దూకుడే ఆమెశైలి!

ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST

‘‘అరికాళ్ళ నిండా బొబ్బలు, అలసట, నిస్సత్తువ... ఇంటికి చేరి కూలబడిపోయాను. అమ్మ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది..

దూకుడే ఆమెశైలి!

  • వరల్డ్‌ అండర్‌ 20 అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో ఒకే ఒక్క సెంటీమీటర్లో స్వర్ణాన్ని జార్చుకుంటేనేం... భవిష్యత్‌ అంతా బంగారమేనన్న నమ్మకాన్ని ఎంతో ఎత్తుకు పెంచేసింది
  •  శైలీ సింగ్‌. తను పుట్టిన నేలలోనే పోరాటం ఉందంటున్న పదిహేడేళ్ళ ఈ ఝాన్సీ అమ్మాయి క్రీడా ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...


‘‘అరికాళ్ళ నిండా బొబ్బలు, అలసట, నిస్సత్తువ... ఇంటికి చేరి కూలబడిపోయాను. అమ్మ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నా పాదాలకు నూనె రాసింది. కాళ్ళు పట్టింది. నొప్పితో కన్నీరు పెడుతున్న నన్ను ఓదార్చింది. కానీ ‘‘ఈ క్రీడలు మనకెందుకు? మానేసి చక్కగా చదువుకో’’ అని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే క్రీడల్లో నేను రాణిస్తానని మొదట గుర్తించింది మా అమ్మ వినీతా సింగ్‌. ఆమె కూడా చిన్నప్పుడు ఆటల్లో చురుగ్గా ఉండేదట! ఆమె తండ్రి రెజ్లర్‌. అంతేకాదు, ఏదైనా తలపెడితే, అది నెరవేరేవరకూ పోరాడాలనీ, ఆ తత్వం నువ్వు పుట్టిన నేలలోనే ఉందనీ అమ్మ బోధించింది. నేను పుట్టింది మహా యోధురాలు లక్ష్మీబాయి ఏలిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఝాన్సీ గడ్డమీద!




అమ్మ కోరిక వచ్చేసారి తీరుస్తా!

ఈ మధ్య నైరోబీలో జరిగిన అండర్‌-20ప్రపంచ ఛాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకం ఖాయం అనుకున్నాను. ల్యాండింగ్‌ అవడంలో చిన్న సాంకేతిక సమస్య ఎదురవడంతో... కొద్దిలో తప్పిపోయింది. అది నాకెంతో నిరాశ కలిగించింది. ఎందుకంటే, ‘‘ఈ పోటీలో బంగారు పతకం సాధించాలి, స్టేడియంలో మన జాతీయగీతాన్ని ఘనంగా పాడి వినిపించాలి’’ అని అమ్మ కోరింది. కానీ దాన్ని నెరవేర్చలేకపోయాను. నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మను నిరాశపరిచినందుకు బాధగా ఉంది. అయితే, జరిగినదాన్ని వదిలేసి, రాబోయే పోటీల మీద దృష్టి పెడుతున్నాను. ఇప్పటికీ నేను నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా నా టెక్నిక్‌ని ఇంకా మెరుగుపరచుకోవాలి. రానున్న అండర్‌-20 వరల్డ్‌ ఛాంపియన్‌షి్‌పలో స్వర ్ణపతకం గెలవాలి. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో రాణించాలి. ఆ తరువాత 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలి. ఇవీ ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు.’’  


రికార్డుల బంగారం!

‘‘శైలిని మొదటిసారి చూడగానే ఆమెలో ఒక అగ్రశ్రేణి జంపర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ కనిపించాయి. అప్పుడు ఆమె వయసు పదమూడేళ్ళు. ఇంకా ఎదిగే వయసు. బరువు కేవలం ముప్ఫై ఎనిమిది కిలోలు. కానీ ఆమెలో అంకితభావం, దూకుడు నన్ను ఆకట్టుకున్నాయి’’ అంటారు శైలీ సింగ్‌ కోచ్‌ బాబీ జార్జి. ఆయన శిక్షణలో... 2018లో రాంచీలో జరిగిన జూనియర్‌ నేషనల్స్‌లో అండర్‌-16 లాంగ్‌జంప్‌ జాతీయ రికార్డును శైలి బద్దలుగొట్టి, బంగారు పతకం గెలిచింది.. ఆ మరుసటి ఏడాది గుంటూరులో జరిగిన నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌... అండర్‌-18 విభాగంలో... మరో స్వర్ణ పతకం సాధించడంతో పాటు తన రికార్డును తానే అధిగమించింది. పటియాలాలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీలో, కొత్త అండర్‌-20 రికార్డ్‌ నెలకొల్పింది. తద్వారా అండర్‌-20 వరల్డ్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీలకు అర్హత సాధించింది. కానీ ఒక్క సెంటీమీటర్‌ వ్యత్యాసంతో ఆమె రజతానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, ఇది ఆరంభం మాత్రమేనంటున్నారు అంజు జార్జి.  ‘‘ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించే సత్తా శైలికి ఉంది. ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించదు. ఆమె గొప్ప అథ్లెట్‌గా నిలుస్తుంది. శైలికి రజతం అంటే నచ్చదు. కానీ, ఈసారి చిన్న సమస్యతో స్వర్ణానికి దూరమయింది. ఆమెకు గొప్ప భవిష్యత్తుంది’’ అని చెబుతున్నారు అంజు.


పొలంలో ప్రాక్టీస్‌...

అక్క షాను నర్సింగ్‌ చదువుతోంది . తమ్ముడు ఐషు తొమ్మిదో తరగతిలో ఉన్నాడు. నా చిన్నప్పుడే నాన్న మా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మా ముగ్గురినీ బతికించుకోవడానికి అమ్మ ఎన్నో కష్టాలు పడింది. టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. బడిలో ఉన్నప్పుడే క్రీడలంటే నాకు ఆసక్తి మొదలయింది. వీలైనన్ని క్రీడల్లో పాల్గొంటూ ఉండాలని, తోటి పిల్లలతో కలిసి ఆటలాడాలనీ అమ్మ చెబుతూ ఉండేది. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. అలా రెండో క్లాసులో ఉన్నప్పుడు నిర్వహించిన పోటీలో లాంగ్‌ జంప్‌ బాగా చెయ్యడం మా టీచర్లు గమనించారు. బయట ఊళ్ళలో జరిగే పోటీలకు తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. అలా లక్నో, వారణాసి, బరేలీ లాంటి చాలా చోట్ల పోటీల్లో పాల్గొన్నాను. కానీ క్రమంగా ప్రాక్టీస్‌ కొనసాగించడం కష్టమైపోయింది. మా అమ్మ టైలరింగ్‌తో సంపాదించే డబ్బే మా కుటుంబంలోని నలుగురికీ ఆధారం. రోజుకు రెండు పూటలైనా సరైన తిండి ఉండేది కాదు. ఖరీదైన సంగతి దేవుడెరుగు, మామూలు రన్నింగ్‌ షూలు కొనే పరిస్థితి కూడా మాకుండేది కాదు. దీంతో ఒట్టి కాళ్ళతోనే పరిగెత్తేదాన్ని. పాదాలు బొబ్బలెక్కిపోయేవి. అది చూసి అమ్మ కన్నీరు పెట్టుకొనేది. మా ఇంటి వెనకాల ఉన్న పొలంలో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. కొన్నిసార్లు వేరే ఊళ్ళలో జరిగే పోటీలకు వెళ్ళడానికి డబ్బులుండేవి కాదు. నేను వెళ్తానని మారాం చేస్తే... అమ్మ తిప్పలు పడి డబ్బు సమకూర్చేది. లక్నో స్పోర్ట్స్‌ హాస్టల్‌లో చేరాక నా ఆటకు మరింత మెరుగుపెట్టుకున్నాను. క్రమంగా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు రావడంతో... జాతీయ స్థాయికి చేరడానికి మరింత కష్టపడ్డాను.


తెలుగు నేలపై మలుపు...

2017లో తెలుగు నేలమీద జరిగిన రెండు ఈవెంట్స్‌ నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పాయి. విజయవాడలో నేషనల్‌ జూనియర్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీల్లో విఫలమయ్యాను. అయితే, కోచ్‌ రాబర్ట్‌ బాబీ జార్జి నా ఆటను నిశితంగా గమనించారట! దేశానికి అథ్లెటిక్స్‌లో... లాంగ్‌ జంప్‌లో మొదటి పతకాన్ని తెచ్చిన అంజు జార్జి భర్త ఆయన. ఆ తరువాత విశాఖపట్నంలో నిర్వహించిన నేషనల్‌ ఇంటర్‌-స్టేట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో నేను జూనియర్‌ కేటగిరీలో జాతీయ రికార్డు సాధించాను. ఆ పోటీలో అంజు కూడా నా ఆటతీరు చూశారు. బెంగళూరులోని శాయ్‌ సెంటర్‌లో చేర్చి, నాకు శిక్షణ ఇవ్వాలని రాబర్ట్‌ నిర్ణయించారు. ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ డెవల్‌పమెంట్‌ గ్రూప్‌’లో నన్ను చేర్చారు. నా శిక్షణ, ఆర్థిక అవసరాలను అది తీర్చింది. ఎన్నో సౌకర్యాలు నాకు అందుబాటులోకి వచ్చాయి. రేపెలా గడుస్తుందన్న ఆలోచన వదిలేసి, క్రీడ మీద పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం దొరికింది. దాంతో చాలా లోపాలు సరిదిద్దుకోగలిగాను. ఆ తరువాత వరుసగా పోటీల్లో రాణిస్తూ వచ్చాను. అంజు జార్జి అకాడమీలో ప్రస్తుత శిక్షణ నాకు ఎన్నో మెలకువలు నేర్పింది. వరుసగా పోటీల్లో మంచి ప్రదర్శన చేయడానికి ఇవన్నీ నాకు దోహదపడ్డాయి. 



Updated Date - 2021-08-25T05:30:00+05:30 IST