ప్రతీకారంగానే వివాదాస్పద వీడియో చేశానని,  తాను హెచ్చరించినా వినకపోవడం పోలీసులది, ప్రభుత్వానిది తప్పు అని ఆయన కుండబద్దలు కొట్టారు. తన ధర్మం, తన మనోభావాలు ఈ రెంటికి సంబంధించి మరే అధికారవ్యవస్థను, రాజ్యాంగాన్ని, ప్రజల శాంతియుత జీవనాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోరు. అర్ధరాత్రి పూట విడుదలయ్యే ఒక వీడియో ఎంతటి విపరిణామాలకు దారితీయవచ్చునో అన్న ఇంగితం కానీ, ప్రజల ప్రాణాల పట్ల బాధ్యతగా ఉండాలన్న స్పృహ కానీ ఆయన ప్రాధాన్యాలలో ఉండదు.


రాజాసింగ్ ప్రతిజ్ఞలు మీడియాలో కలకలం సృష్టిస్తున్నప్పుడు, ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌనంగా ఉన్నారు. కల్వకుంట్ల కవితకు సంబంధించిన వివాదం, నిరసనలు, ఘర్షణల గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. రాజాసింగ్‌ను అరెస్టు చేసినందుకు దీక్షకు దిగుతున్నారేమో అని అనుకునే సందర్భంలో, ఆయన బిజెపి కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అంటే, ఒకేసారి తెలంగాణలో రెండు రాజకీయ రణవేదికలను బిజెపి నిర్వహించింది. తరువాత, దానిలో ఒకదానినుంచి అధికారికంగా ఎడం జరిగింది. మహమ్మద్ ప్రవక్తను గురించి నేరుగా కానీ, పరోక్షంగా కానీ చేసే వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందనలు వచ్చిన అనుభవం ఉన్నది కాబట్టి, రాజాసింగ్‌ను బిజెపి సస్పెండ్ చేసిందా? నిజంగా, రాజాసింగ్ కల్పిస్తున్న పరిస్థితి గురించి బిజెపికి ముందే తెలియదా? రాజాసింగ్ చర్యలకు మైనారిటీ మతస్థుల నుంచి వస్తున్న నిరసన, ఆయనను అరెస్టు చేయాలని వివిధ పార్టీలు చేస్తున్న డిమాండ్, వీటి వల్ల తెలంగాణ సమాజంలో విభజన, సమీకరణ పెరిగి రాజకీయంగా తమకు లాభిస్తుందన్న ఆలోచన ఆ పార్టీకి లేదా? ఇవాళ కాకపోతే, మరి నాలుగు రోజుల తరువాత, ఇదే రాజాసింగ్‌కు పునఃప్రవేశం లభించి, మరో సస్పెన్షన్ దాకా ‘ధర్మాన్ని’ పరిరక్షించే మాటలు మాట్లాడుతూ ఉండడం కాబోయే వాస్తవంకాదా?


అన్ని రాజకీయ పార్టీలలాగే, భారతీయ జనతాపార్టీ కూడా తెలంగాణలో రాజకీయ అధికారం కోసం ప్రయత్నించవచ్చు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రయత్నించిన పార్టీగా బిజెపికి ఆ నైతిక హక్కు, అవకాశం టిఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఉన్నట్టే ఉంటాయి. కానీ, జనజీవనాన్ని భయభ్రాంతులను చేసే రాజకీయ చర్యలతో బలం పెంచుకోవాలని ప్రయత్నించడం మాత్రం తెలంగాణ సమాజం హర్షించదు. ఇది ఉత్తరప్రదేశో, గుజరాతో కాదు. కనీసం కర్ణాటక కూడా కాదు. తక్కిన విషయాలు ఎట్లా ఉన్నా, రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణ సమాజం మతసామరస్యంతో మెలగుతున్నది. హిందువులు, ముస్లిములే కాదు, రకరకాల భాషా సమాజాలు, చిన్నచిన్న మత సమూహాలు తెలంగాణలో ఒదిగి జీవిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన రాష్ట్రంగా పేరుతెచ్చుకున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రజల మధ్య ఐక్యతను, సమన్వయాన్ని పెంచింది. ఈ సుగుణాలను నిలుపుకుంటూ ముందుకు పోవాలి. రాజకీయంగా పాలనాపరంగా ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవినీతిని, దుష్పరిపాలనను, అప్రజాస్వామికతను అంశాలుగా తీసుకుని ప్రజల దగ్గరకు వెళ్లవచ్చు కదా! ఎందుకు సమాజంలో విభజనలను పెంచే వ్యూహాలు పన్నడం?


మళ్లీ మళ్లీ అదే మాట అంటున్నారు కెసిఆర్! ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు మాట్లాడాలట! దేశాన్ని ఉన్మాదం వైపు నెట్టేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తులపై గొంతెత్తాలట! మాట్లాడినవాళ్లు దేశంలో ఎటువంటి దుర్మార్గాన్ని ఎదుర్కొంటున్నారో తెలియనిది కాదు. తెలంగాణలో మారుమాటకు అవకాశం లేకుండా చేసి, స్వరాష్ట్రంలో స్వపాలన అనుభవానికి రాకుండా చేసిన ఆధిపత్యధోరణి కెసిఆర్‌ది. ఫిరాయింపులతో ప్రతిపక్షాన్ని నంజుకుతిని, ఇప్పుడు ఎవరో సహాయానికి రావాలని కోరడంలో ఏమి సబబున్నది? టిఆర్ఎస్ అడిగీ అడకముందే ఆత్రుతతో మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులు, కనీసం రాష్ట్రంలో ప్రజాస్వామిక కార్యకలాపాలను స్వేచ్ఛగా అనుమతించాలని షరతు పెట్టినా బాగుండేది! తెలంగాణలో గట్టిగా అడిగేవారికి కఠిన నిర్బంధాలు ఎదురవ్వడంతో, అడగవలసిన, అడగగలిగిన అనేకులు కూడా నోర్లు పడిపోయినట్టు మారిపోయారు. ఉద్యమ సహచరులను అవమానపరచి వెళ్లగొట్టకపోతే, ప్రభుత్వ సహచరులను విశ్వసించక నామమాత్రం చేయకపోతే, అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఇచ్చే వ్యవహారాలు లేకపోతే, అందరినీ ఎల్లకాలం అణచిపెట్టగలమని, అవసరమైనప్పుడు ఎవరినైనా కొనుగోలు చేయగలమని అహంకరించకపోతే, కెసిఆర్‌కు, ఆయన పార్టీకి ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు. విషాదం ఏమిటంటే, ఈ వ్యవహారసరళి ప్రభుత్వానికి, అధికార పార్టీకి మాత్రమే కాదు, యావత్ సమాజానికే విపత్తు తెచ్చింది.


తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత అయితే ఇప్పుడు పౌరసమాజం మీద ఉన్నది. మతప్రసక్తి లేని రాజకీయాలను మాత్రమే నడపండి, ప్రజల వాస్తవ సమస్యల ఆధారంగా ప్రచారాలు చేయండి, విభజన రాజకీయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయకండి అని ఒక సామూహిక విజ్ఞప్తిని తెలంగాణ ఉద్యమ సమాజం అన్ని మతవాద పార్టీలకు చేయాలి. మనోభావాల రాజకీయాలతో ప్రజాజీవితాన్ని బలిపెట్టవద్దని గట్టిగా చెప్పాలి. తమ ఉనికి కేవలం మతమే కాదని, దడి కట్టుకుని మెలగకుండా, సామాజికార్థిక జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి తక్కిన సమాజంతో పాటు, సకల రంగాలలో క్రియాశీలంగా మెలగాలని మైనారిటీలకు విజ్ఞప్తి చేయాలి, వారికి సెక్యులర్ స్థలాలలో ప్రాతినిధ్యం పెంచాలి. అట్లా కాక, పరిస్థితి ఇదే తీరుగా కొనసాగితే, ఎవరూ సభలు పెట్టుకోలేరు, ఎవరూ కాసేపు హాస్యాన్ని ఆస్వాదించలేరు. ఎవరన్నా చనిపోయినప్పుడు కనీసం భగవద్గీతను కూడా వినలేరు. ఏం మాట్లాడాలో, ఏం వినాలో, ఏం తినాలో, ఏం ధరించాలో ఆదేశించే ఫ్రింజ్ ఎలిమెంట్లు పెట్రేగిపోతాయి. పుస్తకాలు రాస్తే ఫత్వాలు జారీ అవుతాయి. నిర్భీత ప్రజాస్వామ్యం మీద హంతకదాడులు జరుగుతాయి. వందలేళ్లుగా అంతులేని వేదనను, పీడనను అనుభవించిన తెలంగాణ, తన పోరాటాల ద్వారా కొన్ని భౌతిక విజయాలను, కొన్ని ప్రజాస్వామిక విలువలను కూడా సంపాదించుకున్నది. ఒక వ్యక్తి, ఒక చిన్న గుంపు, సమాజాన్ని అంతటినీ కల్లోలపరిచే చర్యలతో ప్రజాజీవితాన్ని తిరోగమింపజేయడమే కాదు, సంక్షుభిత పరచగలరు. ఆ సంక్షోభంలో ఆర్తనాదాలే తప్ప నినాదాలు ఉండవు. రాజకీయ నిర్బంధానికి తోడు సాంఘిక దాష్టీకం మనుగడను దుర్భరం చేస్తుంది.

అలయ్ బలయ్ సమాజంలో అగ్గి వద్దు!

కె. శ్రీనివాస్

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.