Abn logo
Jul 5 2021 @ 00:27AM

గురి ‘తప్పని’ దెంచనాల పద్యం!

శ్రీనివాస్‌ దెంచనాల ‘గురి తప్పిన పద్యం’ కవితా సంపుటికి పాతికేళ్ళు ఇంచుమించు! ఏనాడో గురిపెట్టి వొదిలేసి పోయిన ఈ గురి తప్పని అస్త్రం సూటిగా చాలా గుండెల్లో మాయని గాయాలు చేసి గుర్తొచ్చినప్పుడల్లా సలుపుతూనే వుంటోంది అప్పట్నుంచీ! గురి పెట్టినోడు ‘భస్మ సారంగు’ లంటూ వేటి వెంట పడితిరుగుతున్నాడో, లేదంటే వెలిసి పోతున్న ఒకనాటి అపురూప నాటక రంగానికి నగిషీలు చెక్కే చెక్కడం పనిలో వున్నాడో తెలీదు గానీ, తన ‘క్వివర్‌’ లోంచి షివర్‌ పుట్టించే అస్త్రాలేవీ మళ్లీ గురిపెట్టిన దాఖలాలు అంతగా లేవు! అయితేనేం! చేగువేరా విగరూ, శ్రీశ్రీనివాసరావు పొగరూ వున్న ఈ ఆధునికుల్లో ఆధునికుడు, ఈ యుగంలో కాలేసి, వామనుడు ఇంకో కాలు ఆకాశం మీదకి ఎక్కుపెట్టినట్టు పోస్ట్‌ మోడ్రన్‌ యుగంలోకి కాలు చాపి, అదేదో మత్స్యయంత్రం కొట్టే అర్జునుడి పోజులో కిందికి చూసి, పైకి గురిపెట్టికొట్టిన దెంచనాల ‘గురి తప్పిన పద్యం’ అంచనాలకు మించి సూటి గానే దిగడింది గుండెల్లో! పందొందొందల తొంభయి నాలుగ నుకుంటా, ‘గురి తప్పిన పద్యం’ అంటూ ఓ నలభై పైచిలుకు కవిత్వపు తునకల్ని గుది గూర్చి, రమాకాంత్‌ మోహపు గీతల్ని చేర్చి, ఒక మొహం లేని నలుచదరపు ముఖచిత్రంతో, తెలుగు సాహితీ వాకిట్లో మోహరించాడు. 


అప్పటికి ప్రియురాలి మెల్లకన్ను కవిత్వాలు అటకెక్కి ఏళ్ళు పూళ్ళు గడిచాయ్‌! విలాపాల, విప్లవాల కవిత్వాలు అడపా దడపానే! అలెన్‌ పోలు డిలాన్‌లూ పాల్‌ ఎల్వర్డ్‌లూ, కాడ్వెల్లూ, విట్మన్లూ ఒకనాటి ఇన్‌స్పిరేషన్‌! పరాయితనం నగరీకమై, ఒంటరి బతుకులు నాగరీకమై, చింతనలో తానే కోల్పోయి, సంక్లిష్టమైన జీవితపు భవబంధాల చీకటిదారుల్లో చిక్కి, సేద తీర్చలేని ఇలియట్‌ బీడు భూములెంట తిరిగి, ప్రయాస పడి, ఉక్కిరిబిక్కిరై, ఊపిరాడనివ్వని సమూహపు ఒంటరితనంలో, ఒక ఉద్రిక్తతేదో వుండబట్ట నివ్వక, ఒక ఇంటెన్స్‌ ఎమోషనేదో నిలబడ నీయక, ఏదో సొలేస్‌ కోసం రాసే కవిత్వానికి - ఆత్మ ఉంటే చాలు భావాల కడ్డుపడే బారికేడ్లు అక్కర్లేదని, గురి చూసి కొట్టాడు గురి తప్పిన పద్యాన్ని!


ఓ చేత్తో కవిత్వాలు హత్తుతూ, మరో చేత్తో కర్టెన్లు ఎత్తుతూ గడిపే ఈ సవ్యసాచికి నిజానికి కవిత్వమే శ్వాస! మరీ ఒక తరం ముందుకెళ్లి, వెంటరానివాళ్ళని తిట్టుకుంటూ, పోస్ట్‌మాడ్రన్‌ తత్వాల కైపెక్కి, పాల్‌ సెలెన్‌ని పలవరిస్తూ, వాలెస్‌ స్టీవెన్స్‌ని సలపరిస్తూ, ఇలియట్‌ వేస్ట్‌ల్యాండ్లో కాళ్ళీడ్చుకుంటూ తిరిగి, బుకో‘విస్కీ’తో సేదదీరి ‘ఎమోషన్లు రికలెక్టు’ చేసుకొని, ప్రశాం తంగా ‘టింటర్నాబీ’ లాంటి పారవశ్యపు కవిత్వాలు రాద్దామంటే... తిన్న బిర్యానీ ఊరుకుంటుందా, దాంతో పాటే లోపలికి వెళ్లి నెత్తికెక్కిన బుకో‘విస్కీ’ మాత్రం ఊరుకుంటాడా? సర్ప పరిష్వం గపు ఛందస్సులతో పేచీ లేదు గానీ, ముక్కా, ముక్కా అయినా పేర్చాలి కదా కవిత్వం అనిపించుకోడానికి? ఎవడు చెప్పాడు అది కూడా అవసరమేనని? అదీ అక్కర్లేదు! ఎందుకొక సింగిల్‌ డామినెంట్‌ శైలి? ‘కల’గాపులగంలా ఇమేజరీలు కలిపేసి, కొహెరెన్సులూ, క్లోజర్లూ లేకుండా, చదివేవాడేదో మీనింగు కోసం తడుముకునే లోపులో, అక్కడ నుంచి ఒక్క గెంతువేసి, వాణ్ణి అక్కడే కొట్టుకు చావనిచ్చి, గుక్కతిప్పుకోకుండా చేసి, వాడి ఖర్మాన వాణ్ణి వొదిలేసి రావడం ఏం న్యాయం అంటే- మై జాన్తా నై, కుదరదంతే అంటూ విసిరేసిన కవితాస్త్రాలివి! పోస్ట్‌ మోడ్రనిజపు స్పిరిట్‌ని ఆసాంతం నింపుకున్న ప్రతీకలివి. Wallace Stevens అన్నట్టు,"We respond to our interpretations of what happens, not what has happened" నువ్వొక అనుభూతించుకున్న ఉద్వేగపు క్షణంలో నువ్వు పలవరించిన సత్యమే నీ కవిత్వం. నీ సత్యాన్ని వాడు గ్రహిస్తాడా లేదా తర్వాత సంగతి! నీ ఇన్నర్‌సెల్ఫ్‌లో చొరబడి కంది రీగలా రొదచేసే ఆ అసలు విషయం నిన్ను కుట్టకమునుపే పేజ్‌మేకర్‌లో పడవెయ్యకపోతే ఆ తర్వాత నీకు స్పృహా వుండదూ, స్పర్శా ఉండదు!


‘స్వదేహాల్లో’ మూడు శవాలతో మాట్లాడించిన దెంచెనాలకి ఇది తెలియదా? మహబాగా తెలుసు! ‘మో’ అంటే మోహన్‌ ప్రసాద్‌ అని తెలియని వాడికి ఇందులో రా... అంటే రాముడనీ, జీ.... అంటే జీసస్‌ అని మాత్రం తెలుస్తుందా? తెలియకుంటేమీ ఖర్మం అంటాడు! పుక్కిటపట్టి ఊపిరాడకుండా నిశ్వాసించిన ఈ ప్రొజాయిక్‌ పోయెట్రీ పీస్‌లో ఒక వాండలిస్ట్‌, ఒక ఐకనోక్లాస్ట్‌ని మాత్రమే చూస్తే చాలదు హారతులిస్తూ జీవితాన్ని కరిగించుకుపోయిన తరతరాల ‘నాయన’ వేదన ఎంత ప్రతిభావంతంగా చెబుతాడో కూడా కవి, చవిచూడాలి మరి! యెంత అంతర్‌ బహిర్‌ యుద్ధం చేస్తే, ఎంత హృదయాన్ని చిలికితే ఈ వింతైన మలాము దొరికిందో ఎవడికి వాడు తేల్చుకోవలసిందే! ‘వృథా’ కవితలో ఎంతబాగా అంటాడీ శ్రీనివాసు- చేజారిపోతున్న నాయన దేహాన్ని చేతుల్లో పెట్టుకొని, ‘‘గాలియంత్రపు సుడిగాలి మధ్యన చెమట సాగరం లోంచి/ హఠాత్తుగా నా హస్తాల్లోకి ఒరిగిపోయి.../ ఖగోళాలు దాటి’’ పోయిన తన గుమస్తా నాయన్ని తలుచుకుంటూ, ‘‘మా ముగ్గురికీ ఆహారంగా తన ప్రోటోప్లాజమ్‌ను పంచినవాడు/ మెట్ల వాంఛలు లేనివాడు/ ఆర్టిజానే కాదు అతడు ఆర్టిస్టు’’ అంటూ! 


‘జీన్‌ ఆఫ్‌ మను’ కవితలో రెండు ఆత్మలు కోల్పోయిన రాగ రంజితం కాని దేహాల కలయిక గురించి రాస్తాడు. ‘‘పగలు కాటేశాక ఆమె కళ్ల నుంచి వంట పొగలూ’’, అతడి ‘‘కాళ్ల నుంచి సైరప్‌ మోతా, చేతుల్లోంచి కుప్పలు గొడ్తన్న ధ్వనీ’’ అప్పుడొస్తే, యిప్పుడు మాత్రం ఏమంత గొప్ప వాసనలు వస్తున్నాయి? యాపిల్‌ లాప్టాప్‌ కంపో, చెమట చిత్తడితో పేరుకున్న రంగుపొడి వాసనో తప్ప! ఇప్పుడైనా వాడు ‘‘మగ పులై తొడల మధ్య’’ కూచోవడమే, బద్ధకంగా ఆవులిస్తున్న అర్ధశవం ముందు! రస యుద్ధాలన్నీ అబద్ధాలు కావూ!‘నేను సముద్రుణ్ణి’ కవితలో- ‘‘వంట గదులు పురుషులందరికీ గర్భధారణ చేయ లేనంత కాలం. బ్రతికున్న మృతులు రెండు కలిసి పెంట కుప్పలో కన్న బాల్యాన్ని కరెన్సీ తన్నుకు పోతున్నంత కాలం. ...ఉమ్మనీరుల్లో పెంచుకున్న ప్రేమలకు నేలపై పడగానే పడగలు మొలుస్తున్నంత కాలం. కాడికి ఆ చివర కంఠం కట్టుకొని ఈ చివర కడుపు కట్టుకొని రైతులు రాళ్లు దున్ను తున్నంతకాలం....’’ -ఇక్కడ కవి అవపోసన పట్టింది సముద్రాన్ని కాదు! కరకు రక్కసి రాజ్యపు గుళ్లకు బలై, వాడిపోయిన ఓ విప్లవ మందారాన్ని! సముద్రుడనే వాణ్ణి! ఈ బలిదానా లవిగో... అవన్నీ ఉన్నంత కాలం తప్పవంటున్నాడు కవి! 


‘రక్త దాహుడు’, ‘స్వదేహాలూ’, ‘పంజాలతికించిన, కోరలు మొలిచిన మనిషీ’, ‘ఆది రక్కసుడు’, ‘హృది మెదడూ’, ‘తియ్యటి వజ్రకడియాలూ’, ‘కంటి గునపాలూ’, ‘అనిజం’, ‘గర్భవతుడు’... ఈ ఇమేజరీలు ఫోగర్‌తో చిత్రిక పడతాడో, పొగరుతో చెక్కుతాడో తెలీదుగానీ, తానొక unacknowledged legislatorట నంటూ చెప్పకనే చెబుతాడు. 


‘‘వీడు పొగచెట్టుకు ఉరేసుకున్నా/ మెదడు ఆలోచనల్ని స్ఖలిస్తూనే వుంటుంది/ ఆత్మ సన్‌బాత్‌ చేస్తుంటుంది/ ఒకడు పంట్లామ్‌ నెత్తినపెట్టుకొని గోచీ వెతుక్కుంటున్నాడు/ మరొకడు అరిస్టోక్రాట్‌ బాటిల్లో తలకాయ ఇరికించాడు.../ మయకోవిస్కీ గీతాలు గానీ/ మహాకవి పద్యాలు గానీ వినిపిద్దామంటే...’’... అవి ‘‘ఉక్కు చర్మాలు’’ అని వాపోతాడు!


‘అమ్ముకుంటున్న బాల్యానికి’ కవితలో ఎంత ఆవేదన నింపుతాడో చూడండి! ‘‘ఏడాది క్రితం/ వాడి కళ్లల్లో నాకు బుద్ధుడు కన్పించాడు/ శిలువ కన్పించింది/ పావురాల గుంపూ కన్పించింది/ చిరుబుగ్గల్లో పాల వర్షాలు చూశాను/ మరి ఇప్పుడో/ మునుం మునుమంతా ఎండిపోయి ఎన్నులన్నీ రాలిన చేను/ ...వాడి పసివేళ్ళను కత్తిరించుకొని మీ సంబరాల సంక్రాంతుల/ తద్దినాల టపాకాయలు చేస్తూ/ వాడి జీవితాన్ని పాలిష్‌గా మీ బూట్లకు వేస్తూ/ చూపు చూపంతా చల్లని నీరై ప్రవహించిన వాడు/ నేడు ఎండిపోయి...’’ ...ఎవరి కళ్ళు మాత్రం జలార ణ్యాలు కావు? ఎంత భావుకత! ఎంత రసికతో కూడా చూడండి ఈ పాదాలు: ‘‘తా వచ్చునా/ చనుగొయ్యలకూయల గట్టుక/ జో జో అని పాడునా/ నా రజో భారమ్మునంతా/ జిహ్వలతో కడగునా/ నా సారంగికి సహస్ర రెక్కలు తొడిగి/ నింగికి విసురునా’’ అంటూ పలవరిస్తాడు. నెలలపాటు పసిగుడ్డుగా నులివెచ్చని, సుతిమెత్తని పాలిండ్ల మధ్య శిశువై ఎంతకీ సేదదీరలేని పురుషుడి వ్యామోహం కాదూ ఇదంతా? ‘‘గొంగళి పురుగుల గుట్ట తల/ వడకని జనపనార జడలతో/ ...జీవ శిథిలాల్ని జీర్ణ చర్మంలో మూట గట్టుకొని/ ...బాల్యం వంతెన కూలి నడుం విరిగిన వృద్ధబాలికా/ ...భూగోళాన్ని ఉమ్మ నీరులో పెంచి పెద్దచేయాల్సిన దానివి/ ...సృష్టి చక్రానికి రక్త ఇంధనం సరఫరా చేయాల్సిన దానివి/ అకాల ప్రసవమైనట్టు అవయవాలు స్థానభ్రంశం చెంది/ ...ఎవరు పాపా నీవు? నీ పేరు చెప్పవా తల్లీ?’’ అంటూ ‘ఇరవయ్యొకటోశతాబ్దం’ కవితలో శ్రీనివాస్‌ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు! ఒక యుగం ముందుకెళ్లే ఆధు నికతా, మూఢత్వపు ప్రతీకల దేవుళ్ళని వెలివేసే దమ్మూ, భూగోళాన్ని ఎడం కాలితో తన్నే ఆవేశమూ, స్తన్యం వదలని రసికతా, నాయన పట్లా అమ్ముడు పోయిన బాల్యం పట్లా గుండె పట్టని ఆర్తీ, అన్నింటికీ మించి కుళ్ళిన బత్తాయిల కుప్ప లాంటి సమాజాన్ని క్షాళన చేసే మానవీయ కోణం ఈ ప్రతిభామూర్తి స్వంతం! అందుకే ఇతనిది గురి తప్పని పద్యం.

వి. విజయకుమార్‌

85558 02596


ప్రత్యేకంమరిన్ని...