Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 28 Jan 2022 00:14:54 IST

ఎయిరిండియాకు టాటా రెక్కలు

twitter-iconwatsapp-iconfb-icon
ఎయిరిండియాకు టాటా రెక్కలు

  • టాటా గ్రూప్‌నకు ఎయిర్‌లైన్స్‌ అప్పగింత పూర్తి  
  • ప్రపంచస్థాయి విమాన సంస్థగా  తీర్చిదిద్దుతాం.. 
  • టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ 


న్యూఢిల్లీ: దాదాపు ఏడు దశాబ్దాలపాటు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిరిండియా తిరిగి సొంతగూటికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఎయిర్‌లైన్స్‌ను అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది. టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ గురువారం ప్రధాని మోదీని కలిసిన అనంతరం ఎయిరిండియా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఇరువర్గాల సమక్షంలో యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత కొత్త యాజమాన్యం బోర్డు సమావేశమైంది. ‘‘ఎయిరిండియా టేకోవర్‌ పూర్తయినందుకు మేమెంతో ఆనందంగా ఉన్నాం. ఎయిర్‌లైన్స్‌ తిరిగి మా గూటికి చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్స్‌గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామ’’ని చంద్రశేఖరన్‌ ఈ సందర్భంగా అన్నారు.


 ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా జరిగిన బిడ్డింగ్‌లో టాటా సన్స్‌ అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ బిడ్‌లో భాగంగా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రూ.15,300 కోట్ల రుణభారాన్ని భరించేందుకు టాటా ఒప్పుకుంది. మిగతా రూ.2,700 కోట్లను ప్రభుత్వానికి నగదు రూపంలో చెల్లించింది. ఎయిర్‌లైన్స్‌ రుణాన్ని భరించేందుకు అంగీకరించడంతోపాటు ప్రభుత్వానికి టాలెస్‌ రూ.2,700 కోట్లు చెల్లించిందని.. దాంతో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 100 శాతం ఈక్విటీ షేర్లను కంపెనీకి బదిలీ చేయడం జరిగిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న 12వేల మందికి పైగా ఉద్యోగులను టాటా గ్రూప్‌ కొనసాగిస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సాల్‌ స్పష్టం చేశారు. 


కలిసి పనిచేద్దాం.. 

ఎయిరిండియా ఉద్యోగులను టాటా గ్రూప్‌లోకి స్వాగతిస్తూ చంద్రశేఖరన్‌ లేఖ రాశారు. తాను తొలిసారిగా 1986లో ఎయిరిండియా విమానంలోనే ప్రయాణించానని, ఆ ప్రయాణ అనుభూతి జీవితకాలం గుర్తుండిపోతుందని లేఖలో ప్రస్తావించారు. 


 ఆ మధుర జ్ఞాపకాలెంతో అద్భుతమని, ఇక భవిష్యత్‌ గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘‘ఎయిర్‌లైన్స్‌ చరిత్రలో ఈరోజు సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ అవసరాలకు తగ్గట్టుగా ఎయిర్‌లైన్స్‌ను అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేద్దాం. కలిసికట్టుగా మనమేం సాధించగలమని యావత్‌ దేశం వేచిచూస్తోంది. ఎయిరిండియాకు స్వర్ణయుగం రాబోతోందని నేను నమ్ముతున్నానని’’ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. విమాన సేవల్లో రానున్న మార్పులివీ.. 

శుక్రవారం నుంచి ఎయిరిండియా విమానాలు టేకాఫ్‌ తీసుకునేముందు ప్రయాణికులను ఉద్దేశించి కెప్టెన్‌ ప్రసంగంలో ముందుగా యాజమాన్య మార్పిడి గురించి ప్రకటించనున్నారు. 


  • చురుకైన, చక్కటి ఆహార్యం కలిగిన క్యాబిన్‌ సిబ్బంది 
  • క్యాబిన్‌ సిబ్బంది ఇకపై ప్రయాణికుల్ని అతిథి అని సంభోధిస్తారు
  • ఎంపిక చేసిన విమాన సర్వీసుల్లో మరింత మెరుగైన భోజన సదుపాయాలు 
  • విమానం బయలుదేరే 10 నిమిషాల ముందు ద్వారాల మూసివేత 
  • రతన్‌ టాటా గొంతుతో కూడిన ప్రత్యేక శ్రవణ సందేశం 


ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌ లేని భారత్‌ 

ఎయిరిండియా ప్రైవేటీకరణతో భారత్‌కు అధికారిక విమాన సంస్థ లేకుండా పోయింది. కాగా, మన పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌తో పాటు అనేక చిన్నా చితకా దేశాలూ అధికారిక ఎయిర్‌లైన్స్‌ను కలిగి ఉన్నాయిఎయిరిండియాకు టాటా రెక్కలు

ఎయిరిండియా టేకోవర్‌కు ముందు ప్రధాని మోదీతో సమావేశమైన టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ 


టాటాకు దక్కిన ఆస్తులు.. 

 ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రె్‌సలో 100 శాతం వాటా 

‘ఎయిర్‌ ఇండియా శాట్స్‌’ (ఏఐఎ్‌సఏటీఎ్‌స)లో ఎయిరిండియాకున్న 50 శాతం వాటా 

ఎయిర్‌లైన్స్‌ల యాజమాన్య హక్కులు. ఎయిరిండియాకు చెందిన 117, ఎయిరిండియా ఎక్స్‌ప్రె్‌సకు చెందిన 24 విమానాలు 

 దేశీయ ఎయిర్‌పోర్టుల్లో ఎయిర్‌లైన్స్‌కున్న 4,400 డొమెస్టిక్‌, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్‌, పార్కింగ్‌ స్లాట్లతో పాటు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో మరో 900 స్లాట్లు


ఎస్‌బీఐ నుంచి రుణం 

నష్టాల్లో ఉన్న ఎయిరిండియా నిర్వహణ కోసం టాటా గ్రూప్‌నకు రుణం ఇచ్చేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం అంగీకరించింది. ఎయిర్‌లైన్‌ అవసరాలను బట్టి టర్మ్‌ లోన్‌తోపాటు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలను ఇవ్వనున్నట్లు కన్సార్షియం తెలిపింది. ఎస్‌బీఐతో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ సహా బడా బ్యాంక్‌లన్నీ ఈ కన్సార్షియంలో భాగంగా ఉన్నాయి. ‘టాటాలు భరించనున్న ఎయిరిండియా రుణాన్ని రీఫైనాన్స్‌ చేసేందుకు చాలా బ్యాంక్‌లు అంగీకరించాయి. ప్రక్రియ మొదలైందని’ ఓ బ్యాంకర్‌ తెలిపారు. రీఫైనాన్సింగ్‌లో పాల్గొనదలుచుకోని ప్రస్తుత రుణదాతలకు రావాల్సిన బకాయిలను రీఫైనాన్స్‌ నిధుల నుంచి చెల్లించనున్నారు. ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుత రుణదాతల్లో ఒకటైన ఎల్‌ఐసీ రీఫైనాన్సింగ్‌లో పాల్గొనడం లేదని బ్యాంకర్‌ తెలిపారు. 


ఎయిరిండియా కొత్త యజమాన్యానికి నా శుభాకాంక్షలు. వారి సారథ్యంలో ఎయిర్‌లైన్స్‌ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు దేశంలో విమానయాన రంగం బలోపేతానికీ బాటలు వేస్తుందన్న నమ్మకం ఉంది. 

జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ మంత్రి 


ముచ్చటగా మూడు

టాటా సన్స్‌  చేతిలో ఇప్పటికే రెండు విమాన సంస్థలున్నాయి. ఎయిరిండియా గూటికి చేరడంతో సంఖ్య 3కు పెరిగింది.  మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా గ్రూప్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఎయిర్‌ ఏషియా ఇండియాతో పాటు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ప్రారంభించిన విస్తారా ఎయిర్‌లైన్స్‌లోనూ టాటా సన్స్‌దే మెజారిటీ (51 శాతం) వాటా. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.