అంతర్వేది ఘటన అనంతరం శ్రీకాళహస్తిలో అపచారం

ABN , First Publish Date - 2020-09-12T00:18:17+05:30 IST

అంతర్వేది ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే.

అంతర్వేది ఘటన అనంతరం శ్రీకాళహస్తిలో అపచారం

చిత్తూరు : అంతర్వేది ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. అయితే ఈ ఘటన మరువకముందే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మరో అపచారం జరిగింది. ఆలయంలో కాశీ లింగం, రామేశ్వరం లింగం పక్కనే లింగం, నంది ప్రతిష్ఠాపన చేశారు. ఈ విషయం వెలుగులోకి రావటంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే తొలగించి సంప్రోక్షణ చేయించారు. శివలింగం, నంది ప్రతిమ ఎలా ప్రతిష్టించారో ఇంతవరకూ తెలియరాలేదు. ఈ ఘటనపై ఆలయ పండితులు గురుకుల్ స్వామినాధన్ స్పందిస్తూ.. తప్పు జరిగిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. హిందూవుల మనోభావాలను కాపాడాలంటూ గాలిగోపురం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.


ఇప్పటి వరకూ ఇలా..

కాగా.. దేవాలయాల్లో ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. పిఠాపురం, కొండబిట్రగుంట, అంతర్వేది.. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఇలా వరుస ఘటనలు ఇవన్నీ యాదృచ్ఛికాలు కావని ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మరోవైపు.. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయని చెబుతుంటారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.


ముఖ్యంగా.. అంతర్వేది ఘటన జరిగిన రోజు నుంచి నిన్న మొన్నటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని ప్రభుత్వం చెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated Date - 2020-09-12T00:18:17+05:30 IST