ఆజన్మం ప్రజాహక్కుల కోసం

ABN , First Publish Date - 2021-10-12T06:39:54+05:30 IST

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపిడిఆర్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్‌ పెద్దింటి సూర్యనారాయణ సెప్టెంబరు 29న మరణించారు....

ఆజన్మం ప్రజాహక్కుల కోసం

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపిడిఆర్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్‌ పెద్దింటి సూర్యనారాయణ సెప్టెంబరు 29న మరణించారు. ఎంతో క్రమశిక్షణాయుత జీవిత విధానాన్ని ఏర్పరచుకున్న ఆయన– మరణించిన రోజు కూడా నడక, యోగాలతోసహా అన్ని రోజువారీ కార్యక్రమాలను యథాతథంగా పూర్తిచేసుకున్నారు. కామ్రేడ్‌ సూర్యనారాయణ 1949 జూన్‌ 1న జన్మించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలోవున్న బొబ్బిలి–పార్వతీపురంల మధ్య ఇప్పలవలస గ్రామంలో పి. సత్యం నాయుడు, అచ్చాయమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెల సంతానంలో సూర్యనారాయణ పెద్దవారు. సీతానగరం హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశారు. విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో 1968–1972 మధ్య తెలుగులో భాషాప్రవీణ పూర్తి చేశారు. తదుపరి రాజమండ్రిలో పండిట్‌ ట్రైనింగు పూర్తిచేశారు. 1980లో ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా యంఏ (తెలుగు) పట్టాని అందుకున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా 1974లో శ్రీకాకుళంజిల్లా గార సమితి అప్పర్‌ ప్రైమరీ స్కూలులో ఉపాధ్యాయుడిగా చేరారు. తదుపరి గార సమితి శ్రీకాకుళం మున్సిపాలిటీలో విలీనమైనప్పటి నుంచి 2007లో రిటైర్‌ అయ్యేవరకు శ్రీకాకుళం మున్సిపల్‌ స్కూళ్ళలో పనిచేశారు. సుమారు 33 ఏళ్ళపాటు సాగిన ఉపాధ్యాయ జీవితంలో పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో పనిచేశారు. తన పరిధిలో ఉత్తమ విలువల కొరకు, ఉన్నత విద్యాప్రమాణాల కొరకు కృషిచేశారు. బోధిస్తున్న అంశంపట్ల లోతైన అవగాహన కలిగి ఉండటం తోపాటు, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించేవిధంగా ఆకర్షణీయ పద్ధతుల్లో బోధన ఉండటం కారణంగా ఆయన విద్యార్థుల్లో బలమైన ప్రభావాన్ని కలిగించేవారు.


ఉద్యోగంలో చేరిన తొలినాళ్ళలోనే తనకు పరిచయమైన ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్తల సంపర్కంతో ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేయనారంభించారు. టీచర్స్‌ ఫెడరేషన్‌లో సుదీర్ఘకాలం పని చేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జిల్లా ప్రధాన నాయకత్వ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగే అనేక ఆందోళనా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 


తమ జీవితాలు బాగుచేసుకోవడానికి అవసరమైన పోరాటాలు చేసే హక్కుతో సహా ప్రజలకు సంపూర్ణ ప్రజాస్వామిక హక్కులుండాలని కామ్రేడ్‌ పి.ఎస్.ఎన్ కోరుకున్నారు. అందులో భాగంగానే 1982–83 కాలంలో శ్రీకాకుళం జిల్లా బుడుమూరు గ్రామంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపిడిఆర్‌) సభలో మొదటిసారి పాల్గొన్నారు. చివరి వరకూ ఆ సంస్థ కార్యకలాపాల్లో కీలకంగా ఉంటూ వచ్చారు. 2017లో ఓపిడిఆర్‌ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి చనిపోయేనాటివరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. 


దేశ ప్రజలు అన్నిరకాల దోపిడీ దౌర్జన్యాల నుంచి సంపూర్ణంగా విముక్తి చెందాలని కామ్రేడ్‌ సూర్యనారాయణ కోరుకున్నారు. ప్రముఖ కమ్యూనిస్టు విప్లవ నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిగార్లు ప్రబోధించిన ప్రజావిప్లవ మార్గంలోనే ప్రజల విముక్తి సాధ్యపడుతుందని బలంగా విశ్వసించారు. అందుకనే ఆ పంథాను అనుసరిస్తున్న భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్క్సిస్టు–లెనినిస్టు) (యుసిసిఆర్‌ఐ–యం.యల్‌)తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని విప్లవోద్యమానికి సహాయ సహకారాలను అందిస్తూ వచ్చారు.


శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనులతోను, గ్రామీణ పేదల ఉద్యమాలతోను కామ్రేడ్‌ సూర్యనారాయణ ఉద్యోగ విరమణ అనంతరం ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొన్నారు. ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. భూమి సమస్యలపైన, ఇతర ప్రజాసమస్యలపైన వివిధ గ్రామాల్లో జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా ఆయన ఆ ప్రాంతాల్లో పర్యటించేవారు. అక్కడ జరిగే సభలు, సమావేశాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. కేవలం ఉపాధ్యాయ ఉద్యమం వరకే పరిమితంగాక పీడిత తాడిత ప్రజల పోరాట కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం తనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నదని అనేవారు.


కామ్రేడ్‌ సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, మనవలు, మనవరాలు వున్నారు. భార్య రాధాకుమారి ఆయన చేపట్టిన అన్ని ఉద్యమ కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా వుండేవారు. వివిధ సభలు, సమావేశాలకు ఆయనతో హాజరయ్యేవారు. ఈవిధంగా ఆయన ఉద్యమ జీవితంలో ఆమె ఒక ముఖ్య భాగస్వామి. 


సత్యశీలత, నిజాయితీ, క్రమశిక్షణ, నైతికత, నిరాడంబరత, నమ్రత, నిష్కల్మషత్వాలకు సూర్యనారాయణ నిలువుటద్దంగా వుండేవారు. అబద్ధం, అరాచకత్వం, అన్యాయం, అవినీతి, కపటత్వం, కులం, మతం, ప్రాంతం వంటి అన్నిరకాల సంకుచితత్వాలకు ఆయన బద్ధవ్యతిరేకి. ప్రజలపట్ల ప్రేమ, ప్రజా సమస్యల పట్ల ఆవేదన, వాటికి వ్యతిరేకంగా పోరాడాలనే తపన– ఆయన నైజం. ఆయనలోవున్న ఈ ఉన్నత లక్షణాలను అందిపుచ్చుకుని ఆయన వదిలివెళ్ళిన ఉన్నత లక్ష్యాల వైపు గమించటమే ఆయనకు మనమందించగల నిజమైన నివాళి.

కె. సుబ్బారెడ్డి

ప్రధాన కార్యదర్శి, ఓపిడిఆర్‌, ఆంధ్రప్రదేశ్‌

Updated Date - 2021-10-12T06:39:54+05:30 IST