పాటే నా చదువు నాన్నే నా గురువు

ABN , First Publish Date - 2022-03-16T05:30:00+05:30 IST

ఆమె అక్షరం నేర్వలేదు. కానీ ఆమె నాలుక మీద వందల పాటలు, గోండు పురాణాలు, మహాభారత ఘట్టాలు, వీరగాథలన్నో నర్తిస్తాయి. కట్టుబాటును కాదని గొంతు సవరించిన....

పాటే నా చదువు నాన్నే నా గురువు

ఆమె అక్షరం నేర్వలేదు. కానీ ఆమె నాలుక మీద వందల పాటలు, గోండు పురాణాలు, మహాభారత ఘట్టాలు, వీరగాథలన్నో నర్తిస్తాయి. కట్టుబాటును కాదని గొంతు సవరించిన ఆమెకు అడుగడుగునా అవమానాలు, ఛీత్కారాలే! అయినా, వెనకడుగు వేయకుండా పురుషాధిక్య సమాజంలో ఒక ధిక్కార స్వరంగా నిలిచిన ఆమె... మర్సకొల కళావతి. ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల తండాకి చెందిన ఆమెను తెలంగాణ ప్రభుత్వం ‘విశిష్ట మహిళా పురస్కారం’తో సత్కరించింది. ఈ సందర్భంగా తన పాట గురించీ, ‘తోటి’ కళాకారుల ఆచార, వ్యవహారాల గురించి కళావతి తి‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.


‘‘ఏడాదిలో ఆరు నెలలు ఊరూరా తిరుగుతూ పాటలు పాడడం... మిగతారోజులు పొలం పనులకెళ్లడం... అదే మా బతుకుతెరువు. మా నాయన నేర్పిన పాట, నా గొంతు... ఇవే నాకున్న ఆస్తిపాస్తులు. మాది ఆదిలాబాద్‌ జిల్లా, గుడిహత్నూర్‌ మండంలోని తోషం గ్రామం. మమ్మల్ని ‘తోటి’ కళాకారులంటారు. గోండురాజులకు, కొలాములకు మాది ఆశ్రిత కులం. వాళ్ల సంస్కృతి, చరిత్రను తెలిపే ప్రాచీన గాథలు, పురాణాలు, వీరుల కథలను పాడుతూ పొట్టపోసుకోవడం మా కులవృత్తి. అయితే, మా కళా బృందాల్లో మగవాళ్లే పాడాలి. ఆడవాళ్లు బాజాలు వాయించడమో, కోరస్‌ ఇయ్యడమో మాత్రమే చేయాలి. అందుకు భిన్నంగా నేను పాడతాను. అది నచ్చని చాలామంది మగవాళ్లు నన్ను చాలాసార్లు నోటికొచ్చినట్లు తిట్టారు. ‘‘ఆడోళ్లు పాడటమేంద’’ని అవమానించారు. ఇప్పటికీ మా ఊర్లో కొందరు నన్ను శత్రువులా చూస్తారు. దాంతో వెలుగుండి కూడా చీకటన్నట్టే అయింది నా బతుకు. అయినా, నేనెన్నడూ భయపడలేదు. లోకమేమనుకున్నా సరే... పాడడమూ ఆపలేదు. ఎందుకంటే, నా బొందిలో ప్రాణమున్నంత వరకు పాడతానని మా నాయనకు మాటిచ్చాను.! 


ఆ వారసత్వం నిలబెట్టాలని...

మా నాయన పేరు తొడసం భీంరావు. పెద్ద గాయకుడిగా ఆయనకు పేరుంది. నా తమ్ముడు ఏడేళ్ల వయసులో పాము కరవడంతో చచ్చిపోయాడు. మిగిలిన సంతానం నేనే. ఒకరోజు నాయన నాతో ‘‘కూతురైనా, కొడుకైనా నాకు నువ్వే. నేను పోయాక... నాతో పాటే మన పాటలు, గాథలు కూడా పోతాయి. అప్పుడికనా పేరు నిలబెట్టేవాళ్ళెవరు?’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేము పాడే పాటలు, చెప్పే కథలు... అన్నీ గోండు భాషలో ఉంటాయి. పైగా అవి గోండు రాజులు, కొలాముల చరిత్ర, సంస్కృతికి ఆధారమైనవి. వాటికి లిపి లేదు. అవి తనతోనే ఆగిపోకూడదనేది ఆయన కోరిక. నేను స్కూలుకి పోతానని ఏడ్చాను. కానీ బడికి పంపకుండా, రోజూ నన్ను తన ముందర కూర్చోబెట్టుకొని పాటలు, కథలు, పురాణాలు నేర్పించాడు. అవన్నీ నా నాలుకమీదే ఆడుతూ ఉంటాయి. అదే నా చదువు.


ఏడాదంతా పాడినా తరగని పాటలు...

గోండురాజులు, కొలాముల ఇళ్లల్లోని పెళ్లి, చావు, పూజ... ఇలా ప్రతి సందర్భంలో ‘తోటి’ వాళ్లుండాలి. వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో... తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాల్లో గోండులు, కొలాములు ఉన్న పల్లెలకు పోతుంటాం. నా ఇద్దరు కొడుకులను వెంట తీసుకెళతాను. ఇదివరకు ఎంత దూరమైనా కాలినడకనే పోయేవాళ్లం. ఇప్పుడు బస్సులు, ఆటోలు వచ్చాక కాస్త సులువయింది. మర్సుకోల్‌ గోత్రీకుల ఇళ్ళల్లోని కార్యక్రమాలకు మేము దగ్గర ఉండాలి. సందర్భాన్ని బట్టి పాటలు పాడాలి. వాళ్లకు తోచినంత కానుక మాకు ముట్టచెబుతారు.


గోండు రాజులు పెద్ద దేవుడికి కొలుపు చేసేప్పుడు మేము బాజాలు, టుమ్రీ పట్టుకొని దేవుడికి ముందు నడవడం సంప్రదాయం. దసరాకు చేను మీదకెళ్లి... ఇంటికొచ్చిన పెసర్లు, కందులు, కొర్రలు, జొన్నల్లాంటి ధాన్యపు పంటతో మేము పులగం వండి, దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే గోండులు కొత్త పంట తింటారు. వాళ్ల ఇళ్లల్లో ఎవరైనా మరణిస్తే... దినాలకు మమ్మల్ని తప్పనిసరిగా పిలుస్తారు. మేము బృందంగా వెళ్లి... రాత్రి మొదలు తెల్లారేదాకా ‘సానా పాట’ పాడతాం. తిండి గింజలకూ కష్టమైనప్పుడు... ‘అన్నోరాణి’ పాటలు పాడతాం. పెళ్లిళ్లకు వెళ్ళి బాజాలు వాయిస్తాం. నాలుంసగన బీడీ (గోండుల నాలుగు గోత్రాల కథ), ఇంద్రాయి కథాగానం, యేత్మసూర్‌ కథ, జంగూబాయి కథ, మహాభారతం, రామాయణం, కృష్ణుని పాట, నాగోబా పాటలు పాడతాం. వాటిలో ఒక్కొక్కటీ నాలుగైదు రోజులు కూడా సాగుతుంది. అలా ఏడాదంతా పాడినా తరగని పాటలు నా దగ్గర చాలా ఉన్నాయి.


మహారాష్ట్రలోనూ...

ప్రతియేటా డిసెంబరులో మహారాష్ట్రలోని కొలాములు, గోండ్ల గూడేలకు వెళ్తాం. ఆ ఏడాదిలో చనిపోయిన వ్యక్తుల దినాలు ఆ నెలలోనే చేయడం అక్కడ ఆచారం. ఆ సమయంలో మమ్మల్ని పిలిచి ‘కారూన’ (దినాల తంతు) చేయిస్తారు. అప్పుడే వాళ్లకు మైల పోతుంది. ఆ సమయంలో ఇప్ప చెట్టు కింద కూర్చోని ‘సానా’ పాటలు, గాథలు కూడా ఆలపిస్తాం. కొలాములంటే భీముడు, హిడింబి వారసులు అంటారు. వాళ్లు కొలిచే ‘పెర్సపేన వీరుని గాథ’ కూడా చెబుతాను. కోలాములకూ, గోండ్లకూ, మాకు ఆచారాలు, సంప్రదాయాలు ఒకేరీతిగా ఉన్నా, కొలాముల భాష మాత్రం వేరేగా ఉంటుంది. మా మాట, పాట అంతా గోండు భాషలోనే ఉంటుంది.


ఢిల్లీని కట్టింది గోండులే...

ఢిల్లీని కట్టింది కూడా మా గోండు రాజులే.! ఆసిఫాబాద్‌ జిల్లాలోని సీతాగొంది నుంచి పూర్వం యాదురావు రాజు గోండు యమునా నది ఒడ్డున ఉన్న అడవికి వలస వెళ్ళాడనీ, ఆ ప్రాంతాన్ని చదును చేసి పంటలు పండించాడనీ అంటారు. అతనితో పాటు చాలా మంది పేదలు అక్కడికి వెళ్ళి గుడిసెలు కట్టుకొని ఉన్నారనీ, అప్పుడు యాదురావు రాజు ఆ ప్రదేశంలో ఒక దివ్వెను పెట్టి... ‘‘ఇక నుంచి ఇది ఢిల్లీ’’ అని పేరు పెట్టాడనీ మా ‘సీతాగొంది కథ’లో ఉంది. ఆ తరువాత ఆయన వారసుల రాక, వాళ్ళు ఆ నేలను ఏలడం... అదంతా పెద్ద కథ. మాలోని నాలుగు గోత్రాల వాళ్ల కథతో పాటు ఈ గాథను కూడా పండుగల సమయంలో ఆలపిస్తూ ఉంటాం.


ఆరువందలు లేక...

నా భర్త నారాయణ కూలికి మేకలు మేపుతాడు. ఆయన పెద్దగా చురుకైన వాడు కాదు. దాంతో కుటుంబ బాధ్యతంతా నామీదే పడింది. మాకు ముగ్గురమ్మాయిలు, ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రభుదాస్‌, చిన్నవాడు కిష్టు నావెంటే  ఊర్లు తిరుగుతూ కిక్రీ, డక్కి వాయిస్తారు. పెద్దమ్మాయి యశోదకు పెండ్లి అయింది.


ప్రభుదా్‌సకు చదువుకోవాలని ఎంతో కోరిక. అయితే వాడు ఇంటర్‌లో ఉన్నప్పుడు... రూ. 600 పరీక్ష ఫీజు కట్టలేక చదువు మాన్పించాను. ఇప్పుడు నా మగపిల్లలిద్దరూ కూలీ నాలీ చేసి, పెద్ద చెల్లెలు సుశీలను డిగ్రీ, చిన్న చెల్లెలు గోపికను ఇంటర్‌ చదివిస్తున్నారు. మేమంతా చిన్న తడికెల ఇంట్లో తల దాచుకుంటున్నాం. మాదే కాదు, మా కులంలో వారందరిదీ ఇదే పరిస్థితి. మా కులం వాళ్ళకు ఉండడానికి ఇల్లు, నాలుగు వేళ్ళూ లోపలికి పోయేందుకు కాస్త సాగు భూమీ ఇప్పిస్తే... జీవితమంతా ఆ మేలు తలచుకుంటూ బతుకుతాం. మా పాటను బతికించుకుంటాం. మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం.’’


చుక్కబొట్టు...

‘‘గోండులు, కొలాముల్లో ఆడపిల్ల నుదుట చుక్కబొట్టు లేకుండా పెళ్లిళ్లు చేయరు. పల్లెపల్లెకూ పోయి... వాళ్లకు చుక్కబొట్టేసే పని కూడా మాదే! ఇదివరకు ముఖం మీద బొట్టుగా సూర్యచంద్రులను, చేతులమీద పువ్వుల బొమ్మలను దించేటోళ్లం. ఇప్పుడు పిల్లలు టీవీలు, సినిమాల ప్రభావంతో... ఖాళీ ముఖాన చిన్న చుక్క బొట్టు ఒక్కటే పొడిపించుకుంటున్నారు. నడుము నొప్పి వచ్చినా,  మోకాళ్ల నొప్పులు వచ్చినా... చుక్కబొట్టేస్తే తగ్గుతుందని మా నమ్మకం. పిల్లలు పుట్టకపోయినా, పుట్టిన పిల్లలు పురిట్లోనే మరణిస్తున్నా... మమ్మల్ని పిలిచి చుక్కబొట్టు 

పొడిపించుకుంటారు.’’


యూట్యూబ్‌ ద్వారా పేరొచ్చింది...

‘‘కళావతి! నీది మంచి కంఠం. బాగా పాడతావు అని చాలామంది చెబుతూ ఉంటారు. ప్రస్తుతం మా వాళ్ళలో కూడా  పాటలు, పురాణాలు పూర్తిగా పాడగలిగే వాళ్లు చాలా తక్కువయ్యారు. ఆడవాళ్లల్లో అయితే నేనొక్కతినే! ఆల్‌ఇండియా రేడియో ఆదిలాబాద్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ సుమనస్పతి రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నా పాటలను చాలావరకు రికార్డు చేయించారు. అవన్నీ నా పేరుతో యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి. ఆయన అట్లా చేయబట్టే నలుగురికి నా పాట గురించి తెలిసింది. కిందటి ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లో నాకు సన్మానం చేశారు. తెలంగాణ  ప్రభుత్వం నన్ను ‘విశిష్ట మహిళా పురస్కారం’తో సన్మానించింది. అది నా పాటకు దక్కిన గౌరవం. మారుమూల మరుగున పడిన మా ఆదివాసీల పాటలకు గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది.’’


కష్టాలొస్తే అవి పాడుకుంటాం...

‘‘జొన్నగట్కా, జొన్నరొట్టె, మక్కగట్కా... ఇదే మా తిండి. ఆకాడి, అమాస పండగలప్పుడు మాత్రం ఉడకబెట్టిన ఇప్ప పువ్వులో జొన్నపిండి కలిపి గారెలు చేస్తాం. ఇప్ప చెట్టును పూజిస్తాం. ఆ చెట్టు కొయ్యతో దేవుణ్ణి చెక్కుతారు. మేము దాన్నే కొలుస్తాం. పెద్ద పండగ చేసినా ఆ చెట్టు కిందే! ఇప్పచెట్టు మీదా చాలా గాథలున్నాయి. కష్ట నష్టాలు ఎదురైనప్పుడు అవన్నీ పాడుకుంటాం.’’


కె. వెంకటేశ్‌

Updated Date - 2022-03-16T05:30:00+05:30 IST