ఢిల్లీ నుంచి వూహాన్‌కు ఎయిరిండియా విమానం !

ABN , First Publish Date - 2020-10-28T21:34:52+05:30 IST

చైనా రాజాధాని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక ప్రకటన చేసింది.

ఢిల్లీ నుంచి వూహాన్‌కు ఎయిరిండియా విమానం !

బీజింగ్: చైనా రాజాధాని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 30న ఢిల్లీ నుంచి వూహాన్‌కు ఎయిరిండియా ఓ  విమాన సర్వీసు నడపనున్నట్లు ఎంబసీ వెల్లడించింది. ఢిల్లీ-గ్వాంగ్జౌ మధ్య ఎయిరిండియా విమానం క్యాన్సిల్ అయిన సరిగ్గా వారానికి ఈ ప్రకటన వెలువడింది. కాగా, వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇది ఆరో విమాన సర్వీస్‌గా ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ-వూహాన్-ఢిల్లీ మార్గంలో నడవనున్న ఈ విమానం రాజధాని హుబీలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడమే కాకుండా, వర్క్ వీసాలు కలిగి ఉన్నవారిని చైనాలో తిరిగి తమ ఉద్యోగాలలో చేరడానికి కూడా సహాయపడుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఇంతకుముందు భారత్‌కు వచ్చిన ఐదు విమానాలు గ్వాంగ్జౌ, షాంఘై, నింగ్బో నగరాల నుంచి రావడం జరిగింది. 


ఇక చైనాలో వైరస్ ప్రభావం మొదలైన తర్వాత సెంట్రల్ చైనీస్ నగరంలో చిక్కుకున్న 647 మంది భారతీయులను స్వదేశానికి తరలించడానికి ఎయిరిండియా ఫిబ్రవరిలో మూడు విమాన సర్వీసులు నడిపించింది. అనంతరం డ్రాగన్ కంట్రీలో జూన్ నెలలో కొవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత చైనాకు ఇదే తొలి ఎయిరిండియా విమానం(వూహాన్‌కు). కాగా, భారత్ నుంచి వూహాన్ చేరుకున్న ప్రయాణికులు తప్పనిసరిగా రెండు వారాల పాటు హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాలి. అలాగే వూహాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నవారు కూడా ఏడు రోజులు ఇన్ట్సిట్యూషనల్ క్వారంటైన్, వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు పేర్కొన్నారు. భారతీయ పౌరులు, ఓసీఐలు(ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) రాయబార కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఏదైనా సహాయం కోసం హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు(helpdesk.beijing@mea.gov.in). 

Updated Date - 2020-10-28T21:34:52+05:30 IST