8 రోజుల్లోనే ముగిసిన సమావేశాలు!

ABN , First Publish Date - 2020-09-17T07:42:01+05:30 IST

కరోనా కారణంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అర్ధంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ నెల 28

8 రోజుల్లోనే ముగిసిన సమావేశాలు!

  • 18 రోజులు నిర్వహించేలా ప్రణాళిక
  • కరోనా నేపథ్యంలో వాయిదాకే  మొగ్గు
  • సభ వాయిదా .. ఫాంహౌ్‌సకు కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అర్ధంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ నెల 28 వరకూ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే ఆ తర్వాతా కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 18 రోజులపాటు సమావేశాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించుకోగా, 8 రోజులకే ముగించాల్సి వచ్చింది. అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాల నిర్వహణలో జాగ్రత్త చర్యలు తీసుకున్నా అసెంబ్లీ, భద్రతా సిబ్బందిలో పలువురు కొవిడ్‌ బారిన పడ్డారు. నాంపల్లి ఎమ్మెల్యేకు సైతం కరోనా సోకింది. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదన మేరకు శాసనసభ నిరవధిక వాయిదాపై మంగళవారం సీఎల్పీ నేత భట్టి, మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీలతో స్పీకర్‌ పోచారం మాట్లాడారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సభను కొనసాగించాలని భట్టి కోరారు.


అలాగే, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, రాంచందర్‌రావుతో ఇదే అంశంపై బుధవారం మాట్లాడారు. అనంతరం స్పీకర్‌, మండలి చైర్మన్‌ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. చివరకు ఉభయసభలనూ నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 8 రోజుల పాటు జరగ్గా.. ఇందులో 31 గంటల 52 నిమిషాల పాటు శాసనసభ నడిచింది. ఇందులో అత్యధికంగా 4గంటల 52నిమిషాలను  సభా నాయకుడు కేసీఆరే వినియోగించుకున్నారు. సీఎం, మంత్రులు కలుపుకుని 15 గంటల సమయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు మరో 8 గంటల 39 నిమిషాల పాటు మాట్లాడారు. అంటే సభ నడిచిన సమయంలో అధికార పార్టీ 23 గంటల45 నిమిషాలు, మజ్లిస్‌ 3 గంటలు, కాంగ్రెస్‌ పార్టీ 3గంటల54 నిమిషాలుు, టీడీపీ 35 నిమిషాలు, బీజేపీ 17 నిమిషాల సమయం వినియోగించుకున్నాయి. శాసనసభలో మొత్తం 12 బిల్లులకు ఆమోదం లభించగా.. మూడే అంశాలపైన స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వ తీర్మానాలు రెండింటికి ఆమోదం లభించింది.  మొత్తం 23 గంటల పాటు శాసనమండలి కొనసాగగా, సీఎం కేసీఆర్‌ గంటన్నర సమయం తీసుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం.. సీఎం కేసీఆర్‌ ఎర్రవెల్లి ఫాం హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.


ప్రభుత్వం పారిపోయింది: భట్టి

సీఎల్పీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభను అర్ధంతరంగా వాయిదా వేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేకనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పారిపోయిందన్నారు.  నెల 28 వరకూ సమావేశాలు నిర్వహిస్తామని, అవసరమైతే అడిగినన్ని రోజులూ పొడిగిస్తామని బీఏసీలో చెప్పి.. ఎప్పటిలాగే వాయిదా వేసుకున్నారని దుయ్యబట్టారు. ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు ఆమోదం కోసమే సభను నిర్వహించినట్లుగా ఉందని విమర్శించారు. 

Updated Date - 2020-09-17T07:42:01+05:30 IST