Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 30 Apr 2022 01:51:58 IST

పక్క రాష్ట్రం.. అధ్వానం

twitter-iconwatsapp-iconfb-icon
పక్క రాష్ట్రం..  అధ్వానం

 • కరెంటు లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు ధ్వంసం
 • నా మిత్రుడొకరు అక్కడికి వెళ్లి వచ్చి చెప్పారు
 • క్రెడాయ్‌ ప్రోపర్టీ షోలో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్య
 • పిచ్చి పంచాయితీలు పెట్టుకుంటే నష్టపోతాం
 • మౌలిక వసతుల విషయంలో హైదరాబాద్‌ భేష్‌
 • హెచ్‌ఎండీఏకు సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌: కేటీఆర్‌
 • కేటీఆర్‌ వ్యాఖ్యలతో ఏపీలో పెను దుమారం
 • ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తా.. రోజా కౌంటర్‌
 • హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర: అమర్నాథ్‌
 • హైదరాబాద్‌లో రాత్రంతా కరెంటు లేదు: బొత్స
 • ఏపీలో విద్యుత్తు కోతల్లేవు: మంత్రి పెద్దిరెడ్డి
 • తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు: సజ్జల
 • తెలంగాణ డ్రగ్స్‌ కల్చర్‌ మనకు లేదు: వనిత
 • వివాదం ముదరడంతో ట్విటర్లో కేటీఆర్‌ వివరణ


‘పక్క రాష్ట్రంలో కరెంటు లేదు. నీళ్లు లేవు. విద్యుత్తు లేదు. అక్కడంతా అధ్వానం’ అంటూ అక్కడికి వెళ్లి వచ్చిన తన మిత్రుడు చెప్పాడని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. సజ్జల రామకృష్ణారెడ్డి సహా ఏపీ మంత్రులు కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలోనూ కరెంటు కోతలున్నాయని సజ్జల అంటే.. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర ఉందని మంత్రి అమర్నాథ్‌ అన్నారు. హైదరాబాద్‌లో రాత్రంతా కరెంటు లేదని బొత్స అంటే.. కరెంటు బిల్లు కట్టి ఉండరని ఎంపీ రంజిత్‌ రెడ్డి అన్నారు. వివాదం ముదరడంతో కేటీఆర్‌ వివరణ ఇచ్చారు.

 

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘నా ఫ్రెండ్‌ ఒకాయనున్నారు. సంక్రాంతికి ఆయన పక్క రాష్ట్రానికి పోయారు. ఆయనకు అక్కడ తోటలున్నాయి. ఇల్లుంది. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్‌ చేశారు. కేటీఆర్‌ గారూ.. మీరొక్క పని చేయండి. మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రానికి పంపండి అని అన్నారు. ఎందుకండి అని నేనన్నాను. ఏమీ లేదు సార్‌.. సంక్రాంతికి వెళ్లి మా ఊళ్లో నాలుగు రోజులున్నాను. ఊళ్లో కరెంటు లేదు. నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమైపోయాయి. అన్యాయంగా.. అధ్వానంగా ఉంది. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాతే నాకు ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని అన్నారు. మనోళ్లందరినీ అక్కడకు పంపితే.. మన విలువేమిటో... ప్రభుత్వం చేస్తున్నదేమిటో అప్పుడు తెలుస్తుందని చెప్పారు’’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తాను చెబుతున్నది అతిశయోక్తి అని అనిపిస్తే.. తాను డబ్బా కొట్టుకుంటున్నానని భావిస్తే.. కారేసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లి రావాలని సూచించారు.


క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో మూడు రోజులపాటు జరగనున్న 11వ ప్రాపర్టీ షోను శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ పక్క రాష్ట్రంలోని ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని వివరించారు. అయితే, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను పలువురు ఏపీ మంత్రులు ఖండించారు. దాంతో, క్రెడాయ్‌ సమావేశంలో ఉదయం ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేకుండా తాను చేసిన వ్యాఖ్య ఏపీలోని తన మిత్రులకు అప్రయత్నపూర్వకంగా బాధ కలిగించిందని శుక్రవారం రాత్రి ట్విటర్లో కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌తో తనకు సోదర బంధం ఉందని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం సుసంపన్నం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


పంచాయతీలు పెట్టుకుంటే నష్టపోతాం

రాబోయే 10, 15 ఏళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘‘మత కల్లోలాలు, పనికి మాలిన పంచాయితీలు, మతం పేరుమీద కుమ్ములాటలు, కర్ఫ్యూలు లేకపోతే హైదరాబాద్‌ మరింత దూసుకుపోతుంది. హలాల్‌, హిజాబ్‌ వంటి పిచ్చి పంచాయితీలు పెట్టుకుంటే వాళ్లలాగే నష్టపోతాం. నగరం ముందుకు పోవాలంటే అనవసర పంచాయితీలు లేకుండా.. అభివృద్ధిని ఆటంకపరిచే కార్యక్రమాలు చేయకుండా ప్రగతీశీల అభివృద్ధితో ముందుకుపోవాలి’’ అని సూచించారు.


దేశంలో వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగమే ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, 70 శాతం జనాభా గ్రామాల్లో నివశిస్తున్నా.. ఆర్థికాభివృద్ధిని అందించేది పట్టణాలు, నగరాలేనని తెలిపారు. పది నగరాలే ఆర్థిక శక్తులుగా దేశాన్ని నడుపుతున్నాయని, వాటిలో జనాభాకనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే నష్టం వాటిల్లుతుందని చెప్పారు. వైద్యం కోసం 60-70 దేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారని, ఝార్ఖండ్‌ సీఎం కూడా తన తల్లి వైద్య చికిత్స కోసం వచ్చి కేసీఆర్‌ను కలిశారని గుర్తు చేశారు. సంపద సృష్టించే నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవడంపై గతంలో సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని, చెరో రూ.10 వేల కోట్లు పెడితే అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని అన్నారని, కానీ, కేంద్రం ఆలోచన మరో విధంగా ఉందని చెప్పారు.


పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో హైదరాబాద్‌ ఉందని, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌ బాగుంటుందని చాలా మంది పెట్టుబడిదారులకు స్పష్టం చేశానని కేటీఆర్‌ చెప్పారు. ‘‘దేశంలో ఎవరు అవునన్నా, కాదన్నా, ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. 2015 నుంచి 2020 వరకూ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌లో హైదరాబాద్‌ అత్యుత్తమ నగరమని ఇంటర్నేషనల్‌ ఏజెన్సీలు చెప్పడమే ఇందుకు నిదర్శనం. బెంగళూరు నుంచి వచ్చేవాళ్లకు ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది’’ అని అన్నారు. ఉత్తర భారతానికి చెందిన బీజేపీ ఎంపీ ఒకరు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ మీటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారని, మాదాపూర్‌లోని కోహినూరు హోటల్‌లో బస చేసి ఆ ప్రాంతంలోని బంధువుల ఇంటికి ఏడు నిమిషాల్లో వెళ్లానని చెప్పారని తెలిపారు. హైదరాబాద్‌ మాదిరిగా తమ దగ్గర ఫ్లై ఓవర్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవని టీ తాగుతూ తనతో చెప్పారని, కానీ, బయటకు వచ్చి విమర్శించారని తెలిపారు.


ప్రతిపక్ష పార్టీల నాయకులు తిట్టడంలోనే పీజీలు, పీహెచ్‌డీలు చేశారని, రాష్ట్రాభివృద్ధికి 20 ఏళ్లకు అవసరమైన ప్రణాళికలు వారి వద్ద లేవని విమర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ వచ్చి ఉపాధి పొందుతున్నారని, కానీ, ఇక్కడి యువత మాత్రం గల్ఫ్‌కు వలస పోతున్నారని, వారికి ఇక్కడే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అందించేందుకు ముందుకొస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రారంభించాలని, తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించాలని కోరారు.


పక్క రాష్ట్రం..  అధ్వానం

చంద్రబాబు ఐటీ, టెక్నాలజీపై దృష్టి సారిస్తే..

చంద్రబాబు సీఎంగా ఐటీ, టెక్నాలజీ, నగరాలపై దృష్టి సారిస్తే.. వైఎ్‌సఆర్‌ వ్యవసాయం, గ్రామీణానికి పెద్దపీట వేశారని, కానీ, సీఎం కేసీఆర్‌ మాత్రం పట్టణ, పల్లె ప్రగతీకి బాటలు వేసి సమ్మిళితమైన అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎనిమిదేళ్లలో 138 శాతం పెరిగిందని, దేశంలో ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలో పెరగలేదని చెప్పారు. ‘‘ఇతర రాష్ట్రాల డెవలపర్లు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. వాళ్లెవ్వరూ నన్ను కలవడం లేదు.


ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వానికి ఇంతా.. ప్రతిపక్షాలకు ఇంత ఇవ్వాలనే దురవస్థ హైదరాబాద్‌లో ఉందా..? ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడి, ఇక్కడి పరిస్థితులను బేరీజు వేసుకోండి’’ అని బిల్డర్లు, డెవలపర్లకు సూచించారు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తామని, రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని, బుల్లెట్‌ రైలు ఉరుకుతుందని ఎనిమిదేళ్ల కిందట చెప్పారని, అవన్నీ అయ్యాయా అని ప్రశ్నించారు. 


అభివృద్ధి కోసమే అప్పులు

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేశామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మేడిగడ్డ వద్ద ఉన్న గోదావరిని కొండపోచమ్మ పైకి తీసుకొచ్చామని, ఆ ప్రాంతంలో రెండు పంటలకు 90 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని, అప్పులు చేసి విద్యుత్తు, ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తే రైతులకు లాభమని, సంపద పునరుత్పత్తి అవుతుందని అన్నారు. ‘‘జీవో 111ను రద్దు చేస్తే నా కోసమే తీసేశారంటూ ఓ పిచ్చోడు అంటున్నాడు. దాని తొలగింపునకు వైఎస్‌ హయాంలోనే ప్రయత్నాలు జరిగాయి. 2014, 2018 ఎన్నికల సభల్లో ప్రకటించాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ రూపురేఖలు మారబోతున్నాయి’’ అని కేటీఆర్‌ అన్నారు.


హైదరాబాద్‌లో నిర్మాణ రంగం కుదేలైందని కొందరు చెబుతున్న మాట అవాస్తవమని, గణాంకాలు పరిశీలిస్తే వృద్ధిరేటు స్పష్టమవుతోందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని మునిసిపాలిటీలకు మాస్టర్‌ ప్లాన్‌ తీసుకొస్తామని, జీవో 111ను తీసేసిన ప్రాంతాన్ని కూడా కలుపుకొని హెచ్‌ఎండీఏకు ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను తీసుకొస్తామని చెప్పారు. వరల్డ్‌ క్లాస్‌ ఏజెన్సీ దీనిని రూపొందిస్తోందన్నారు. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఆలస్యమైందని, వీటికి సంబంధించి త్వరలో సీఎ్‌సకు సూచనలు చేస్తామని చెప్పారు. 


బిల్డర్లు, డెవలపర్లకు చురకలు

ఎకరంలో లక్ష చదరపు అడుగులు నిర్మిస్తామంటూ యూడీఎస్‌, ఫ్రీ లాంచ్‌ల పేరుతో ఉన్నవి లేన్నట్లుగా, లేనివి ఉన్నట్లు అమ్మే చర్యలు సరికావని, డెవలపర్లు, బిల్డర్లు స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి కేటీఆర్‌ సుతిమెత్తగా హెచ్చరించారు. బంగారు బాతు అని ఒకేసారి కోసేస్తే నగరం నాశనమవుతుందన్నారు. ఐటీ కారిడార్‌కే డెవలపర్లు, బిల్డర్లు పరిమితమవ్వకూడదని, ఫార్మా సిటీ, దుండిగల్‌, సుల్తాన్‌పూర్‌ తదితర ప్రాంతాలకూ నిర్మాణ ప్రాజెక్టులను విస్తరించాలని సూచించారు. పరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎ్‌సఐ)లో బిల్డర్లు వెళ్లాలని, ఇంకా కావాలంటే టీడీఆర్‌ తీసుకోవాలని సూచించారు.


కొత్త ఏరియా ప్లానింగ్‌లో వారిని భాగస్వాములను చేయడం కుదరదని, అవసరమైన సూచనలు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. నిర్దేశిత అప్రోచ్‌ రోడ్డు లేకుంటే డెవలపర్లకు పెనాల్టీలు వేసి రోడ్ల విస్తరణకు వినియోగిస్తామని తెలిపారు. తొలుత క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడారు. నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు మూడు నెలలపాటు రిజిస్ర్టేషన్‌ చార్జీలు తగ్గించాలని, మహిళల పేరుతో రిజిస్ర్టేషన్‌ చేస్తే ఒక శాతం ఫీజు శాశ్వతంగా తగ్గించేట్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై మంత్రి నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశించిన డెవలపర్లు, బిల్డర్లకు నిరాశ ఎదురైంది.హైదరాబాద్‌లో రాత్రంతా కరెంటు లేదు: బొత్స

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను గురువారం రాత్రి హైదరాబాద్‌లోనే ఉన్నాను. అక్కడ కరెంటు లేదు. రాత్రంతా జనరేటర్‌ వేసుకోవాల్సి వచ్చింది’’ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘ఏపీలో రోడ్లు బాలేవని, కరెంటు లేదని ఎవరో చెప్పారని కేటీఆర్‌ చెబుతున్నారు. కానీ, హైదరాబాద్‌లో కరెంటు లేదని నేనే ప్రత్యక్షంగా చూశాను. రోడ్లు బాగాలేవని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రోడ్డు మీదే నిలుచుని మాట్లాడుతున్నాం కదా? తక్షణమే కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’అని అన్నారు.


తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు: సజ్జల

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడేటప్పుడు.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఐనా, మరెవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి’’ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను ఆయన ఖండిచారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. సుమారు రూ.50-60 వేల కోట్ల ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. ఏపీకి రాజధాని లేకుండానే విభజన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌ హై వే వైఎస్‌ హయాంలోనే చేపట్టారు. అధిక వర్షాల వల్లే ఏపీలో రోడ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు’’ అని అన్నారు.


ఆ డ్రగ్స్‌ కల్చర్‌ మనకు లేదు:  ఏపీ మంత్రి వనిత

మహారాణిపేట (విశాఖపట్నం), ఏప్రిల్‌ 29: తెలంగాణ తరహా డ్రగ్స్‌ వినియోగం, పబ్‌ కల్చర్‌ రాష్ట్రంలో లేవని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచి భారీగా రెవెన్యూ ఉండేది. విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంలో అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. వాటిని తట్టుకుంటూ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం’’ అని అన్నారు. అయితే తెలంగాణతో పోల్చితే కొంత నెమ్మదిగా ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు.


ఆ మిత్రుడెవరో చెప్పండి.. దుస్థితి చూపిస్తాం: డీకే అరుణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌29(ఆంధ్రజ్యోతి): ఏపీలోని అధ్వాన్న పరిస్థితులపై ఫోన్‌చేసి చెప్పిన మిత్రుడి పేరు చెబితే, మన రాష్ట్రంలోని దుస్థితిని చూపిస్తానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మంత్రి కేటీఆర్‌కు విజ్ణప్తి చేశారు. మీ మిత్రుడు కేవలం మీ ఫాంహౌస్‌ చుట్టుపక్కల ప్రాంతాలను చూసి రాష్ట్రమంతా కూడా అలాగే ఉంటుందన్న భ్రమలో ఉన్నట్టున్నారని ఎద్దేవా చేశారు. సొంతడబ్బా కొట్టుకోవడంలో మీరు సిద్ధహస్తులన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటే అది మీ అవివేకమే అని విమర్శించారు. రాష్ట్రంలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో, తాగునీరు, విద్యుత్తు సరఫరా ఎంత దయనీయంగా ఉందో క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమా? అని డీకే అరుణ కేటీఆర్‌కు సవాల్‌ చేశారు.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.