మద్యానికి బానిసలై.. స్పిరిట్‌ తాగేసి..

ABN , First Publish Date - 2022-08-06T09:14:54+05:30 IST

మద్యానికి బానిసలై.. స్పిరిట్‌ తాగేసి..

మద్యానికి బానిసలై.. స్పిరిట్‌ తాగేసి..

వృద్ధ దంపతుల మృత్యువాత

అధిక ధరకు మద్యం కొనలేక స్పిరిట్‌కు అలవాటు

అది తాగేసి.. శాశ్వత నిద్రలోకి

విజయవాడ వాంబే కాలనీలో విషాదం


విజయవాడ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మద్యం మహమ్మారి రెండు నిండు జీవితాలను బలి తీసుకుంది. మద్యానికి బానిసలై.. అధిక ధరకు దానిని కొనలేక.. స్పిరిట్‌ తాగేసి వృద్ధ దంపతులు మృత్యువాత పడ్డారు. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. వాంబేకాలనీ ‘ఎ’ బ్లాక్‌ 8లో సింగిడి కొండయ్య(60), పైడమ్మ(65) సహజీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ కలిసి తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ జీవిస్తున్నారు. వారికి వృద్ధాప్య పింఛను కూడా వస్తోంది. కొన్నాళ్లుగా కొండయ్య, పైడమ్మ ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. మద్యం ధరలు భారీగా ఉండడంతో తక్కువ ధరకు లభించే స్పిరిట్‌కు అలవాటు పడ్డారు. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మద్యం తాగడం, డబ్బులు సరిపోనప్పుడు స్పిరిట్‌ తాగడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొండయ్య మద్యం సీసాలతోపాటు స్పిరిట్‌ సీసాలనూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. గురువారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం, స్పిరిట్‌ తాగి పడుకున్నారు. పక్క బ్లాక్‌లో ఉంటున్న పైడమ్మ మనవరాలు దుర్గ శుక్రవారం ఉదయం కూరగాయల కోసం అమ్మమ్మ ఇంటికి రాగా.. పైడమ్మ, కొండయ్య ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వారి ముక్కు, నోటి నుంచి రక్తస్రావం అయ్యింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పిరిట్‌, లిక్కర్‌ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-08-06T09:14:54+05:30 IST