ఆదిలాబాద్‌కే గిరిజన వర్సిటీ అర్హత

ABN , First Publish Date - 2022-07-28T10:18:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం – 2014, షెడ్యూలు 13లో తెలంగాణకు కేటాయించిన ట్రైబల్‌ యూనివర్సిటీని ఇప్పటివరకు నెలకొల్పకుండా ఎనిమిదేళ్ళు కేంద్ర, రాష్ట్ర పాలకులు తాత్సారం చేశారు...

ఆదిలాబాద్‌కే గిరిజన వర్సిటీ అర్హత

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం – 2014, షెడ్యూలు 13లో తెలంగాణకు కేటాయించిన ట్రైబల్‌ యూనివర్సిటీని ఇప్పటివరకు నెలకొల్పకుండా ఎనిమిదేళ్ళు కేంద్ర, రాష్ట్ర పాలకులు తాత్సారం చేశారు. ఆదివాసీ విద్యార్థులు, విద్యార్థి ప్రజాసంఘాల సుదీర్ఘ పోరాటం, ఉపాధ్యాయులు ప్రజాస్వామికవాదుల మద్దతుతో అనేక ఆందోళనల తర్వాత, అంతిమంగా 2022 వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. దీన్ని స్వాగతించాలి. ఇదే సందర్భంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మెజారిటీ ఆదివాసీ తెగలు నివసిస్తున్న ఐదవ షెడ్యూల్ ప్రాంతం ఆదిలాబాదులోని ఉట్నూరు కేంద్రంగా నెలకొల్పితే దాని ఉపయోగం ద్విగుణీకృతమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ వ్యాప్తంగా (కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌) 3.5 లక్షల మంది మూల ఆదివాసీ తెగల ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో గోండు, కొలాం, నాయక్‌ పోడ్‌, కోయా, ప్రధాణ్‌, కొండరెడ్లు, తోటి తదితర తెగలవారు ఉన్నారు. భౌగోళికంగా ఆదిలాబాద్‌ జిల్లా మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉంది. అంతేగాక, తెలంగాణలోని ఆదివాసీ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటున్నది. అంతరాష్ట్ర 44–జాతీయ రహదారి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలైన్‌ ఇక్కడ ఉన్నాయి. 2013లోనే విశ్వవిద్యాలయ స్థాపనకు కావాల్సిన భూమిని ఉట్నూరు కేంద్రంలో గుర్తించారు.


బ్రిటిష్‌ వలస పాలన నుంచి నేటి వరకు ఇక్కడి ఆదివాసీలు విద్యకు నోచుకోవడం లేదు. ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో అరకొర వసతుల మధ్య ఆదివాసీ విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. 100లో 30శాతం కూడా ఇంటర్మీడియట్‌ స్థాయి విద్య వరకు చేరడం లేదు 10 శాతం కూడా యూనివర్సిటీ స్థాయికి చేరటం లేదు. జిల్లాలో ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా డ్రాపౌట్‌ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 


విద్యా బోధన అనేది ఉత్పత్తితో నిరంతరం సంబంధం కలిగి ఉంటేనే సమాజ అభివృద్ధి సాధ్యం. ఆదివాసీ ఉత్పత్తి విధానాన్ని అధ్యయనం చేసేందుకు షెడ్యూల్‌ ఐదవ ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతం శాస్త్రీయంగా అనువైనది. ఆదివాసీ కళలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవనవిధానం, ఆదివాసీల మూల వైద్యం, పోడు వ్యవసాయం తదితర అంశాలపై పరిశోధన జరిపేందుకు ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. యూజీసీ దేశంలో ఉన్నత విద్యా సంస్థల స్థాపనకు అనువైన ప్రాంతాల అధ్యయనానికి నియమించిన ప్రొఫెసర్ల కమిటీ ఆదిలాబాద్‌ ప్రాంతంలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు అనువైన అవకాశాలు పూర్తిస్థాయిలో ఉన్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిశోధనలు జరగాలన్నా, ఆదివాసీ సంస్కృతి, భాష, వనరులు, ప్రకృతి సంపదను కాపాడాలన్నా ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు కేంద్రంగా విశ్వవిద్యాలయం నెలకొల్పడం తప్పనిసరి.


ఆదివాసీ ప్రాంతాలలోని వనరులపై, ఇతర రంగాలపై పరిశోధనలు ప్రారంభిస్తేనే అక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆదివాసీలు పరిశోధకులు అయితే అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రజాస్వామిక జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకూ తెలియపరచే విధంగా పాఠ్యాంశాలలో పొందుపరచుకోగలుగుతారు. ఆర్థికంగా వెనుకబడిన ఏజెన్సీ ఏరియాలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.


2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ జోడేఘాట్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో యూనివర్సిటీ నెలకొల్పుతామని, ఐదవ షెడ్యూలు ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని హామీ ఇచ్చారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో యూనివర్సిటీ నెలకొల్పడంతోపాటు, మెడికల్‌ కళాశాల స్థాపన తదితర బూటకపు హామీలతో కేంద్రంలోని బీజేపీ పాలకులు ఆదిలాబాద్‌ జిల్లా పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వర్సిటీపై అనేక హామీలు ఇచ్చిన టీఆర్‌ఎస్, బీజేపీ పాలకులు వాటిని విస్మరించడం సమంజసం కాదు. ఆదివాసీల మనుగడకు దోహదపడే విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఆదిలాబాద్‌ (ఉట్నూరు)లో నెలకొల్పడం న్యాయమైన, ప్రజాస్వామికమైన చర్య అవుతుంది. ఉట్నూర్‌ కేంద్రంగా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంతో పాటు యూనివర్సిటీకి అనుబంధంగా వివిధ ఆదివాసీ జిల్లాలలో రీసెర్చ్‌ సెంటర్లు నెలకొల్పడం కూడా ఉపయోగకరం.

కె. ఆనంద్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌

Updated Date - 2022-07-28T10:18:59+05:30 IST