Abn logo
Apr 24 2021 @ 01:33AM

సమాజం కోసం అక్షరయాన్‌

అక్షరం నిలబెట్టిన ఆత్మవిశ్వాసం ఆమె. ఆకాశవాణిలో మెరిసి... ‘అక్షరయాన్‌’తో ఎగసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత్రిగా... అనువాదకురాలిగా... ఫిలిమ్‌ మేకర్‌గా... భిన్న పాత్రల్లో ఒదిగి... సామాజిక చైతన్యం రగిలిస్తున్న ఘనత ఆలిండియా రేడియో  అనౌన్సర్‌ అయినంపూడి శ్రీలక్ష్మిది. కరోనాపై కవితలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపిన ఆమె ప్రస్థానం ‘నవ్య’కు ప్రత్యేకం... 


ముప్ఫై ఏళ్లుగా నేను ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేస్తున్నా. మాది నిజామాబాద్‌ జిల్లా బోధన్‌. 1940ల్లోనే మా పెద్దలు ఆంధ్రా నుంచి ఇక్కడికి వలస వచ్చేశారు. మా పెద్ద తాతగారు ఎం.శ్రీనివాసరావు భాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. నాన్న శ్యాంసుందర్‌రావు హెడ్‌మాస్టర్‌గా చేసేవారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు కూడా. ఉన్నత విలువలతో కూడిన కుటుంబం నుంచి వచ్చినదాన్ని కావడంతో... సహజంగానే సమాజం పట్ల బాధ్యతగా మెలగడం అలవాటైంది. నా వృత్తి జీవితం మొదలైంది కూడా నిజామాబాద్‌ ఆలిండియా రేడియోలో! ఆ తరువాత హైదరబాద్‌కు వచ్చాను. అయితే నా వ్యక్తిగత జీవితం వేరు... వృత్తిగత జీవితం వేరు... సామాజిక జీవితం వేరు. 


‘కవి సిపాయిలు...’ 

గత ఏడాది కొవిడ్‌ కలకలం మొదలైనప్పుడు ‘రిటర్న్‌ గిఫ్ట్‌ టు కరోనా’ కవిత రాశాను. ‘అమెరికా తదితర దేశాల నుంచి విమానంలో కరోనా దిగుమతి అవుతోంది. నమస్తే మంత్రంతో దాన్ని మనం దిగుమతి చేసుకో కుండా రిటర్న్‌ గిఫ్ట్‌గా పంపేద్దాం’ అంటూ రాసిన కవిత అది. జాగ్రత్తగా ఉంటూ, కలిసికట్టుగా పోరాడి ఆ మహమ్మారిపై విజయం సాధిద్దామనే సందేశం దాని ద్వారా ఇచ్చాను. ‘అందరికీ మీరు దిశానిర్దేశం చేశారు. కవి సిపాయిలు మీరు. ముందుండి దేశాన్ని నడిపించాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాడు అభినందించారు.


సామాజిక హితం... 

అలాగని మేము రచనలతో ఇళ్లకే పరిమితం కాలేదు. మాకు ‘అక్షరయాన్‌’ అనే 700 మంది మహిళా రచయితలున్న ఫోరమ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాల్లోని తెలుగు రచయిత్రులు ఇందులో సభ్యులు. కరోనా వల్ల వారిలో నలుగురి భర్తలు చనిపోయారు. మరో ముగ్గురు వెంటిలేటర్స్‌పై ఉన్నారు. అలాంటి వాళ్లందరికీ మేమున్నామని ధైర్యం చెబుతున్నాం. వారి ఇళ్లకు దగ్గరలో ఉన్న మా ఫోరమ్‌ సభ్యుల ద్వారా భోజనం, ఇతర ఏర్పాట్లు చూస్తున్నాం. అలాగే మేముండే అపార్ట్‌మెంట్‌లో  కరోనా వచ్చిన వారి క్వారంటైన్‌ కోసం ఒక ఫ్లాట్‌ కేటాయించాం. అందులో ఉన్నవారికి తలా ఒక విధంగా సాయం చేస్తున్నాం. వ్యాక్సిన్‌ వచ్చి, కేసులు తగ్గాక అందరిలో నిర్లక్ష్యం పెరిగింది. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. ముఖ్యంగా మన దేశంలో నిరక్షరాస్యులు అధికం. ఆరోగ్యంపై అవగాహన అస్సలు లేదు. ఏదిఏమైనా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ... స్ఫూర్తి నింపే మాటలు ప్రజల చెవిన వేయడం కవులుగా మా బాధ్యత. 


పొయెటిక్‌ థెరపీ... 

సాహిత్యంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే తపనతో రెండు ప్రయోగాలు చేశాను. ఒకటి పొయెటిక్‌ థెరపీ... ‘వూండెడ్‌ హార్ట్‌’. రెండోది డాక్యూ పోయం... ‘లైఫ్‌ ఎట్‌ చార్మినార్‌’. పొయెటిక్‌ థెరపీ... వూండెడ్‌ హార్ట్‌ కేన్సర్‌ పేషెంట్లపై రాశాను. మా కుటుంబంలోనే కేన్సర్‌ వల్ల ఏడుగురు చనిపోయారు. మా అమ్మ ఒక్కతే బ్రెస్ట్‌ కేన్సర్‌తో బతికింది. ఇంటికి పెద్ద కోడలిగా ఆరేళ్లు ఆస్పత్రికీ... శ్మశానానికీ తిరిగాను. నాకు అప్పుడు అర్థమైంది... రోగులకు ఎప్పుడూ మందులే కాదు, సాంత్వన కావాలని! దాని కోసమే ‘వూండెడ్‌ హార్ట్‌’ రాశాను. ఈ పుస్తకాలను కేన్సర్‌ ఆస్పత్రికి వెళ్లి చాలామంది రోగులకు పంచి పెట్టాను. వారికి ఒక భరోసా ఇవ్వాలనేది నా ప్రయత్నం. అనుకున్నట్టుగానే ఎంతోమందికి అది మానసిక ధైర్యాన్నిచ్చింది. 


అలాగే చార్మినార్‌ అందాలను కాకుండా దాని చుట్టూ ఉన్న జీవనచిత్రాన్ని ఒక డాక్యుమెంటరీగా తీశాం. అదే ‘లైఫ్‌ ఎట్‌ చార్మినార్‌’. 24 గంటల పాటు చార్మినార్‌ పరిసరాలను చిత్రించి, దాన్ని 28 నిమిషాలకు కుదించాం. ఆ విజువల్స్‌ చూసి కవిత రాశాను. ప్రపంచంలో ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగం చేయలేదు. దానికి ప్రతిష్ఠాత్మక ‘పాలపిట్ట’ అవార్డు దక్కిం ది. ఇప్పటి వరకు నేను 11 పుస్తకాలు రాశాను. 


కుటుంబమే స్ఫూర్తి...

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా కుటుంబ నేపథ్యం. మాది పేద కుటుంబం. ఇల్లు గడవడానికి చేతిలో డబ్బు లేకపోతే గేదెల్ని పెట్టుకున్నాం. నేను కూడా వెళ్లి పాలు పోసేదాన్ని. పిడకలు చేసేదాన్ని. ఆ చేతులే ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాయంటే ఎంతో గర్వంగా ఉంటుంది. నానమ్మ, నాన్నల నుంచి నిజాయతీ, కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నాను. ఇక మా నాన్న హెడ్‌మాస్టర్‌ కావడంతో ఆయన స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు పాటలు రాసేవారు. అలా ఆయన్ను చూసి నాకూ సాహిత్యంపై మక్కువ పెరిగింది.


నాకు పదహారో ఏటనే ‘నున్న’ వారి యువ సాహిత్య పురస్కారం లభించింది. అదే సంవత్సరం వరకట్నంపై రాసిన కథకు రాష్ట్ర స్థాయి పురస్కారం దక్కింది. ఇవికాకుండా ‘వెన్నెల దుఃఖం’ అనే రచనకు ‘రంజని కుందుర్తి’ జాతీయ పురస్కారం అందుకున్నాను. ఆ పుస్తకం చాలా భాషల్లో అనువాదం కూడా అయింది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘విశిష్ట రాష్ట్ర పురస్కారం’ వరించింది. దీంతోపాటు మూడు అనువాదాలు చేశాను. రస్కిన్‌ బాండ్‌ కథలు మనవళ్ల కోసం తెలుగులో రాశాను. దాన్ని ఏషియన్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ప్రచురించారు. ఇటీవల రాసిన ‘ఇట్లు కరోనా’ పుస్తకానికి ఎంతో ఆదరణ లభించింది.