వ్యవసాయ ప్రణాళిక భళా.. పంటల సాగు డీలా!

ABN , First Publish Date - 2022-08-18T07:46:30+05:30 IST

వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గించి.. పత్తి, కంది సాగును పెంచటానికి సర్కారు చేస్తోన్న ప్రయత్నం వరుసగా మూడో ఏడాది కూడా బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది.

వ్యవసాయ ప్రణాళిక భళా.. పంటల సాగు డీలా!

మూడేళ్లుగా పత్తి, కంది సాగుతో నష్టాలు

ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి ఆసక్తి చూపని రైతులు

వరి సాగు కూడా మందకొడిగానే..

కోటి ఎకరాలకు చేరిన ఖరీఫ్‌ విస్తీర్ణం


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గించి.. పత్తి, కంది సాగును పెంచటానికి సర్కారు చేస్తోన్న ప్రయత్నం వరుసగా మూడో ఏడాది కూడా బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. వ్యవసాయ శాఖ ప్రణాళికనుగానీ, అవగాహన సదస్సుల ద్వారా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులనుగానీ రైతులు ఏమా త్రం పట్టించుకోకపోవటం గమనార్హం. కొన్నేండ్లుగా రైతులు ఏ పంటలైతే సాగుచేస్తున్నారో... అవే పంటలను సాగుచేస్తూ వెళ్తున్నారు. దీంతో సర్కారు ప్రణాళికకు, వాస్తవ సాగుకు పొంతన ఉండటంలేదు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన లెక్కల్లో వానాకాలం సాగు పరిస్థితులు వెలుగుచూశాయి. వ్యవసాయ పంట లు సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో... సగభాగం పత్తిని వేయించాలని మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటంలేదు.

  దీంతో పత్తి సాధారణ విస్తీర్ణానికి కాస్త అటూఇటుగా సాగవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ‘నియంత్రిత సాగు’ పేరుతో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టేసరికి... రై తులు 60.54 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అధిక వర్షాలతోపా టు గులాబీ రంగు పురుగు దాడిచేయటంతో దిగుబడి రాలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ 2021లో కూడా అదే టార్గెట్‌ పెట్టి ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెచ్చింది. కానీ రైతులు కేవలం 46.43 లక్షల ఎకరాల్లోనే పత్తిని సాగుచేశారు. మళ్లీ అధిక వర్షాలు, చీడపీడలతో దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ఈ వానాకాలంలోనూ ప్రభు త్వం మళ్లీ 75 లక్షల ఎకరాల టార్గెట్‌ పెట్టింది. రెండేళ్లు వరుసగా నష్టపోయిన రైతులు... మూడోసారి 48.29 లక్షల ఎకరాల్లో మాత్రమే ఈసారి పత్తి సాగుచేశారు.  ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తున్నా... పత్తికి గ్యారెంటీ లేదనే భయంతో సాగు విస్తీర్ణం పెం చటానికి రైతులు ధైర్యం చేయటంలేదని స్పష్టమవుతోంది. కంది సాగు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఈసారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగుచేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టింది. కానీ రైతులు 5.48 లక్షల ఎకరాల్లో మాత్రమే కంది వేశారు. ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించకపోవటం, ప్రొ క్యూర్‌మెంట్‌ చేస్తామని హామీ ఇవ్వకపోవటం, పంటల బీమా ను అమలుచేయకపోవటంతో రైతులు అభద్రతకు గురవుతున్నట్లు కనిపిస్తోంది.  

వరి సాగుపై అయోమయం
కాగా.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న పంచాయితీతో వరి రైతులు అయోమయంలో పడ్డారు. వరిసాగు మూడేళ్ల కిందటే 65 లక్షల ఎకరాలకు చేరింది. రెండు పంటలు కలిపి కోటి ఎకరాలు దాటిపోయింది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా తయారైందని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రకటించారు. ఆతర్వాత సీజన్‌లో వరి సాగు మరింత పెరుగుతుందని అంతా భావించారు. కానీ 3 పంట సీజన్ల నుంచి వరి సాగు పడిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ధాన్యం సేకరణ విధానం, కేంద్ర ప్రభుత్వ బియ్యం సేకరణపై అయోమయం నెలకొనటంతో రైతులు వరి సాగును క్రమంగా తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి 45 లక్షల ఎకరాల వరకే వరి సాగును నియంత్రించింది. ఇప్పటివరకు 35 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు వరినాట్లు వేశారు. మరో రెండు వారాల వరకు కూడా వరి నాట్లు వేసే అవకాశాలున్నాయి. కాగా, ఈ వానాకాలం సాగు విస్తీర్ణం బుధవారం నాటికి కోటి ఎకరాల మైలురాయిని దాటడం గమనార్హం.

Updated Date - 2022-08-18T07:46:30+05:30 IST